ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నేను - బాల సాహిత్యం శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
September 1, 2020 • T. VEDANTA SURY • Memories

నేను 1967నుండి 2003 వరకూ తెలుగు, ఇంగ్లీషు  పత్రికలలో అనేక వ్యాసాలు ఎడిటోరియల్ పేజీలలో వ్రాసే  వ్రాసేవాడిని. నేను 2003లో సీతానగరం మండల ఎడ్యుకే షనల్ ఆఫీసరుగా పనిచేస్తున్నప్పుడు మండలంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ విద్యా సంబంధమైన విషయాలపై శిక్షణా తరగతులను నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు.ఆ శిక్షణా తరగతులకు నన్ను'కోర్సు డైరెక్టర్ 'గానూ, బాల సాహిత్యంలో గల విలువలను తెలియజేస్తూ బాలలకు  ఆసాహిత్యం ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుందో ఉపాధ్యాయులకు బోధపరచేందుకు  ప్రముఖ బాలసాహితీ రచయితలు బెలగాం భీమేశ్వరరావు, బెహరా. ఉమామహే శ్వరరావు గార్లను జిల్లా విద్యాశాఖాధి కారివారు నియమిం చారు. ఆ శిక్షణా తరగతులు 12 రోజులు నా ఆధ్వర్యంలో జరిగాయి.  ఆకాలంలోనే  భీమేశ్వరరావుగారు, ఉమామహే శ్వరరావుగారు బాలసాహిత్యం దాని ప్రాముఖ్యత  గూర్చి  శిక్షణా తరగతుల్లో వివరించారు.ఆ సందర్భంగా బాలసాహి  త్యం వైపు నామనసు మళ్ళింది. అంతకుముందు నేను వ్రాసేవన్నీ  విద్యా రంగానికి సంబంధించిన వ్యాసాలు,సామాజిక ,రాజకీయ,అంతర్జాతీయ సమస్యలపై వ్యాసాలుమాత్రమే !  అటువంటి వ్యాసరచన నుండి బాలసాహిత్యా నికి  రావడం కష్టతరమైన విషయమే ! బాలసాహిత్యంలో నున్నవారు జాతీయ, అంతర్జాతీయ  సమాజిక సమస్యలపై రచనలు చేయాలన్నా అనేక గ్రంథాలు, న్యూస్ పేపర్లు, తెలుగు, ఇంగ్లీషు భాషలలో గల విషయాలను చదవాలి. వాటిని అవగాహన చేసుకుని సద్విమర్శతో కూడుకున్న, నిర్మాణాత్మకమైన సూచనలు మేథావులు మెచ్చేవిధంగా వ్రాయాలి. ఏదో వ్రాసేద్దామంటే కుదురదు. సమాజంలో  జరిగే సంఘటనలు  భవిష్యత్తరాలవారికి  చేటును కలిగించకుండా ఉండాలంటే  ప్రభుత్వ బాధ్యత, సమాజిక బాధ్యతను రచయిత గుర్తుచేయాలి.అందుకు తగిన నిర్మాణాత్మక సూచనలు చేయాలి.  ఇక బాలసాహిత్యం విషయానికొస్తే బాలల మనసులు చాలా నిర్మలంగా ఉంటాయి. అందులో బాలసాహిత్యం ద్వారా అమృత  మయమైన స్వచ్ఛమైన భావాలు పిల్లల హృదయాలలో నింపితే  ప్రేమానురాగాలు,ఆదరాభిమానాలు,సౌభ్రాతృత్వం కలిగి ఉంటారు. సామాజిక రుగ్మతలను పోగొట్టి స్వచ్ఛమైన సమసమాజ నిర్మాణానికి, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందింప చేయడానికి బాలసాహిత్యం ఎంతగానే ఉపయోగపడుతుంది.బాలలు ముద్దు ముద్దు మాటలు మాట్లాడే స్థితి నుండి  పాటలు పాడే స్థితికి, పాటలు, పద్యా లు  పాడే స్థితి నుండి కథలు వినడం, చెప్పడం, చిన్న చిన్న నాటికలు వేసే స్థాయికి పెద్దలు తేవచ్చు. దీని వలన బాల్యం నుండి  తల్లి తండ్రి , కుటుంబం, గురువు, సమాజం, దేశం, విశ్వమానవాళిపై  ప్రేమాభిమానాలు అనుకోకుండా బాల్యంనుండే  పెంపొందుతాయి. దేశం  ఉత్తమ పౌరులను పొందగలిగే భాగ్యం బాల సాహిత్యం నుండే లభిస్తుంది. అందుకే బాలసాహిత్యంలో అధికంగా నేను  కృషి చేయడం జరిగింది.   ( సశేషం )