ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నోబెల్ కవిత్వం---అక్షరసత్యం ఈ మాట. అచ్చంగా ఎంతో హుందాగా మృదువుగా మధురంగా ఇంకా ఎన్నెన్ని విధాలుగా చెప్పాలో నా దగ్గర మాటల్లేక ఇలా చెప్పానీ పుస్తకాన్ని.ఇంగ్లీషు బొత్తిగా రాదని చెప్పనుగానీ చదవడం వచ్చు. కానీ అర్థజ్ఞానం శూన్యం. మూడు దశాబ్దాలు పత్రికా రంగంలో ఉన్నప్పటికీ నా మట్టి బుర్రకు ఎందుకో ఇంగ్లీష్ అంటలేదు. ఇంకా చెప్పాలంటే అమ్మ భాషలోనూ నాకేమీ పాండిత్యం లేదు. నలుగురిలో మాట్లాడాలంటే భయం. చెమటలు పట్టేస్తుంది. పరిచయమైతే ఉంది రవ్వంత. అయితే ఇంగ్లీషులో వచ్చిన కవితలకు అనువాదాలు చదవడం నాకిష్టమే. అందులోనే కొంతవరకే ప్రవేశముంది. అలా తిరగేసిన పుస్తకాలు ఒకటీ అరా ఉన్నాయి. వాటిలో నోబెల్ కవిత్వం ఒకటి. సాహిత్యంలో నోబెల్ పురస్కారాలు పొందిన ముప్పై ఏడు మంది కవుల జీవిత, కవిత్వ విశేషాలను సుమధురంగా సమర్పించారు కవిమిత్రులు ముకుందరామారావుగారు. ఎంత హాయిగా ఉందంటే ఆయన రచనా శైలి ఆయా కవులను అక్షరరూపంలో మన ముందు కూర్చోపెట్టినట్లుంది. ఎప్పుడూ చెప్పేదే కానీ మరొక్కసారి చెప్పడమూ నాకిష్టమే. ఆయన పలకరింపు చల్లగాలి స్పర్శలా ఉంటుంది. ఓ సన్నిహితుడిని కలిసినంత ఆనందమేస్తుంది ఆయన పలకరించినా మనం ఆయనను పలకరించినా. ఆయన మాటే అంత సాఫీగా ఉంది కనుకే ఆయన రచనలోనూ మృదుత్వం సొగసూ ప్రతిబింబిస్తాయి. ఆయన ఏ పుస్తకమైనాసరే చదవడం మొదలుపెడితే చివరంటా పట్టుగా చదివిస్తుంది. అందులోని అక్షరాలతో కళ్ళతోపాటు మనసూ ప్రయాణిస్తుంది ఏ ఎగుడూ దిగుడూ లేకుండా. దాదాపు 170 కవితలున్న ఈ పుస్తకం నన్ను ఎంతగా ఆకట్టుకుందో మాటల్లో చెప్పలేను.అనువాదమంటే సాలెగూడుని ఒక చోట నుండి తీసి మరొక చోట వేలాడదీయడంలాంటిదని ఆయన ఈ పుస్తకం ముందుమాటలో చెప్పడమైతే చెప్పారుగానీ ఆ అనువాదాలెక్కడా అనువాదాలనిపించవు. ఆయన సొంతంలా అనిపిస్తాయి. ఎలా ఇంతలా రాసారో అనిపిస్తుంది. నిజమే, అనువాదమనేది క్షిష్టమైన ప్రక్రియే. కానీ ఈయన శైలి ఎక్కడా అలా అనిపించిందెప్పుడూ.ఎవరో విదేశ రచయితలెందుకు...మన విశ్వకవి టాగూరు గురించి ఎన్ని విషయాలు ఎంత గొప్పగా చెప్పారో. ఎన్ని కొత్త విషయాలో. ఆయనకవి పాతవే కావచ్చు. కానీ నావరకైతే అవి కొత్తవీనూ. ఆసక్తి కరమైనవీనూ. టాగూరు గురించి రాస్తూ కష్టాలు వగైరాలో చెప్పిన విషయమొకటి...టాగూరుకి ఆర్థిక ఇబ్బందులు అపవాదులు తక్కువేమీ కావు. 