ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పచ్చి కరువు పెద్దల కోసం (వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలుగు సామెతలు కలిసిన కన్నీటి కథ ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212-- ఏపుగా పెరిగిన పొగాకు నారకేసి చూస్తుంటే చంద్రయ్య గుండె తరుక్కుపోతుంది. పెండ్లాం బిడ్డలు మైలు దూరం నుంచి అపసోపాలు పడతా బోరింగ్ కాన్నించి బిందెలతో నీళ్ళు తెచ్చి పోస్తా వున్నారు. రోడ్డు మీద గాలికి దుమ్ము ఎగిసెగిసి పడతా వుంది. కనుచూపు మేరలో ఎక్కడా పచ్చగడ్డి జాడే కనపడ్డం లేదు.చంద్రయ్య నుదుటికి పట్టిన చెమట తుడ్చుకుంటూ తలెత్తి ఆకాశమొంక చూశాడు. ఒక్క మబ్బు తునకా కనబళ్లేదు. పెళ్లీడుకొచ్చిన బిడ్డ బిందెతో నారపై నీళ్ళు చిలకరిస్తా వుంటే గుండె పిండేసినట్లయింది. అంతలో ఊరి టైటి బీడుపొలం గుర్తుకొచ్చి కండ్లలో నీటి పొర కమ్ముకుంది.*'యవసాయం గుడ్డివాని చేతిలో రాయిలా మారెగదా'* అని నిట్టూర్చి జేబులోంచి బీడిముక్క తీసి ముట్టించాడు. పొగ గుప్పుగుప్పున వదుల్తూ నెమ్మదిగా ఆలోచనల్లోకి జారిపోయాడు. రుతుపవనాలు ఈ యేడు ముందే మొదలవుతాయని టీవీలో వార్తలు విని రైతులు సంబరపడ్డారు. చంద్రయ్యకు పోయినేడు పత్తేస్తే చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది. *అవ్వ వడికిన నూలు తాత మొలతాటికి సరిపోయినట్లు* పెట్టిన కాడికి తిరిగి రావడమే గగనమైపోయింది. ఈసారైనా మంచి వానలు పడితే పిల్ల పెండ్లి చేసి యెళ్ళగొట్టుకోవాలి అనుకున్నాడు. తన పదెకరాలకుగాను మరో పదెకరాలు గుత్తకు తీసుకున్నాడు.రైతులందరూ ఎదురు చూస్తున్నట్టుగానే తొలకరిలో బ్రహ్మాండమైన వానొచ్చింది. నేలతల్లి తడిసి ముద్దయింది. రైతుల ఒళ్ళు ఆనందంతో పులకరించింది. గడాలు భుజాల మీదికెక్కాయి. ఎద్దులు ఒళ్ళు దులపరించుకోని ముందుకు సాగాయి. చంద్రయ్య కూలీల్ని పిలంషి, పెండ్లాం బిడ్డలతో చేనులోకి దిగాడు. ఇరవై ఎకరాలూ చదును చేసి విత్తడానికి అనువుగా తయారు చేశాడు.పొగాకు విత్తనాలు సుబ్బారెడ్డి దగ్గర అప్పు తెచ్చుకొని, మడులు కట్టి ఇంటికాన్నే ఖాళీ జాగాలో నార పెంచడం మొదలుపెట్టాడు. పదిరోజుల్లో భూమి నుంచి మొలకలు తలెత్తి చిరునవ్వులు చిందించాయి. నెమ్మదిగా ఒళ్ళు విరుచుకొని పైపైకెదగసాగాయి.