ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పీవీ నరసింహా రావు గారు పదవి నుండి దిగిపోయాక రాజభవన్ లో తరచు కలుస్తుండే వాడిని. దానికి రెండు కారణాలు.ఆయన ఏ వయసు వాళ్ళతో ఆ వయసు వాడిగా వ్యవహరించే వారు.రెండవది పదవిలో లేరు కాబట్టి మనుషుల రద్దీ ఉండేది కాదు, సావకాశంగా మాట్లాడే అదృష్టం లభించేది. వరంగల్ లో పత్రికలు నడిపిన నాటి నుండి ప్రధాన మంత్రి పదవి దాకా ముచ్చట్లు చెప్పేవారు.ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పీవీ గారిని కలిసే అవకాశం రాలేదు . ఒక్క సారి ఆంధ్ర ప్రభ బ్యూరో చీఫ్ గా ఇదే రాజభవన్ లో ప్రధానమంత్రిగా ఆయన ప్రెస్ మీట్ కి మాత్రం హాజరు అయ్యాను .1991 మే నెల ఆయన ప్రధాని అయే కొద్ది రోజుల ముందు పీవీ గారు(అప్పటికి ఊహామాత్రంగా కూడా ఆ పదవి వరిస్తుందని అనుకుని ఉండరు) సీనియర్ జర్నలిస్ట్ బీ.నాగేశ్వర్ రావు చనిపోతే నివాళులు అర్పించడానికి బంజారా హిల్స్ జర్నలిస్ట్ కాలనీకి వొచ్చారు. అప్పుడు చాలా మంది జర్నలిస్టులం అక్కడ ఉన్నాం.పీవీ గారితో బాగా పరిచయం ఉన్న కొందరు సీనియర్ జర్నలిస్ట్ లు ఆయన ను పలకరించి వార్త ఏమయినా చెప్పండి అన్నారు.అందుకు ఆయన నవ్వేసి రాజకీయాల్లో నుండి రిటైర్ అయ్యాను.పోటీ కూడా చెయ్యడం లేదు.నా పర్సనల్ లైబ్రరీ హైద్రాబాద్ కు షిఫ్ట్ చేసుకునే పనిలో ఉన్నాను.నా దగ్గర వార్తలు ఏముంటాయి అన్నారు.మీకు కాపీ (పత్రికా పరిభాష లో కాపీ అంటే వార్త) ఇవ్వలేను కానీ మా ఇంటికి వొస్తే మంచి కాఫీ ఇస్తాను అని చమత్కరించారు. పక్షం రోజులు తిరగకుండానే రాజీవ్ గాంధీ హత్య జరగడం ఆ వెనువెంటనే పీవీ గారు ప్రధాన మంత్రి అయిపోవడం తెలిసిన విషయమే.ప్రధాన మంత్రి పదవి నుండి వైదొలిగాక ఆయన కేసులు ఎదుర్కోవాల్సి వొచ్చింది. హైద్రాబాద్ వొచ్చినప్పుడు రాజభవన్ లో విడిది.కొద్దీ మంది మాత్రమే ఆయనను తప్పకుండా కలిసే వాళ్ళు. అందులో నేను ఒకడిని.పీవీ గారు మా పెద్ద బాపు రామానుజ రావు కలిసి చదువుకున్నారు.సన్నిహిత మిత్రులు కూడా.మొదటి సారి పొత్తురి వెంకటేశ్వర రావు గారు పరిచయం చేసారు నన్ను పీవీ కి. ఏం చేస్తున్నావురా అని అడిగారు. అప్పుడే ప్రజాతంత్ర వారపత్రిక పునః ప్రారంభించాము.అదే చెప్పి పత్రిక చేతిలో పెట్టాను.వరంగల్ లో తాము పత్రికలు నడిపిన రోజులు గుర్తు చేసుకొని చాలా విషయాలు చెప్పారు. మీ పెద్దబాపు శోభ పత్రిక నడిపాడు, మేము కాకతీయ పత్రిక నడిపినాము, చేతులు కాల్చుకున్నాం, నువ్వేట్ల నడుపుతావో జాగ్రత్త అన్నారు. అక్కడి నుండి ప్రతి సారి ఒక్కడినే వెళ్లి కలుస్తూ ఉండేవాడిని.ఆయన ముమ్మాటికీ వాకింగ్ ఎన్సైక్లోపీడియా.ఆయనకు తెలియని విషయం లేదు.ఆయన జ్ఞాపకశక్తి అమోఘం. రోజులు గడుస్తుంటే చివరికి పీవీ గారి మీద కేసులన్నీ కొట్టేశారు.