ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పాఠం నేర్పిన సోమరులు. (కథ) -సరికొండ శ్రీనివాసరాజు: -- సోము చిన్నప్పటి నుంచి అల్లరి పిల్లవాడు. చదువు అంటే అసలే ఇష్టం లేదు. తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతుంటే వినకుండా తోటి విద్యార్థులతో ముచ్చట్లు పెట్టేవాడు. మార్కులు తక్కువ. హోం వర్క్ అసలే చేయడు. తరచూ పాఠశాలకు ఆలస్యంగా రావడం, లేదా అసలే పాఠశాలకు రాకుండా బయట ఆటలు ఆడటం చేసేవాడు. తరచూ తోటి విద్యార్థులతో గొడవ పడేవాడు. సాయంత్రం వేళ పుస్తకాలను ఇంట్లో పడేసి రాత్రిదాకా ఆటలే ఆటలు. తరచూ బయటవాళ్ళతో గొడవ పడటం, ఆ గొడవలను ఇంటిదాకా తీసుకుని రావడం సోమూకు పరిపాటే. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మందలించినా, దండించినా సోమూలో మార్పు శూన్యం. సోము చెల్లెలు అపర్ణ మంచి తెలివైన విద్యార్థిని. క్రమశిక్షణ కలది. అన్నయ్యకు తరచూ చదువుకోమని హితబోధ చేసింది. మానవాళికి ఆ హితబోధ చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు అయింది. ఒకరోజు సోము ఓ చిన్న కిరాణా షాపుకు వెళ్ళి చిరుతిళ్ళు కొంటున్నాడు. అక్కడికి తన క్లాస్ మేట్ వాసు వాళ్ళ నాన్న వచ్చాడు. షాపు యజమానితో ఆప్యాయంగా మాట్లాడినాడు. బయటికి వచ్చాక సోము "అంకుల్! ఆ షాపువాడు చదువు రానివాడు. పైగా పేదవాడు. మీరు పెద్ద ఉద్యోగస్థులు. మరి మీరు ఆ షాపువానితో స్నేహపూర్వకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు?" అని అడిగాడు. "అతడు చిన్ననాటి మా క్లాస్ మేట్. అస్సలు చదువు రాదు. 6వ తరగతిలో ఉండగా మా లెక్కల మాస్టారు అతనిని లెక్కలు రానందుకు కఠినంగా శిక్షించాడు. అప్పటి నుంచి బడి మానేశాడు. ఇలా చదువుకోక పేదరికంలో బతుకుతున్నాడు." అని చెప్పాడు. మరోసారి సోము వాళ్ళ మిత్రుడు రాము తన పుట్టినరోజు వేడుకలకు మిత్రులను ఆహ్వానించాడు. రాము వాళ్ళ నాన్న బయటి నుంచి ఇంట్లోకి వెళ్తుండగా ఓ జేబుదొంగ అతని పర్స్ కొట్టేసి, పారిపోతున్నాడు. అతి కష్టమ్మీద అతణ్ణి పెట్టుకున్నారు. రాము వాళ్ళ నాన్న అతణ్ణి గుర్తుపట్టి, "ఒరేయ్ మోహన్ నువ్వా? కష్టపడి పని చేసుకొని బతకాలి కానీ ఈ దొంగతనం పనులేమిటిరా?" అని నిలదీశాడు. "క్షమించు. నాకెవరు పని ఇస్తారు?" అని అడిగాడు. అప్పుడు రాము వాళ్ళ నాన్న తన వారితో ఇలా అన్నాడు. "వీడు మా క్లాస్ మేట్ మోహన్. చిన్నప్పటి నుంచి కష్టపడి చదవక, సోమరితనంతో గడిపి ఇలా తయారు అయ్యాడు." అని. "ఒరేయ్ మోహన్! మాకు పెద్ద తోట ఉంది. అందులో తోటమాలిగా పనిచెయ్యి." అన్నాడు. సోము ఆలోచనలో పడ్డాడు. చదువుకోకపోతే ఇన్ని కష్టాలు ఉంటాయా అని. మరొక రోజు సోము వాళ్ళ ఇంటిముందుకు ఒక బిచ్చగాడు వచ్చాడు. సోము వాళ్ళ అమ్మ సోము వాళ్ళ నాన్నతో "వాడికి కొన్ని బియ్యం ఇచ్చి పంపండి. దానధర్మాలు చేస్తే పుణ్యమే కదా." అని అంది. అప్పుడు సోము వాళ్ళ నాన్న "వాడికి కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా! కష్టపడి పని చేసుకొని బతకాలి కానీ ఇలా సోమరితనం ఉండకూడదు. ఇలాంటి సోమరిపోతులను పోషిస్తే మనకే పాపం." అన్నాడు. "మీరు పెద్ద పిసినారి. పిల్లికి బిచ్చం పెట్టరు." అని విసుక్కుంది. భార్య పోరు పడలేక అతడు బిచ్చగానికి భిక్షం వేయడానికి వెళ్ళాడు. బిచ్చగాడిని గుర్తు పట్టి, "ఒరే కిషన్! నువ్వు అడుక్కొని తింటున్నావా ? ఏమైంది నీకు?"‌అని అడిగాడు. "మా నాన్న మద్యపానం చేసీ చేసీ ఉన్న డబ్బంతా పోగొట్టుకుని అనారోగ్యంతో అర్థాంతరంగా చనిపోయాడు. మేమంతా వీథిన పడ్డాము. నేను చదువును ఎంత నిర్లక్ష్యం చేసానో నీకు తెలుసు కదా! నా క్లాస్ మేట్ అని చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా ఉండవచ్చు." అన్నాడు. ""నువ్వు రేపు వచ్చి నన్ను కలువు. ఏదైనా పని ఇప్పిస్తా" అని అన్నాడు సోము వాళ్ళ నాన్న. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన సోమూకు భయం వేసింది. చదువుకోకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో సినిమాలాగా చూశాడు. మరునాటి నుంచే అల్లరి పనులు మానేసి, కష్టపడి చదవడం ప్రారంభించాడు.
June 30, 2020 • T. VEDANTA SURY • Story