చంద్రయ్య వాన కోసం ఎదురుచూడ్డం మొదలుపెట్టాడు. నెల గడిచింది. వాన రాలేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న తుంపర్లోచ్చినా భూమి పైపాయ కూడా తడవలేదు. నెమ్మదిగా బావుల్లో గంగ ఇంకిపోవడం మొదలైంది. భూమి నెర్రలు విచ్చుకోసాగింది. ఎనకయ్య పండగొచ్చింది. నీళ్ళ కుంటలో నిమజ్జనమైపోయింది. జోకరయ్య వూరూరూ తిరిగి ఒట్టికుంటకు చేరుకున్నాడు. మాలవున్నమి గూడా దాటిపోయింది.కానీ వాన మాత్రం రాలేదు. జనాలు దేవుళ్ళకు మొక్కుకోవడం మొదలు పెట్టారు. గుళ్ళో చెక్కభజనలు చేశారు. గంగమ్మకు పూజలు చేశారు. శివలింగంపై బిందెలకు బిందెలు నీళ్ళు పోశారు. రాత్రంతా జాగరణ చేస్తా విరాటపర్వం పద్దెనిమిది రోజులు చెప్పించుకున్నారు. ఊరిడిచి బైలు పొలాల్లో వనభోజనాలు చేశారు. గోదురుకప్పను పళ్లెంలో పెట్టి ఈదీదీ తిప్పారు. వాన మాత్రం రాలేదు. మబ్బులు వచ్చినట్టే వస్తున్నాయ్. కమ్ముకుంటున్నాయ్. ఆశలు రేకెత్తిస్తున్నాయ్. వూరిస్తున్నాయ్. అంతలోనే గాలికి చెదిరిపోతూ దాగుడుమూతలు ఆడుతున్నాయ్.ట్రాక్టర్ శబ్దంతో చంద్రయ్య ఆలోచనల్లోంచి బైటకొచ్చాడు. నీళ్ళ డ్రమ్ములతో దుమ్ము లేపుకుంటూ శంకర్రెడ్డి ట్రాక్టరు చంద్రయ్యను దాటిపోయింది. అది దాటిపోయేంతవరకూ కనుచూపుమేర అలాగే చూడసాగాడు. నెమ్మదిగా మనసులో ఒక ఆలోచన మొలకెత్తింది. క్షణాల్లో మానుగా మారి వూడలు దిగింది. కాసేపు కిందామీదా పడి లెక్కలు వేసుకున్నాడు. ఒక నిర్ణయానికొచ్చి బీడీ ఆర్పేసి ఇంటికి చేరుకున్నాడు.భార్య లక్ష్మమ్మ అన్నం చేస్తా వుంది.మంచమ్మీద కూలబడి పెండ్లాం కేసి చూస్తూ “ఏమే...... శంకర్రెడ్డి పారు మంచాల చెరువు నుంచి డ్రమ్ముల్లో నీళ్ళు తెప్పించి నాట్లేస్తున్నాడంట. మనమూ అట్లాగే చేద్దాం. ఇంకో వారం దాటితే నారకు చెండు వచ్చేస్తాది. ఎందుకూ కొరగాకుండా పోతాయ్. రేపు నార నాటదానికి కూలీల్ని పిలు. నీళ్ళ కత నే చూస్తా" అన్నాడు.ఆ మాటింటానే లక్ష్మమ్మ అదిరిపడింది. గయ్యిన లేస్తా "ఏందయ్యోవ్... *పులిని చూసి నక్క వాత బెట్టుకున్నట్టూ* ... ఆళ్ళంటే మారాజులు. ఏమైనా చేస్తారు. మనకూ ఆళ్ళకూ పోలికా... *ఊరందరిదీ ఒక దారైతే పులిపిరి కట్టిది ఒక దారనీ* ... యేం మనమొక్కరమేనా... ఊల్లో చిన్న చిన్న రైతులందరూ గమ్మున ఆకాశమొంక చూస్తా ఉన్నారు. నార పోతే పోనియ్. మళ్ళా కొనుక్కోవచ్చు" అనింది.అప్పటికే ఒక నిర్ణయానికొచ్చేసిన చంద్రయ్య పెండ్లాం మాటలు ఏ మాత్రం చెవిలోకి ఎస్కోలేదు."