ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పండుగ_ముచ్చట్లు- సరోజ పోచమల్లు
October 2, 2020 • T. VEDANTA SURY • Memories

మొన్న దాకా గొంత పండుగ ముచ్చట జెప్పిన గదా. ఇగ ఇయ్యల గొంత ముచ్చట సెప్త.
ఇగ బతుకమ్మ అంటే తీరొక్క పువ్వుల జాతరేనాయే.గిప్పుడు అయితే బతుకమ్మ అచ్చింది అంటే అన్ని పువ్వులు అంగట్ల వెట్టి అమ్ముతండ్రు గాని ఎనకట పువ్వులు గిట్ల అమ్మకపోయేది.
మాకైతే మా బాపు పోకపోయేది గాని గునక పువ్వుకు మా అన్న ఆళ్ల సోపతి గాళ్లతోని సైకిల్ మీద పొయ్యి తెచ్చేది..ఎవలన్న పెద్ద మనుషులు పువ్వుకు వోను శాతగానోళ్లు ఉంటే గాళ్లకు సుత తెచ్చేది ..
ఇగ బతుకమ్మ మీద తామర పువ్వులు సుత పెట్టేది. ఊళ్లే సెర్లకు వొయ్యి తామర పువ్వులు కూడా తెచ్చేది..
ఇగ గి పండుగ  అయితే ఆడిబిడ్డల పండుగేనాయే. కొత్తగ లగ్గం అయిన ఆడి పొలిగాండ్లు గి పండుగ కోసం జెప్పన రావాలి అని ఎదురు సూత్తరు.పండుగకు సాన దినాల ముందే ఆళ్ల అయ్య,అవ్వలు అచ్చి అవ్వగారి ఇంటికి జెల్దిన తోలుక పోతరు అని.ఎనకట అవ్వగారి ఇంటికి పోవుడు అంటే సాలు ఆడి పొలిగాండ్లు సంకలు గుద్దేది..సిన్న,సిన్న పొలగాండ్లకే లగ్గం సేసెదాయే.గా సిన్న పొలగాండ్లను ఎవల తోని ఎట్ల మెదులుడో ఎట్ల తెలిసేది..గందుకే అత్త,మామ,ఆడి బిడ్డలు, అంటే భయం.ఇంటి నిండ పుట్టెడు  పని అయ్యన్ని సూత్తే ఎప్పుడు అవ్వగారింటికి పోతే మంచిగుండు అని సూసేది.
ఇగ అవ్వగారి ఇంటి నుండి అత్తగారింటికి అచ్చుడంటే  కడుపు సెరువయ్యి కంటి నిండా దుఖఃమే నాయే..ఆళ్ళు తోలుక పోను అచ్చిండ్రు అంటే సాలు ఇగ  అర్రల మూలకు నులక మంచమేసి దుప్పటి నిండారా కప్పుకొని లేవక పొయ్యేది.ఇగ అయ్య,అవ్వ ఏదో బుదరకిచ్చి సాగదోలేది.
 ఇగ లగ్గం అయినప్పటి తానకెల్లీ మొదలు పురుడ్లు,పుణ్యాలు,ఏ పబోజనం అయిన సుత,ఆళ్లకు ఆడిపోలగాండ్లు అయితే పుట్టిన ఆ పొలగాండ్ల కార్యాలకు అన్నిటికీ అవ్వగారి ఇంటి నుండే సారె తెత్తరు.
కానీ గి బతుకమ్మ పండుగకు అయితే అత్తగారు కొత్త కొడలకు సారెవంపిత్తరు.
లగ్గం అయిన ఏడు అచ్చె బతుకమ్మ పండుగకు కొత్త కొడలకు ,సీరె, సారె,జాబులతోని సేసిన బతుకమ్మ,కోలలు అన్ని గూడ కొత్త కోడలకు పెడతరు.
ఇగ లాడూలు,కారపూసలు,ఖర్యలు,ఐత్తీర్ల సత్తులు నెయ్యి వోసి ముద్దలు కట్టి.అన్ని మంచిగ ఇచ్చుక పోకుండ బుగ్గెండి దబ్బాల వెట్టి ఇగ సవారీ కచ్చురం కట్టి  కచ్చురంల అన్ని వెట్టుకొని  ఇయ్యపుడు ఇంటికి వొయ్యి ఇచ్చేది.
ఇగ ఇయ్యపుడు ,ఇయ్యపురాలు అచ్చిండ్రు అంటే సాలు కొండంత సంబురం .ఇగ మత్తు దావత్ సేసుకునుడే.
తాటి ,ఈత కళ్ళు గుడాలు ,నాటు కోడి కూర గారెలు ,అబ్బో గాళ్లను మత్తు ఖుషి జేసీ ఇగ మాపటేళ్లకు సాగదోలేటోళ్లు.
ఆళ్ల పొల్ల ఎల్లకాలం ఆళ్ల కాడ వుండేదాయే మరి .మంచిగ అరసుకోకుంటే ఏడ పొల్లకు మాట అత్తదో అని.మత్తు ఆర్సుకునేది..ఇగ.
పండుగకు అందరు గూడ గారెలు,పూస,పెసరు సత్తు,నువ్వులు,పల్లీలు,గోధుమ,కుడక,బియ్యం ,
మినప  సత్తు ఎవళ్లు తినబుద్ది అయ్యింది ఆళ్ళు సేసుకునేది..
మక్క సత్తు అయితే ఇరగ సేసుకునేది.నెయ్యి వోసి ముద్దలు కట్టి పెట్టేది.
ఇగ మా అవ్వ అయితే పెసరు వప్పు వోసి గారెలు సేసేది.నువ్వుల గారెలు,సెనిగ పప్పు,పల్లి గారెలు ఎన్ని తీర్ర సేసేదో.
మినపపప్పు  మడుగూలు,సెనిగా పప్పు మడుగూలు, సేసేది.
ఇగ ఇంకా ముచ్చట ఒడవలే గాని రేపు గొంత సెప్త మల్ల.
S.. N.