ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నీలిగొడుగు--రస్కిన్ బాండ్ ఓ సుప్రసిద్ధ రచయిత. ఆయన అనేక రచనలు చేశారు. అందులోనూ పిల్లలకోసం ముప్పై పుస్తకాలు రాశారు. "Our trees still grow in Tehra" అనే పుస్తకానికి ఆయనకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన రాసిన ఓ రచనను టూకీగా చెప్పుకునే ముందర రస్కిన్ జీవితం గురించి ఒకటి రెండు విషయాలు చూద్దాం.....1934 మే 19వ తేదీన హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలో కసౌలీలో జన్మించిన రస్కిన్ బాండ్ బ్రిటిష్ మూలాలు కలిగిన ఓ భారతీయ రచయిత. ఆయన తల్లిదండ్రులు ఎడిత్ క్లార్క్, ఆబ్రే అలెగ్జాండర్ బాండ్. తనను దత్తత తీసుకున్న కుటుంబంతో మన దేశంలోని ముస్సూరీలోని లాండౌర్‌లో నివసింంచారు. బాల సాహిత్యానికి ఆయన చేసిన కృషికిగాను భారత ప్రభుత్వం ఆయనను 1992లో సాహిత్య అకాడమీ పురస్కారంతో సత్కరించింది. అంతే కాకుండా ఆయనకు 1999 లో పద్మశ్రీ, 2014 లో పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి. రస్కిన్ ఎనిమిదో ఏట అతని తల్లి తండ్రి నుండి విడిపోయి, ఓపంజాబీని వివాహం చేసుకున్నారు. తన పదో ఏట తండ్రిని కోల్పోయారు. అనంతరం డెహ్రాడూన్‌లో ఉంటున్న ఆయన తల్లి, సవతి తండ్రి రస్కిన్ ని పెంచారు. 1951 లో తన పదహారో ఏట తొలి కథ రాశారు. రస్టీ అనే అనాథ ఆంగ్లో-ఇండియన్ బాలుడి యొక్క జీవిత కథ అంశంగా ఆయన తన తొలి నవల రాశారు. దాని పేరు "ది రూమ్ ఆన్ ది రూఫ్". ఈ నవలకు 30 జాన్ లెవెల్లిన్ రైస్ బహుమతి లభించింది.కొంతకాలం ఓ ఫోటో స్టూడియోలో పనిచేసిన రస్కిన్ వార్తాపత్రికలు, పత్రికలకు ఎన్నో కథలు, కవితలు రాసుకుని బతికారు. ఆయన సీన్స్ ఫ్రమ్ ఎ రైటర్స్ లైఫ్ పేరుతో తన ఆత్మకథను రాసుకున్నారు.1963 నుంచీ హిమాలయ పర్వత ప్రాంతంలోని ముస్సూరీలో ఒక ఫ్రీలాన్స్ రచయితగా ఉంటూ వచ్చారు. ఆయన రాసిన నీలి గొడుగు కథను విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో సినిమాగా విడుదలైంది. హిమాచల్ ప్రదేశ్ లో ఓ పల్లెలో ఓ బాలిక కథ ఇది. ఓసారి కొందరు విదేశీయులు ప్రకృతి సౌందర్రాన్ని తిలకించడం కోసం ఈ అమ్మాయి పల్లెకు వస్తారు. అలా వచ్చిన విదేశీయులలో ఒకరి దగ్గర ఓ నీలిరంగు గొడుగు ఉంటుంది. అయితే ఈ అమ్మాయి తన దగ్గరున్న పులి గోరు అతనికిచ్చి తనకిష్టమైన ఆ నీలిరంగు గొడుగు తీసుకుంటుంది. అనంతరం ఆ గొడుగుని ఊళ్ళోని వారందరికీ చూపించి సంతోషపడుతుంది. ఆడుతుంది. పాడుతుంది.ఆ పల్లెలో ఓ బడ్డీ కొట్టు ఉంది.ఆ కొట్టు యజమాని నందకిశోర్. అతను నక్కజిత్తులవాడు. మాయమాటలు చెప్పి అతను ఆ అమ్మాయి దగ్గరున్న గొడుగుని కొట్టెయ్యాలను కుంటాడు. కాని ఆ పిల్ల ఇవ్వదు. దాంతో నందకిశోర్ కి కోపమొచ్చి ఓరోజు ఆమె దగ్గర నుంచి తస్కరించి దాచేస్తాడు. అయితే ఊరంతా వెతికిన ఆమెకు నందకిశోరే తన గొడుగుని దొంగిలించి ఉంటాడని అనుమానం. కానీ తన అనుమానం నిజం చేయడానికి ఆమె దగ్గర ఆధారాలేవీ లేవు. అయినా ఆమె తన ప్రయత్నాన్ని వదులుకోక ఎలా నందకిశోర్ నుంచి గొడుగును పొందిందనేదే కథ.- యామిజాల జగదీశ్
July 26, 2020 • T. VEDANTA SURY • Book Review