సేవ్... నువ్ మూస్కోని గమ్మున నే చెప్పిన పని చెప్పినట్టు చెయ్. మొగోన్ని నాకు తెలీదా. యేం చెయ్యాల్నో, *కుండలో కూడు కుండలోనే ఉండాలి బిడ్డలు గుండ్రాయిల్లా ఉండాలి అంటే కుదురుతాదా.* ఈ వారం కాకపోయినా వచ్చేవారమన్నా ఖచ్చితంగా కురిసి తీరాది. దేముడేం గుడ్డోడు కాదు" అంటూ పనులు పురమాయించి సుబ్బారెడ్డి దగ్గరికి అప్పు కోసం బైలుదేరాడు.సుబ్బారెడ్డి విషయం తెల్సుకోని కాసేపాలోచించి “నా మాటిను చంద్రయ్యా... *ఇల్లలకగానే పండుగ కాదు గదా* .... కాలాలసలే బాగాలేవు. *గడ్డపారలే గాలికి ఎగిరి పోతుంటే గడ్డిపరకలు ఎగుర్లాడినట్లు* యెందుకట్లా ఉరుకులాడుతున్నావ్? ఇప్పటికే నీ అప్పు తడిసి మోపెడైంది. పోయిన సంవచ్చరమిచ్చిందానికి ఇంతవరకూ వడ్డీ గూడా జమెయ్యలేదు. మళ్ళా కొత్త అప్పంటున్నావ్... నువ్వు యాడికీ పోలేవనుకో...కానీ ఓ వారమాగు. చుట్టుపక్కల వూళ్ళన్నిట్లోనూ వాన పడతానే ఉంది. దేముడు కండ్లు తెరిచి చూడాలనే గానీ ఎంతసేపు. నిమిషాల్లో కళకళలాడిపోతాది. నారదేముంది. పోతే పోనియ్. కొత్తది కొనుక్కోవచ్చు. నాట్నాక వానగాని ఆలస్యమైందనుకో... చేతులారా దుడ్లు మన్నులో పోసినట్లయితాది. కాస్త ఆలోచించు" సలహా యిచ్చాడు.చంద్రయ్య అదేమీ పట్టిచ్చుకోకుండా "రెడ్డి... *గాడిదలతో సేద్యం చేస్తా కాలితన్నులకు జడిస్తే ఎట్లా చెప్పు.* నేనైతే నాట్లు ఎయ్యాలని నిచ్చయం చేసుకున్నా. నార చచ్చినాక వానొస్తే మాత్రం కొత్త నార పూకె దొరుకుతాదా. ఇప్పటికే చాలా మందివి చెండోచ్చేసి పనికి రాకుండా పోయినాయ్. అందరూ ఒక్కసారిగా ఎగబడతారు. తొక్కిసలాట పెరిగేకొద్దీ రేటు అమాంతం కొండెక్కి కూచుంటాది. *తుమ్ముకుంటూ పోతే సొంటి కూడా పిరమైనట్లు* కూలీల రేట్లు కూడా ఎగిసెగిసిపడతాయ్. ఇప్పుడైతే సగం ధరకే వస్తారు. అప్పుడు పెట్టే డబ్బేదో ఇప్పుడే నీళ్ళకు పెడదామనుకుంటున్నా. ఆకాశం చల్లగానే ఉంది. చెమ్మ కూడా తొందరగా ఆరిపోదు. అంతలోపు వానెలాగూ వచ్చేస్తాది" అంటూ పట్టుపట్టి చూపిచ్చిన చోట వేలిముద్రేసి అప్పు తెచ్చుకున్నాడు.