ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పసుపు రంగు చొక్కా పారేయబడ్డ గుండీ :-- డా.. కందేపి రాణీప్రసాద్.
November 22, 2020 • T. VEDANTA SURY • Story

ఒక ఊరిలో ఒక దర్జీ ఉన్నాడు. అతడు రకరకాల బట్టలను ఎవ్వరికీ కావాల్సిన విధంగా వారికి కుట్టి ఇస్తాడు. పిల్లల బట్టలు కుట్టడంలో ఇంకా నేర్పరి. చొక్కాలు, లాగులు పిల్లలకు అమిరేలా కుట్టిస్తుండటంతో అందరూ అతని దగ్గరకే వస్తారు.
 ఒక రోజు సాయంత్రం దర్జీ చొక్కకు గుండీలు వేగంగా కుడుతున్నాడు. రేపటి నుంచి స్కూళ్ళు తెరుస్తుండటంతో అందరూ తొందరపడుతున్నారు. అందుకే చాలా వేగంగా కుడుతున్నాడు. గుండిలా డబ్బాలో నుంచి ఒక్కో గుండిని తీసి చకచకా కుడుతున్నాడు. అదే క్రమంలో ఒక గుండిని బయటకు తీశాడు. దానిని కుట్టబోగా దాంట్లో ఉన్న నాలుగు రంధ్రాలు కలిసిప్పోయి ఉన్నాయి. ‘ష్’ అనుకుంటూ చేతిలో గుండిని కోపంగా విసిరి కొట్టాడు. ఆ గుండి ఎక్కడో మూలాన పడిపోయింది. దాంతో అక్కడున్న చొక్కాలన్నీ ఫక్కుమని నవ్వాయి. దర్జీచేత కుట్టబడి వచ్చిపోయేవారికి కనువిందుచేసే హాంగర్ కు తగిలించి ఉన్నాయి చొక్కాలు. ఆ చొక్కాలన్నింటిలో పసుపురంగు చొక్కా మరి మిడిసిపడుతూ నవ్వుతోంది.
 దర్జీ విసిరేసినందుకన్నా చొక్కా నవ్వినందుకు గుండి ఎక్కువగా బాధపడింది. ఆ తర్వాత తనవంక చూసుకుంది. మిగతా గుండిలకు వలె నాలుగు రంధ్రాలూ విడివిడిగా కాక కలిసిపోయి ఉన్నాయి. ఈ వైకల్యం ఎప్పుడుందో తెలియదు. బహుశా పుట్టుకతోనే వచ్చి ఉంటుంది. తానూ ఇంతవరకు గమనించలేదు. అయిన ఎవరికైనా ఏదైనా వైకల్యం ఉంటే ఇలాగే ఎగతాళి చస్తారా? వైకల్యం ఉన్నవాళ్ళకి డిత్యం చెప్పడం పోయి వాళ్ళనింకా మనస్తాపం చెందేలా బాధపెడతారా ఎవరైనా! అయిన గుండెకు రంధ్రాలు పడితేనే ఈ రోజుల్లో డాక్టర్లు  సరిచేస్తున్నారు. ఆఫ్త్రాల్ , నాకు కలిసిపోయిన రంధ్రాలను విడదీయలేరా! అప్పుడు నేను కూడా చొక్కకు కుట్టబడి నా విధులు నేను నిర్వహిస్తాను కదా! నేను కూడా చక్కగా ఏ బాలుడి గుండెపైనో గర్వంగా నిలబడతాను కదా! ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూ బాధపడింది గుండి.
 అంతలో దర్జీ బయటకు వెళ్లడంతో మిగతా గుండిలాన్ని వచ్చి ఈ గుండిని ఓదార్చాయి. ‘నువ్వేమీ బాధపడకు నవ్విన నాపచేనే పండుతుంది’ అంటూ కన్నీళ్లు తుడిచాయి. తర్వాత చొక్కాల వైపు తిరిగి ఇలా అన్నాయి – ‘మీరేందుకు నవ్వారు? గుండి కింద పడిపోయినందుకు సానుభూతి చూపించకుండా అలా నవ్వవచ్చా?’
 దాంతో అక్కడ హాంగర్ కు తగిలించిన చొక్కల్లోని పసుపురంగు చొక్కా ముందుకొచ్చి ‘నవ్వక ఏం చేయమంటావు! మేమంటే మనిషి ఒంటిమీద ఉండేవాళ్ళం. రంగురంగుల్లో, రకరకాల డిజైన్లలో ఉంది మనిషికి అందాన్నిస్తాం. మానవ నాగరికతకు చిహ్నం మేం. అలాంటి మాతో మీకు పోటీ ఏమిటి? మేం నవ్వితే నువ్వు నిలదీయటమేమిటి? అంది దర్పంగా.
 ‘మీ గొప్పదనాన్ని ప్రశ్నించటం లేదు. నిజంగా మీరు గొప్పవాళ్ళే, కానీ మేం కూడా మాకు చేతనైన పనిని చేస్తున్నాం కదా!. మీ కన్నా చిన్నవాళ్లను ఎగతాళి చేయడం తప్పు. అందునా వైకల్యం ఉన్న వారిని చూసి నవ్వడం ఇంకా తప్పు’ అన్నాయి గుండిలాన్ని ముక్తకంఠంతో.
 ‘చాలు చాలు! అసలు మేమెక్కడ? మీరెక్కడ? చింత గింజంతా ఆకారంలో ఉంది మమ్మల్ని నిలదీస్తున్నారే! చింతగింజల్ని విసిరి బయట పారేసినట్లు మీరు అంతే! పొండి! పొండి!’ అంటూ ఈసడించుకున్నాయి చొక్కాలన్నీ.
