ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నిరూపించుకోవాలి!-- బాలవర్ధిరాజు మల్లారం
August 24, 2020 • T. VEDANTA SURY • Poem

.ఓ నేస్తమా!
నీ అనురాగం 
అడవి గాచిన వెన్నెలైనప్పుడు
నీ ప్రేమ 
బూడిదలో పోసిన పన్నీరైనప్పుడు
నీ ఆత్మీయత 
అపాత్రాదానం అయినప్పుడు 
నీ మంచితనానికి 
వంచనయే మిగిలినప్పుడు 
నీ స్నేహానికి 
ద్రోహమే జరిగినప్పుడు 
నీ శాంతాన్ని 
చేతగాని తనంగా భావించినప్పుడు 
నీ ఆదర్శాలను 
అవహేళన చేసినప్పుడు 
నీ ఆశ(యా)ల సౌధం 
పునాదులతో సహా పెకిలించి వేయబడినప్పుడు
నీ వేదనంతా 
అరణ్య రోదనైనప్పుడు 
నీ మిత్ర బృందంలో 
స్నేహానురాగాలు మంచులా కరిగిపోతున్నప్పుడు 
నీ బంధు జనంలో
మమతానుబంధాలు దూది పింజల్లా ఎగిరిపోతున్నప్పుడు 
ఆవేదన నిన్ను అలుముకున్నప్పుడు 
అవమానాలు నిన్ను ఆవరించినప్పుడు 
నీలోని నిరాశా నిస్పృహలను తుంచుకోవాలి !
నీలో మనోధైర్యాన్ని పెంచుకోవాలి!!
నీవేంటో 
నీకు నువ్వే నిరూపించుకోవాలి!!!