మర్నాడు పొద్దున్నే చంద్రయ్య నీళ్ళ డ్రమ్ములతో చేనుకి చేరుకున్నాడు. అప్పటికే లక్ష్మమ్మ నారకట్టలతో, కూలీలతో పొలంలో సిద్ధంగుంది. చేనుకి పూజ చేసి టెంకాయ కొట్టి పనిలోకి దిగారు. కూలీలు ఒకరు నీళ్ళు పోస్తా వుంటే మరొకరు చకచకా నాట్లేయసాగారు. లక్ష్మమ్మ దగ్గరుండి అజమాయిషీ చేయసాగింది. సాయంత్రం పొద్దుగూకే వేళకి నాటడం పూర్తయింది. చంద్రయ్య కూలీలకంతా డబ్బులు పంచి పంపిచ్చినాడు. గట్టు మీద నిలబడి తృప్తిగా ఒకసారి చూసుకొని పెండ్లాం బిడ్డలతో ఇంటికి చేరుకున్నాడు. దేవుని మీద భారమేసి ఆకాశమొంక చూడ్డం మొదలు పెట్టాడు. నెమ్మదిగా వారం దాటిపోయింది. వాన రాలేదు. మొక్కలు సోలడం మొదలు పెట్టాయి. మళ్ళా ఒకసారి డ్రమ్ములతో నీళ్ళు తెప్పిచ్చి పోపిచ్చాడు. మబ్బులు కనబడ్తున్నాయేగానీ వాన మాత్రం రావడం లేదు.గుండె బిక్కు బిక్కుమనడం మొదలుపెట్టింది.ధూథూ.... తప్పు చేస్తినేమో... పెండ్లాం బిడ్డలు నెత్తీ నోరూ కొట్టుకున్నా వినకపోతి. సుబ్బారెడ్డి చెప్పినా చెవినేసుకోకపోతి. నార నాటి రెండువారాలైపాయ. వానదేముడేమో కనికరించడం లేదు. వడ్డీ డబ్బులతో ఎన్ని నీళ్ళని తెచ్చేది. అందరి మాదిరి గమ్మున కూకోక పెద్ద పాలెగాని లెక్క అతికం పని చేసినందుకు తగిన శాస్తే జరిగేటట్టుంది' అని గుంజాటన పడసాగాడు. నెమ్మదిగా కాళ్ళీడ్చుకుంటూ వూరి మధ్య రచ్చబండ కాడికి చేరుకోని అరుగు మీద కూలబన్నాడు.కాసేపటికి ఓబులేసునాయుడు అటుగా వచ్చాడు. చంద్రయ్యను చూసి “ఏందిరోయ్... అట్లా కూలబన్నావ్... చేనెట్లా ఉంది" పలకరిస్తా పక్కన కూచున్నాడు.“ఏం చెప్పమంటావ్ లే నాయుడూ... *కరువులో కవలపిల్లలు పుట్టి నట్లు* పంటేమో వాడిపోతా ఉంది. వడ్డేమో పెరిగిపోతా ఉంది. ధైర్యం చేయడమేమో చేస్తి గానీ ఇప్పుడు ఎందుకు చేసినానా అని విచారిస్తున్నా. ఐనా ఈ బైలు పొలాన్ని నమ్ముకోవడమూ... గుడ్డోన్ని దారి చూపియ్యమనడమూ రెండూ ఒకటే. అటు పోయినేడు తెగించి సొసైటీ లోను తెచ్చి బోరింగేపిస్తే ఏమైందో తెల్సు గదా. పిల్లోడుచ్చ పోసినట్లు నీళ్ళు పడ్డాయి. అది గూడా నాలుగు నెలలే" జీరబోయిన గొంతుతో దిగాలుగా జవాబిచ్చాడు.నాయుడు చంద్రయ్య భుజం తట్టి “ *రోట్లో తల బెట్నాక రోకటి పోట్లకు భయపడితే ఎట్లా చెప్పు* చెంద్రయ్యా.... మొన్న ఆత్మకూరులో మాంచి వానొచ్చి భూమి సితసితలాడిపోయిందంట. కూలీలు దొరక్క చుట్టుపక్కల వూరోళ్ళను అడిగినంతిచ్చి పిలిపిచ్చుకున్నారంట. అంతెందుకు పోయినారం శ్రీశైలంలో, ఆదోనిలో నీళ్ళు దోనెలెక్కి పారినాయ్. నందికొట్కూరులో నైతే మొక్కలు మోకాలంతెత్తు ఎదిగినాయ్. ఇంక మనూరే మిగిలింది. ఈ రోజు గాకపోతే రేపు. ఖచ్చితంగా కురిసి తీరతాది. నువ్వేం దిగులు పెట్టుకోకు' అన్నాడు.