ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నేను బాలసాహిత్యంలోకి అడుగు పెట్టే ముందుగురజాడ, ఆరుద్ర, దాశ‌రథి, జంథ్యాల, నండూరి, శ్రీ శ్రీ, సినారే, వెలగావెంకప్పయ్య, జొన్నలగడ్డ. శ్యామల, రెడ్డి. రాఘవయ్య, పత్తిపాక మోహన్, వేదాంత.సూరి, చొక్కాపు. వెంకటరమణ, దాసరి. వెంకటరమణ, పైడిమర్రి రామకృష్ణ, ఆకెళ్ళ.వెంకట సుబ్బలక్ష్మి, కందేపి, ఆలపర్తి వెంకట సుబ్బారావు, మాచిరాజు, కలువకొలను సదానందం, కే. కే రఘు నందన్, ఎన్వీఆర్ సత్యనారాయణ, గంగిశెట్టి, నారంశెట్టి, బెలగాం, బెహరా,.పుట్టగుంట..... ఇలా ఎందరో ఎందరో ప్రౌఢసాహిత్యానికి, బాలసాహిత్యానికి సంబంధిం చిన రచయితల పుస్తకాలు చదవడం జరిగింది. నేను 1967 నుండి 2003 వరకూ ఇంగ్లీషు, తెలుగు భాషల్లో వ్యాసాలు మాత్రమే వ్రాసేవాడను. 2003 తరువాత కవితలు, 2007 తరువాత బాలసాహిత్యంలోనికి ప్రవేశించడం జరిగింది. బాలసాహిత్యా నికి సంబంధించి అనేక రచనలు చదవబట్టే అతి తక్కువ కాలంలో ఎక్కువ రచనలు చేయగలిగాను. ప్రౌఢసాహిత్యం వలన వివిధ రచయితల భాషాపటిమ, హావభావాలు, కాలమాన పరిస్థితులు, అప్పటి సాంఘిక సమస్యలు, పరిష్కార మార్గాలు పాఠకునిగా మనం తెలుసుకో వచ్చు. గురజాడ 5 కథలు వ్రాసారనీ అంటారు. కానీ లెక్కకు ఆరు వస్తున్నాయి. అవి 1 దిద్దుబాటు 2 మెటిల్డా 3. సంస్కర్త హృదయం (చాలాపెద్ద కథ) 4 మతము--విమతము 5 సౌదామిని 6. మీ పేరేమిటి ? ఈ కథలన్నీ గురజాడ రచనలేనని ' మహాకవి గురజాడ శత వర్ధంతి సారస్వత నీరాజనం 'లో పేర్కొన్నారు. ఇతర పుస్తకాలలో గుడా ఈ ఆరు పుస్తకాల పేర్లు పేర్కొంటున్నారు. తెలుగు ఆధునిక కథల సృష్టికి ఆధ్యుడు. " మెటిల్డా" కథ 1895లో వ్రాయబడిందని కొన్ని గ్రంథముల ద్వారా నేను తెలుసుకున్న విషయం. అయితే సెట్టి. ఈశ్వరరావుగారు తెలిపిన సమాచారాన్ని బట్టి " మెటిల్డా " కథకు ఆధారం ఒక వంటలక్క గురజాడకు చెప్పిన కథ ఆధారంగా ఆయనఈ కథను వ్రాసారని తెలుస్తోంది. యూరోపియన్ సాహిత్యంలో " మెటల్డా" లాంటి పాత్ర ఉండొచ్చు అంటున్నారు. గురజాడ వ్రాసిన ఆధునిక కథలలో మొదటిది " దిద్దుబాటు''. 1910 ఫిబ్రవరిలో ' ఆంధ్ర భారతి' అనే పత్రికలో ప్రచురిత మైంది. దిద్దుబాటు కథ ఆనాటి సాంఘిక పరిస్థితులను తెలియజెప్పే కథ. గురజాడ ఈ 'దిద్దుబాటు ' కథ వ్రాసేనాటికి పేదరాశి పెద్దమ్మ కథలు, తెనాలి రామలింగని కథలు, పంచతంత్రం కథలు, మదనకామరాజు కథలు ప్రజలలో ప్రాచుర్యం పొందాయి.' దిద్దుబాటు' ఆధునిక తరహాగా ఉన్న కథలలో మొదటిది. ఆనాటి సాంఘిక సమస్యలు, పరిష్కారమార్గాలు గురజాడవారు తెలియజేస్తూ హాస్యపూరితంగా ముగిస్తారు. (సశేషం) శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 701 3660 252.
August 5, 2020 • T. VEDANTA SURY • Memories