ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నిశ్శబ్ద దీపావళి : --కె ఎస్ అనంతాచార్య
November 16, 2020 • T. VEDANTA SURY • Poem

బాంబుల మోతలు వినిపించడం లేదు 
రాకెట్లు ఎగగరడం లేదు
 థౌసేండ్ వాలాల ప్రేలాపనలు లేవు  
 చెవులకడ్డం చేతులు లేవు 

అంత నిశ్శబ్దం 
కొత్త అల్లుళ్లు  ఆలిపక్కన 
అత్తింటి లో  గుట్టు చప్పుడు లేకుండా 
కంటి మీద కునుకులేకుండా కూసున్నరు

మంగళహారతులు లో  మరదళ్ల హడావుడి లేదు 
 బావల సరసాల  తోక బాంబులు తుస్సుమన్నాయి 

నరకుడిప్పుడు  కొత్త రూపు లో భూమి పైనే సిద్ధంగా ఉండి యుద్ధం చేస్తున్నాడు 

నీవెక్కడుంటే నేనక్కడంటూ 
షాపింగ్ మాల్ లో ప్యాకింగై రెక్కల మీద
 కింగై ఊరేగుతున్నాడు జర జాగ్రత్త 

సుతిలి బాంబులా అరవడు చిచ్చుబుడ్డీ
లా పూలు పరవడు 
భూచక్రం లా చుట్టు ముడుతాడు పామ్ బిళ్ళలా నుసి చేస్తాడు

అమాస చీకట్లో ధూలి కణమై తూగుతున్నాడు ప్రతి రూపాలన్ని ప్రమిదల వెనక నీడలై నిలబడ్డాయి 

ఈ నరకుడెప్పుడూ ఎదురు పడడు కంటికి కనపడడు అంతర్యుద్ధం లో ఆరితేరిన మల్లయోధుడు 

ఈ పండుగకు
టపాసులు కాల్చకున్నా  ఫరవాలేదు కరోనా ఊపిరి పీల్చకుంటే చాలు 

నోములు నోచుకోకున్నా మానే!
 ఊపిరి దక్కితే చాలు 

మహాలక్ష్మి అమ్మకైనా దయ వస్తుందో ధన్వంతరిని ఆదేశించి 
మందు పంపి ఆదు కొంటుందో యని లోకం 
ఎదిరి చూస్తుంది ఆ రోజు క్రాకర్స్ పేలుద్దామని దీపావళి ని కొత్త రూపంలో  ఆవిష్కరిద్దామని