అంతలోనే దూరాన్నుండి వురుముల చప్పుడు చిన్నగా చెవులను సోకింది. తలెత్తి చూస్తే పడమట నల్లని మొబ్బులు ముసురుకొని కనబడ్డాయి.ఓబులేసునాయుడు అట్టాగే చూస్తూ “నంద్యాలకెళ్ళి మబ్బులు బ్రహ్మండంగా దిగినాయ్. వాన చంపు తున్నట్టుంది. *పడమట పిసరంత మబ్బు పడితే పాతాళం దాకా వానంట.* మనకు గూడా పడినా పడతాది" అన్నాడు.కాసేపటికే చల్లని గాలి వూరిని చుట్టుముట్టుకోని జనాలను ఆప్యాయంగా పలకరించింది నెమ్మదిగా ఆకాశంలో మబ్బులు ముసురుకోసాగాయి. చంద్రయ్య ఆకాశమొంక చూస్తా “దేవుడా... కాస్త మమ్మల్ని గూడా దయ చూడు సామీ" అని మొక్కుకున్నాడు. ఇండ్లల్లో, హోటళ్ళలో ఉన్న రైతులందరూ వీధుల్లోకొచ్చి ఆశగా ఆకాశమొంక చూడసాగారు.అంతలోనే ఈదురుగాలి రివ్వున పైకి లేచింది. "ధూ... దీనమ్మ... ఈ గాలికి మబ్బులేం నిలబడ్తాయ్" ఒకడు తుపుక్కున వుమ్మేశాడు.గాలి మరింత పెరిగింది. చెట్లు దయ్యాలు పట్టినట్లు సివాలెత్తి వూగసాగాయి. దుమ్ము ఆకాశానికెగసింది. చూస్తుండగానే మబ్బులు ఊరి వైపు వేగంగా రావడం మొదలు పెట్టాయి. క్షణాల్లో చీకటి ముసురుకుంది. ఆకాశం నుంచి మొదటి చుక్క భూమిని చల్లగా తాకింది.భూమమ్మ ఆశగా నోరు తెరచింది.సన్నని తుంపర మొదలై... వుంటుంటనే వురుములు, మెరుపులతో భీకరంగా మారిపోయింది. ఆకాశానికీ, భూమికీ మధ్య చిక్కటి వారధి ఏర్పడింది. నేలతల్లి ఎన్నాళ్ళ నుంచి దాహంగుందో అవురావురుమని తాగసాగింది. నీళ్ళు దోనెలెక్కి పారసాగాయ్. నిద్రపోతున్న కాలువలు పులిక్కిపడి పురకడం మొదలు పెట్టాయి. భూమమ్మ తాగితాగీ ఇక తాగలేక పసిపిల్లోని లెక్క కక్కడం మొదలు పెట్టింది.నేలంతా చిత్తడి చిత్తడయిపోయింది. సాయంత్రం మొదలైన వాన మరుసటిరోజు సాయంత్రానికి గానీ తెరిపియ్యలేదు. తరువాత రోజు పొద్దున్నే పూర్లో యెడ్ల గజ్జెలు ఘల్లుమన్నాయి. నాగళ్లు పొలాలకేసి బారులు తీరాయి. యాడ చూసినా ఒకటే హడావుడి. కూలీల కోసం, నార కోసం జనాలు పరుగులు దీశారు.చంద్రయ్య ఆనందం అంతా యింతా కాదు. గట్టు మీద నిలబడి చేనుని చూస్తా వుంటే పచ్చని పెండ్లి మంటపంలా కనబడింది. మొక్కలు బలం పుంజుకోని నిటారుగా, గర్వంగా ఆకాశం కేసి తలెత్తి చూస్తా ఉన్నాయి. భూమి బాగా పదునెక్కింది. మిగతా వాళ్ళ పొలాలకేసి చూశాడు. కొన్నిట్లో నాట్లు పడున్నాయ్. మరికొన్నిట్లో విత్తనాలు పడ్తున్నాయ్.