ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పీవీ! ఠీవీ గూర్చి నేనెరిగిన,చెప్పగావిన్న కొన్నిజ్ఞాపకాల మనన:---మా స్వగ్రామం (గత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ,మంథని నియోజక వర్గంలోని ఉమ్మడి మంథని తాలూకా ) ప్రస్తుతం జయశంకర్ జిల్లాలోని మహదేవపూర్ మండలం లోని పవిత్ర త్రివేణీ సంగమం క్షేత్రమైన కాళేశ్వరం.నా పేరు మాడుగుల మురళీధర శర్మ. మా నాన్నగారు మాడుగుల వేంకటేశ్వర శర్మ. నేను ప్రస్తుతం సిద్ధిపేట జిల్లాలోని నారాయణరావు పేట మండలం పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తూ సిద్ధిపేటలో నివసిస్తున్నారు. కీ.శే. గౌ.మాజీ ప్రధాన మంత్రి శ్రీ పీ.వీ.నరసింహారావు గారు మా బాల్యంలో మా మంథని నియోజకవర్గ శాసనసభ్యులుగా (2)పర్యాయములు వున్నపుడు;కాళేశ్వరం గ్రామానికి ఎలాంటి రోడ్డు, బస్సు,కరెంటు సౌకర్యాలు లేని కాలంలో మట్టి రోడ్లలో,దట్టమైన అడవి ద్వారా,ఎద్దులబండ్లపై, ట్రాక్టరుపై జీపుపై మహదేవపూర్ పంచాయతి సమితి అధ్యక్షులతో కలిసి వచ్చేవారు. వారు రాగానే వారు దేవాలయాలను దర్శించుకొని,మా యింటి ప్రక్కనే వున్న రామాలయం ఊరికి ఎత్తు పైన విశాలమైన స్థలంలో ఉండేది. అక్కడ చేరి ఆ కాలము కాళేశ్వరం గ్రామ సర్పంచు కీ.శే.గర్రెపల్లి నాగభూషణంను,ఊరి కరణం కీ.శే.ఈదులపల్లి రామచందర్ రావు (పెద్దపంతులు)ను.,మా నాన్న కీ.శే.మాడుగుల వేంకటేశ్వర శర్మ (మాడుగుల వెంకటయ్యగారు)ను.,కీ.శే.గందెశిరి సమ్మయ్యను,కీ.శే.శానగొండ వైకుంఠంను,కీ.శే.కామిడి రాజిరెడ్డిని.,మొ.లాంటి పెద్దలను పిలిపించుకొనగా, వారికి మర్యాదగా కర్ర కుర్చీ జనుపబొంతతో అమర్చింది వారికి వేసి,ఈత చాపలలో వీరంతా ఇంకా కొందరు గ్రామస్తులు నేలపై కూర్చుండ పెట్టుకుని, కుశల ప్రశ్నలు వేసుకొని ఆనాటి కాలమాన, సామాజిక, అభివృద్ధి కార్యక్రమములపై చర్చించుకునే వారు. అంతలో సర్పంచు గారి ఇంటి నుండి కీ.శే. సయ్యద్ అబ్బాసు అనే గ్రామస్తుడు వేడివేడి చాయ,పాలు తేగా అందరు సేవించి,మళ్ళీ చర్చలలోకి వెళ్ళేవారు. ఇలా ఆ రోజంతా మాగ్రామంలోనే బసచేసి సాయంత్రం తిరుగు ప్రయాణం అయ్యేవారు. ఇది వారి నిరాడంబరతకు సాక్ష్యం. వారి సమావేశం జరుగుతున్నంత సేపు మాకు ఏదో తెలియని సంతోషం,అనుభూతి,ఆనందం. బాల్యమైనా మేము ఆ ప్రక్కనే ఆడుకుంటూ,వారు వెళ్ళేవరకూ అక్కడే వుండేవాళ్ళం. వారి జ్ఞాపకశక్తి అమోఘం,అనన్య సామాన్యం. వారు ముఖ్యమంత్రిగా, పార్లమెంటు సభ్యులుగా, ప్రధాన మంత్రిగా,వివిధ స్థాయిల్లో దేశ,విదేశాలు పర్యటించినారు. వారి కూతుళ్ళ పెళ్ళిళ్ళు సమయంలో ఆనాటి మంథని శాసనసభా నియోజకవర్గ పరిధిలోని గ్రామాల పెద్దలందరికీ వారి స్వహస్తాక్షరితో, పేర్లతో వారికి వివాహ ఆహ్వాన పత్రికలను అందించిన ఘనుడు. మరియు వారు వివాహం సమయంలో చిన్న స్థాయి నుండి ఉన్నతస్థాయి వరకు గల వివిధ ఉద్యోగ,రాజకీయ,స్నేహ,బంధు వర్గము వారిని కళ్యాణ మంటప ముఖ ద్వారం వద్దనే వుండి అందరినీ తానే స్వయంగా ఆహ్వానిస్తూ పలకరించిన నిగర్వి మహా మనీషి. అదృష్ట అవశాత్తు వారి కవలపిల్లలలో ఒక కూతురు వివాహం చేయించేభాగ్యం, అవకాశం, యాజ్ఞీకునిగా మానాన్నగారికి దక్కడం మానాన్నగారి అదృష్టం అనేవారు మానాన్నగారు. వారు మనసా,వాచా,కర్మణా,నిస్వార్థ,నిరాడంబర, విజ్ఞాన,వివిధ శాస్త్ర కోవిద, రాజకీయ, రాజనీతిజ్ఞ,అపార చాణుక్యుడైన మౌనమునికి ప్రణామములతో, నా చిరు స్పందన వందనాలతో.... .....మీ మాడుగుల మురళీధర శర్మ., కాళేశ్వరం/సిద్ధిపేట.
June 23, 2020 • T. VEDANTA SURY • Memories