ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పాటకు ప్రాణం బాలు--మాడభూషి శ్రీధర్ నివాళి
September 27, 2020 • T. VEDANTA SURY • Poem

పాలు జాలువారు మోము బాలు
రసాలు జాలువారు స్వర సార ధార బాలు
బాల రసాల నవ పల్లవ కోమల గాన కన్య- బాలు
స్వరగానాల సంగీత సాహితీ మిధునపు తలంబ్రాలు బాలు

మెరుపు వెలుగుల తారల మెరుగైన గొంతు బాలు
చిత్రసీమ వదిలేసి మరిచిన అరుదైన మార్దవం బాలు
వేటూరి కవితకు దీటైన భావప్రకటనారూపు బాలు
విశ్వనాథ పాత్రకు విలువైన వీలైన స్వరశరీరి బాలు

కోదండపాణి ఆవిష్కరించిన కొత్త గొంతు బాలు
మహదేవన్ స్వరరచనకు గాన సాకారం బాలు
ఇళయరాజా తాళలయలకు థిల్లాన బాలు  
విశ్వనాథన్ దారిలో ఎదిగిన స్వరనాథన్ బాలు

నవతరం గొంతులో తీయదనం నింపిన పాట బాలు
వేయి కోకిలల మత్త స్వరాలకు శాస్త్రాన్నిఅద్దిన గురువు బాలు
భావమే విశ్వజనీన భాషయని చాటిన పాట బాలు
ఏ భాష శబ్ద శరీరానికైనా ఆత్మనింపిన బ్రహ్మ బాలు

ఏ రాగహృదయానికైనా మాధుర్యపు ఊపిరులూదిన అమ్మబాలు
ఏ పాటకైనా తీయదనాన్ని అద్దిన అమ్మపాలు బాలు

కవితా శిల్పానికి ప్రాణం పోసి పాట చేసిన తండ్రి బాలు
పాటల సుమబాలలకు అందంగా అద్దిన సుగంధం బాలు
సలలిత గీతాత్మలకు అమరిన స్వర శరీరం బాలు
స్వరాల్లో అమరిన అక్షరాలగుండెల్లో నిండిన జీవం బాలు

తెలుగు లాలిత్యానికి కలిగిన వెలుగుల కలిమి బాలు
తెలుగు సినీసాహిత్యానికి సప్తస్వరాంబరుడు బాలు
తెలుగు కథానాయకుల రసరాగ యుగళ గీతం బాలు
తెలుగు శృంగార నాయికల రాగప్రేరణా రవళి బాలు

ప్రేమకథానాయకుని ప్రణయ సందేశం బాలు
ప్రేయసి అనురాగాహ్వానానికి ప్రతిస్పందన బాలు 
గేయాలు గుండె నిండా పీల్చిన సువాసన బాలు, 
గానాంతరంగం పొంగించిన మధురతరంగం బాలు

స్వయంగా పల్లవికి చరణాలకు జనకుడు బాలు
అక్షరాన్ని మాటగా మార్చి, పాటగా కూర్చి 
స్వరం చేర్చి, రాగాలు పేర్చి, శృతిలయలు సంధించి
శ్రవణానందం సృష్టించిన గంధర్వుడు బాలు

పాటకు ఛందస్సు బాలు, మాటకు వ్యాకరణం బాలు
స్వరాలకు వరం బాలు, రాగానికి స్వరం బాలు
పదాలకు భావం బాలు, భావానికి శబ్దం బాలు
పదం స్వరం కలిసిన పాటకు ప్రాణం బాలు.