వాటిని చూసిన కళ్ళతో మోకాలెత్తు ఎదిగిన తన చేనును చూస్తే సంబరంగా అనిపిస్తోంది. తరువాత రోజు చేనంతా పాపిచ్చి, కసి తీపిచ్చాడు. ఎరువుల అంగట్లో బాకీ తెచ్చి భూమి మందులు ఏపిచ్చాడు. వారానికల్లా ఆకులు పెద్దగా మంచిరంగుకు తిరిగాయి."చిత్తకార్తెలో ఇంకో మంచి వాన కురిస్తే చాలు. ఆ తరువాత చలికాలమొచ్చేస్తాది. మంచు కురుస్తాది. భూమి తడి ఆరదు" అనుకున్నాడు.'ఏం చంద్రయ్యా... గట్టు మీద నిలబడి తెగ మురిసిపోతున్నావ్. పంట బ్రమ్మాండంగా కలకలలాడ్తోంది. అందరి కంటే ముందే చేతికొస్తే *నక్కను తొక్కినట్లే* . ఏది ఏమైనా బలే ధైర్నం చేశావు లే" పక్కపొలం వీరన్న మెచ్చుకోలుగా అన్నాడు."ఆ నాదేముందిలే... యేదో ఆ దేవుడు దయ చూడబట్టిగానీ... ఓ రెండ్రోజులు వాన ఆలస్సెం చేసుంటే యేమైపోదునో గదా" అంటూ ఆకాశమొంక చూసి మొక్కుకుంటూ చిరునవ్వులు చిందించాడు.'పిల్ల పెండ్లి చేయాలనుకొంటున్నావంట గదా... ఏదైనా సంబంధం చూస్తివా ప్రశ్నించాడు.'ఆ... ఆ... చూస్తున్నా, మహానంది. దగ్గరి తిమ్మాపురంలో మాంచి సంబంధముందంట. మొన్న మా చిన్నాయన చెప్పినాడు. పెద్ద మనుసులను పిల్లను చూడ్డానికి రమ్మని పిలంపాలి. పంట చేతికొచ్చి దుడ్లాడితే సంక్రాంతి తర్వాత మంచి దినాలు చూసి చేసేస్తా జవాబిచ్చాడు."మమ్మల్ని పిలవడం మర్చిపోమాకు" అంటూ నవ్వుతా వీరన్న అన్నించి వెళ్ళిపోయాడు.చంద్రయ్య ఇంటికి చేరుకున్నాడు. రోజులు నెమ్మదిగా గడవసాగాయి. దినాలు కాస్తా వారాలయ్యాయి. నెమ్మదిగా భూమి తదారడం మొదలు పెట్టింది. చిత్తకార్తె ప్రవేశించింది. వాన మాత్రం రాలేదు. మొక్కలు మరలా వడలి సోలడం మొదలుపెట్టాయి. రైతుల్లో మళ్ళీ ఆందోళన పెరిగింది.ఒక్క వాన కురిపిచ్చు స్వామీ" అని ఎదురుచూపులు చూడడం మొదలు పెట్టారు. అంతలో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది.రాయలసీమలో గూడా భారీ వర్షాలు పడొచ్చని పేపర్లలో వార్తలొచ్చాయి. మధ్యాన్నానికల్లా నల్లని మొబ్బులు కమ్ముకున్నాయి. సాయంత్రానికి పూర్తిగా ముసురుకుంది. చిమ్మచీకటై పోయింది. వాన ఒక్కసారిగా ఫెళ ఫెళమని విరుచుకుపడింది. పెద్ద పెద్ద చినుకులతో కుండపోతగా కురిసింది.దానిని చూసి “దెబ్బకు చెరువు సగానికి సగం నిండిపోతుంది. ఇక కరువు తీరినట్టే" అనుకున్నారు జనం. చంద్రయ్య చేను మళ్ళా కళకళలాడింది. ఇంక వాన లేకపోయినా దిగుల్లేదు. పంట చేతికందినట్లేనని సంబరపన్నాడు.