ఆ వెంటనే ఆయన హైద్రాబాద్ వొచ్చారు.నేను ప్రసాద్ గారికి ఫోన్ చేసాను పీవీ గారిని కలవడానికి వొస్తానని.పీవీ ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు ఆయన కార్యదర్శిగా పని చేసిన కృష్ణమూర్తి గారి అబ్బాయి ఈ ప్రసాద్ గారు.పీవీ గారు పదవి నుండి దిగిపోయాక ప్రసాద్ గారు ఆయన వెంట ఉండే వారు. రాజభవన్ కి వెళ్ళేసరికి అంతా కోలాహాలంగా ఉంది . చాలా కార్ లు ఆగి ఉన్నాయి . లోపల కూడా చాలా మంది ఉన్నారు.ప్రధాని పదవి పోయాక రాజభవన్ లో పీవీ గారిని కలవడానికి ఇంత మంది రావడం నేను చూడలేదు అంతకు ముందు ఎప్పుడూ. లోపలికి వెళ్ళాను. తలుపు దగ్గరే ఒక పెద్దమనిషి ( ఆయన పేరు వొద్దు లెండి) నన్ను పలకరించి ఉత్సాహంగా చెయ్యిపట్టి పీవీ గారు ఉన్న గదిలోకి లాక్కెళ్లారు.నాకు బాగా పరిచయం ఉన్న గదే అది. ఎన్నో సార్లు గంటలు గంటలు పీవీ గారితో గడిపిన గదే అది. ఆ పెద్దమనిషి నన్ను పీవీ గారికి పరిచయం చేశాడు " ఈయన దేవులపల్లి అమర్ అని చాలా సీనియర్ జర్నలిస్ట్ " అని. పీవీ గారు చిరు నవ్వు నవ్వుతూ "ఇన్ని రోజులు నువ్వు రాలేదు , వాడే వొచ్చి కలుస్తుంటాడు , వాడిని నువ్వు నాకు పరిచయం చేస్తున్నావా" అన్నారు. పీవీగారు పదవి పోయి కేసులను ఎదుర్కొంటున్న కాలంలో ఆ పెద్ద మనిషిని నేను ఎప్పుడూ రాజభవన్ లో చూడలేదు. పీవీ గారి మాటలకు ఆ పెద్దమనిషి పాపం చిన్న ముఖం వేసుకుని పక్కకు జరిగిపోయాడు.నేను కాసేపు పీవీ గారితో మాట్లాడి వొచ్చేసాను. అదే ఆఖరి సారి వారిని కలవడం.2004 డిసెంబర్ ఒకటిన నేను ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక ఒక సారి ఢిల్లీ వెళ్లి పీవీ గారిని కలిసి ఆశీర్వాదం తీసుకోవాలని అనుకున్నా. కుదరనేలేదు.కొద్దిరోజులకే ఆయన చనిపోయారని వార్త, ఢిల్లీ బయలుదేరి వెళ్లి చివరి దర్శనం చేసుకుందాం అనుకుంటుంటే ఆయన పార్థివ దేహం హైదరాబాద్ కే వొస్తుందన్న వార్త . ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ఆఫీస్ కి ఫోన్ చేశాను . ముఖ్యమంత్రి బెంగుళూరు లో ఉన్నారని ఆయన కార్యాలయ కార్యదర్శి భాస్కర శర్మ చెప్పారు.కేవీపీ రామచందర్ రావు గారు దొరికారు ఫోన్ లో.ఢిల్లీ వెళదామనుకుంటున్నానని చెప్పాను. పీవీ గారి మృతదేహాన్ని హైద్రాబాద్ కే తీసుకొస్తున్నాం, అక్కడే అంత్యక్రియలు, పొద్దున్నే జూబిలీ హాల్ కి వొచ్చేయి అని చెప్పారు.చేసేదేం లేక టీవీ ముందు కూర్చుంటే గడ్డుకాలంలో దేశాన్ని , కాంగ్రెస్ పార్టీని బ్రతికించిన మేరు నగధీరుడు పీవీ కి కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం గేట్ ల దగ్గర జరిగిన ఘోర అవమానం దృశ్యాలు కనిపించాయి.( శతజయంతి వేడుకల సందర్భంగా పీవీ ని స్మరిస్తూ).- అమర్ దేవులపల్లి
June 30, 2020 • T. VEDANTA SURY • Memories