54 పేజీల వీరి మొదటి సంపుటి కవి వృత్తాంతం 1000 కాపీలు వీరి సన్నిహిత మిత్రుడు ప్రబోధ్ చంద్ర ఘోష్ ఆరణాలు (36 పైసలు) వెలతో ప్రచురించారు. వాటికొచ్చిన ప్రచారం మూలంగా 500 కాపీలు అమ్ముడుపోయినా మిగతా 5 వందలు ఏమి చేయాలో తోచలేదు. ఇవికాక మిగిలిన పుస్తకాలన్నీ కలిపి అవసరంకొద్దీ వెయ్యి రూపాయలకు టోకుగా అమ్ముకున్నారు. ....ఇది చదువుతుంటే నేనొకమారు ఓ వంద కాపీలతో ఓ చిన్న పుస్తకం వేసి వాటిలో సగానికిపైగా పంపిణీ చేసి మిగిలినవి తూకానికి అమ్మేసిన విషయం గుర్తుకొచ్చింది. ఇక మరొకపుస్తకమైతే యాభై కాపీలు వేసి అందరికీ ఇచ్చేశాను. అవి తీసుకున్న వారొక్కరైనా చదివారో లేదో కూడా తెలీదు. నా దగ్గర ఒక్కొక్క ప్రతి మిగిలి ఉంది. గుర్తుకోసం దాచుకున్నాను. టాగూర్ కవితకు ముకుందరామారావుగారి అనువాదం... నిశ్శబ్ద స్వరం నా పదాల్ని స్పృశించినప్పుడే అతనెవరో నాకు తెలుసు అంచాతనేను నాకు తెలుసు... ఈ పుస్తకంలో ఆయన పరిచయం చేసిన కవులందరి విశేషాలన్నీ ఆసక్తికరమైనవే. ఆయన చేసిన అనువాద కవితలలో ఒకటి రెండిక్కడ ఇస్తున్నాను.... 1 సూర్యకిరణాలు గుచ్చుకుని ప్రపంచ హృదయం దగ్గర అందరూ ఒంటరిగానే నిల్చుంటారు హఠాత్తుగా సాయంత్రమవుతుంది (కవి సాల్వటొరీ క్వాసిమోడో, సిసిలీ). 2 ఆలోచనకు గమ్యం లేదు ప్రార్థనకు తండ్రి లేడు బాధకు ఇల్లు లేదు ఆశకు తల్లి లేదు బొడ్డు పేగు లేకుండా పుట్టి తెలియకుండా మరణించి శూన్యం నుండొచ్చి శూన్యానికి తిరిగిపోతుంది (పార్ ఫాబియన్ లాగెర్ క్విస్ట్. దక్షిణ స్వీడన్ స్మాలాండ్లోని ఓ చిన్న పట్టణంలో పుట్టారు) 3 నా పాటని కోటుగా చేసాను మడమ నుండి గొంతు వరకు పాత పురాణాల అల్లికలతో కప్పాను కానీ మూర్ఖులు దాన్ని చేజిక్కించుకున్నారు వాళ్ళే తయారుచేసినట్టు ప్రపంచం ముందు దాన్ని తొడుక్కున్నారు వాళ్ళనే పాట తీసుకోనీ ఎందుకంటే నగ్నంగా నడవడంలోనే ఎక్కువ సాహసముంది - (విలియం బటలర్ ఏట్స్, సాండీ మౌంట్, కౌంటీ డుబ్లిన్ లో జననం) 4 నా అన్ని నికృష్ట రహస్యాలూ ఒకదాని తరువాత ఒకటి బహిర్గతమవుతాయి కొండశిఖరం లాంటి ఎత్తయిన దారిలో కూడా ఎంత అల్పమైన బతుకు అని వాళ్ళంటారు (చెస్వావ్ మిలోష్. లిథుయానియాలో జననం) టామస్ ట్రాంస్ట్రోహ్మర్ అనే స్వీడన్ దేశస్తుడి రచనలు అరవై భాషల్లోకి అనువదింపబడ్డాయట. ఈయనకు నోబెల్ పురస్కారం 2011లో దక్కింది.కవులకు నోబెల్ బహుమతులు, కొన్ని పరిశీలనల వ్యాసంకూడా ఉపయుక్తమే.పాఠకలోకానికిమంచి పుస్తకాన్నందించిన ముకుందరామారావుగారికి ధన్యవాదాలు.- యామిజాల జగదీశ్
August 3, 2020 • T. VEDANTA SURY • Book Review