కానీ నాలుగు రోజులకే మళ్ళా వాన. భూమి తడారక ముందే ఇంకో వాన. ఎడతెరిపి లేకుండా వానల మీద వానలు. *అగ్నికి ఆజ్యం తోడైనట్లు* అల్పపీడనాలు, రుతుపవనాలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. ఆకాశంలో సూర్యుడు కనపడ్డం మానేశాడు. వాగులు, వంకలూ పరుగులెత్తసాగాయి. చెరువులు గండ్లు పడసాగాయి. పొలాలు నీళ్ళతో నిండిపోసాగాయి. ఎక్కడ చూసినా మిద్దెలు కూలిన వార్తలే, పంటపొలాలు మునిగిపోయిన కబుర్లే. “వట్టికరువు పోయి పచ్చికరువు వచ్చేటట్లుంది" అనుకోసాగారు. వాన ఆగాలని దేమునికి పూజలు చేయడం మొదలు పెట్టారు. దేముడు దయ తలచలేదు. వాన తెరిపిచ్చినట్టు ఇస్తూనే మళ్ళా దంచి కొట్టసాగింది. రైతుల మొఖాలు నెమ్మదిగా వడలడం మొదలు పెట్టాయి.వారం రోజుల తర్వాత వాన తెరిపిచ్చింది. చంద్రయ్య వురుకులు పరుగుల మీద చేనుకి చేరుకున్నాడు. చేనుని చూస్తానే గుండెలో రాయి పడినట్లయింది. కాలూ చేయీ చచ్చుబన్నట్లు కూలిపోయాడు. పొలమంతా నీళ్ళు నిండిపోయున్నాయ్. మొక్కలు భూమికి కరుచుకోని ఆకులు కుళ్ళిపోయాయి. బుడుకులాన్నా ఒక్క మొక్కా నిటారుగా కనబళ్ళేదు. చేనంతా పిచ్చి మొక్కలు అడ్డదిడ్డంగా పెరిగిపోయినాయ్. పురుగులు కళకళలాడుతున్నాయ్. చేలోకి కాలు పెడితే మడమల వరకు సర్రున దిగిపోసాగింది. కన్నీళ్లు ఆగడం లేదు."ధూ... నీ యవ్వ" అంటూ ఆకాశంసకేసి కాండ్రించి ఉమ్మేశాడు చంద్రయ్య. ' *దినమూ చచ్చేటోనికి ఏడ్చేటోడు ఎవడు'* అనుకుంటూ గట్టు మీన్నే వాలిపోయాడు. కండ్లలో నీళ్ళు ఆగడం లేదు. సాయంత్రం వరకూ అట్లాగే పూటలూరుతున్న కండ్లతో వుండిపోయాడు. పొద్దువాలుతుంటే నీరసంగా అడుగులు వేస్తా ఇంటికి చేరి మంచమ్మీద కూలబడిపోయాడు.పెండ్లీడు కూతురు గుర్తుకొచ్చింది. సుబ్బారెడ్డి దగ్గర తెచ్చిన అప్పు గుర్తుకొచ్చింది. ఎరువుల బాకీ కదలాడింది. సొసైటీ లోను గుర్తుకొచ్చింది. బాధగా కండ్లు మూసుకున్నాడు.రెప్పల కింద నుంచి నీళ్ళు ఆగకుండా కారిపోసాగాయి.మొగుని పరిస్థితి చూస్తుంటే లక్ష్మమ్మ గుండె తరుక్కుపోయింది. పోయినేడు టమోటా వేసి కోత కూలీ కూడా గిట్టక గంపలకు గంపలు మార్కెట్లోనే పారబోసి చేనులో పురుగుల మందు తాగి చచ్చిపోయిన రంగయ్య గుర్తుకొచ్చాడు. అప్పు మీద అప్పు తెచ్చి, బోరు మీద బోరు వేసి నీళ్ళు పడక, అప్పు తీర్చలేక ఆ బాయిలోనే పడి చచ్చిపోయిన ఎల్లన్న గుర్తుకొచ్చాడు.