 పారేయబడ్డ గుండి మాత్రం ఏడుస్తూ అలాగే మూలాన ఉండిపోయింది. ఆ రాత్రంతా అది ఏమి తినకుండా ఏడుస్తూనే ఉన్నది. ఉదయాన చెత్తతో పాటు గుండి కూడా చెత్తకుప్పలోకి వెళ్లిపోయింది. చెత్తను తీసుకెళ్ళే కుర్రాడు చెత్తలో నుంచి ఎర్రగా మెరుస్తున్న గుండీని చూసి జేబులో వేసుకున్నాడు.
 ఇంటికి వెళ్ళాక గుండీని బయటకు తీసి పరీక్షగా చూశాడు. దానికి నాలుగు రంధ్రాలూ కలిసిపోయి ఉండటం గమనించాడు. వెంటనే అతనికో ఐడియా వచ్చింది. మొన్న చెత్తలో దొరికిన ‘ఫెవిక్విక్’ ట్యూబు తెచ్చి గుండి మధ్య ఖాళీని మూసేశాడు. అది గట్టిపడెలోపలే చిన్న పుల్లతో నాలుగు రంధ్రాలు చేశాడు. ఎండలో ఆరబెట్టి అతని పనిలోకి వెళ్లిపోయాడు.
 సాయంత్రం ఇంటికి రాగానే గుండీని తీసి చూశాడు. అన్నీ గుండిలలాగే నెలుగు రంధ్రాలతో చక్కగా అందంగా ఉంది. తనచొక్కాల్లో ఒకదానికి గుండి ఉడిపోయిందని గుర్తొచ్చి ఈ గున్న్దిని దానికి కుట్టుకున్నాడు. తెల్లారి ఆ చొక్కా తొడుక్కునే పనిలోకి వెళ్ళాడు ఆ పిల్లవాడు. గుండికి కలిగిన ఆనందం చెప్పనలవి కాదు. దర్జీ దుకాణం ముందు నుంచి వెళ్తుండగా గుండి తలెత్తుకుని తన స్నేహితుల వంక చూసింది. ఆ గుండీలు కూడా దీన్ని చూసి సంతోషించాయి.
 పారేయబడ్డ గుండి సంతోషంగా బాలుడి గుండెలపై కెక్కి తిరుగుతూ ఉండగా ఆ దర్జీ దుకాణంలో ఒకానొక దృశ్యం కళ్ళబడింది. తనను ఎగతాళి చేసిన పసుపు రంగు చొక్కా పాత గుద్దాలతో పాటు ఒక మూలాన పది ఉండటం గమనించింది. అంతేకాదు అది బాధపడుతున్నట్లు కూడా గుర్తించింది. ఏమైందని తన నేస్తాలను అడిగింది. ఆ చొక్కకున్న గుండీలు ఊడిపోవడంతో వేసుకోవడానికి పనికిరాదని మూల పదేశారట. ఆ తర్వాత చెత్తతోపాటు చెత్తకుప్పను చేరింది. చెత్తకుప్పలోని కంపు భరించలేక చొక్కా ఏడవసాగింది. చెత్త కుర్రాడు గుండీని తెచ్చినట్లే చొక్కను కూడా ఇంటికి తీసుకువచ్చాడు. క్రుంగి కృశించి ఉన్న చొక్కాను గుండి ఓదార్చింది. కష్టాలు వచ్చినప్పుడే దైర్యంగా నిలబడాలంటూ వెన్నుతట్టింది.
 అప్పుడు కొక్క ఏడుస్తూ ‘నేను నీ గొప్పదనాన్నిగుర్తించనే లేదు. గుండీలు నన్ను అంటిపెట్టుకుని ఉన్నపుడే మనిషి మాకు విలువిచ్చాడు. గుండిల్లేని చొక్కని విసిరిపారేశారు పనికిరావంటూ! మీరు లేకపోయిన నాకు విలువేలేదని అర్థమైంది. ఆరోజు మిమ్మల్నలా అవమానించినందుకు నాకు తగిన శాస్తే జరిగింది’ అంటూ ఆవేదన చెందింది.
 ‘ఏదో అప్పుడు తెలియక మాట్లాడావులే! ఇప్పుడు దైర్యంగా ఉండు. నా ఆరోగ్యం కూడా బాగైపోయి నేను అందరిలా పనిచేయగలుగుతున్నాను. పుట్టుకతో వైకల్యం ఉన్న నేనే ఈ బాలుడి దయవల్ల మామూలైపోయాను. నీకేంటి? నీ సమస్య చాలా చిన్నది. నా మిత్రులకు చెప్తాలే. నా మిత్ర గుండిలన్ని నీ శరీరానికి అతుక్కుంటాయి. నీకు పూర్వ వైభవం వస్తుంది’ అంటూ గుండీ ధైర్యం చెప్పింది.
 పసుపు రంగు చొక్కా చాలా సంతోషపడింది. తాను ఎంత గేలిచేసినా మనసులో పెట్టుకోకుండా నాకు సహాయం చేస్తుంది రోజు. చాలా మంచిది ఈ గుండి! అని మనస్ఫూర్తిగా మనసులో మెచ్చుకుంది. చెత్తకుర్రాడు పసుపురంగు చొక్కకు గుండీలు కుట్టి నిండుదనాన్ని తెచ్చాడు. పసుపురంగు చొక్కా – పారేయబడ్డ గుండీ ఇద్దరూ సంతోషంగా ఉన్నారు.