లక్ష్మమ్మ గుండె భయంతో బిక్కుబిక్కుమంటా కొట్టుకోసాగింది. మొగుడు ఏమగాయిత్యం చేసుకుంటాడో ఏమోనని కండ్లలో వత్తులేసుకొని రాత్రంతా కాపలా కాసింది.తరువాత రోజు పొద్దున్నే సూర్యుడు సురసురలాడ్డం మొదలు పెట్టాడు. చంద్రయ్య మంచం దిగలేదు. ఎవరితోనూ ఒక్కమాటా మాట్లాడ లేదు. కాళ్ళు ముడ్చుకోని పైకప్పుకేసి చూస్తా వుండిపోయాడు. చచ్చినా బతికినా ఈ మట్టితోనే గదా అనుకుంటూ లక్ష్మమ్మ మనసు చిక్కబట్టుకోనింది. బైటకొచ్చి ఆకాశాన్ని నేలనూ చూసింది. తిరిగి లోపలికొచ్చి మొగుని మంచం వద్దకు చేరి తట్టి లేపుతూ,*ఏందబ్బా... అట్లా కూలబడితివి. *మనుసులకు గాకపోతే మానులకొస్తాయా కష్టాలు* .. లేలే... ఇట్లాటప్పుడే ధైర్నంగుండాల, పిల్లపెండ్లి ఈ సమ్మచ్చరం కాకపోతే వచ్చే సమ్మచ్చరం చేయొచ్చు. మించిపోయిందేమీ లేదు. *కొంగు తడిచినోళ్ళకు చలిగానీ కోకంతా తడిచినోళ్ళకు చలేమి* ... లేలే..! పొగాకు పోతే పోనియ్. జాన్నేద్దాం. జొన్నకిదే అదును. భూమి తడి ఆరక ముందే తొందరపడాల. తర్వాత విదారించి లాభం లేదు. లేసిపోయి జొన్నిత్తనాల గురించి విచారించి చేనుకాడికి చేర్చు' అనింది.చంద్రయ్య కండ్లు తెర్చి పెండ్లాం మొగం వంక చూశాడు. ఆమె కండ్లల్లో ఆశ మినుకుమినుకుమంటా ఒక మూల వెలుగుతూ కనబడింది."నీకే చెబుతున్నది. లేచి ఒక్కసారి బైటకు పోయి చూడు. రైతులందరూ మల్లా మొదట్నించీ సేద్యం చేయడానికి సిద్ధం చేస్తున్నారు. రైతు పుట్టుక పుట్నాక యిట్లాంటి చిన్న చిన్న దాండ్లకల్లా యెదబడితే మనం యవసాయం చేసినట్లే... బదికినట్లే.... దేవుడు కండ్లు తెర్చి చల్లగా ఒక్క చూపు చూడాల్నే గానీ... ఈ కష్టాలెంత సేపు"అంటూవంటింట్లోంచి రొట్టె తీసుకొచ్చి ముందు పెట్టింది.చంద్రయ్య నెమ్మదిగా లేచి కాళ్ళూ, చేతులు కడుక్కోని, రొట్టె తిని నీరసంగా, దిగాలుగా బైటకొచ్చాడు. రోడ్ల మీద ఎడ్ల గజ్జెలు ఘల్లుమని వినబడ్డాయి. పొలాలకేసి పలుగు పారలతో బారులు దీరి పోతున్న రైతులు కనబడ్డారు. వాళ్ళను చూస్తుంటే చంద్రయ్యకు తెలియకుండానే వొంట్లోకి ఎక్కడలేని సత్తువ వచ్చి చేరింది. నీరసం ఎగిరిపోయింది. అడుగుల వేగం దానంతటదే పెరిగింది. నాగలి పైకి లేచింది.--డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
August 13, 2020 • T. VEDANTA SURY • Story