ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పువ్వూ, ముల్లూ--- యామిజాల జగదీశ్
September 2, 2020 • T. VEDANTA SURY • News

వసంతంలో పువ్వులు మాత్రమే కాదు, ముళ్ళూ మొలుస్తాయి.
పువ్వూ , ముల్లు అనే తేడా మనుషులకే తప్ప వసంత కాలానికి కాదు.
అది అసలలాంటి తేడాలు చూపించదు ఏ విషయంలోనూ.
పువ్వులాగే ముల్లూ వసంత కాల తల్లికి బిడ్డే.
పువ్వూ, ముల్లూ ...ఈ రెండింటి పుట్టుకకూ ప్రాదాన్యం ఉంది.
దేని ప్రాముఖ్యం దానిది.
ప్రకృతిలో ఒక్కొక్క సృష్టికీ ఒక్కో వరముంది.
పువ్వుకు అందాన్ని ఇచ్చిన ప్రకృతి ముల్లుకు కరుకుదనాన్ని, గట్టిదనాన్నిఇచ్చింది.
అందం సుకుమారమైంది. అందుకే అది శీఘ్రమే వాడి రాలిపోతుంది.
ముల్లు గట్టిది. కరకుదనం కలది. కానీ అది ఎక్కువ కాలం ఉంటుంది.
మనుషుల్లోనూ పువ్వుల్లాంటి వారు ఉంటారు.
ముళ్ళలాంటి వారూ ఉంటారు.
మృదువు, గట్టితనం - ఈ రెండూ మనిషికి అవసరమే.
అందమైన పువ్వు ఆనందం కలిగిస్తుంది.
గట్టిదైన ముల్లు రక్షణ కల్పిస్తుంది.
జీవితంలో మనకు ఏది దొరుకుతుందో దానితో ఆనందం పొందాలి.
కానీ మనిషి అలా ఉండడు.
ఏది దొరకదో దానినే పదే పదే అనుకుంటూ డీలా పడతాడు. కుమిలిపోతాడు.
తాను అనుకున్నది దొరక లేదేనని బాధపడతాడు.
పువ్వుకు అందం ఉంది కదా...
కానీ అది తనకు దీర్ఘాయువు లేదేనని బాధ పడి
త్వరగా దిగులుతో రాలిపోతుంది. ఏడుస్తుంది.
అయితే ముల్లు విషయానికి వస్తే, తనకు అందం ఇవ్వలేదని
బాధ పడదు. తనది దీర్ఘాయువు కదా అని ఆనందిస్తుంది.
దీనితో అది ఎక్కువ కాలం ఉంటుంది. లేని దానికోసం నలిగిపోదు.
అందుకే మనుషుల్లారా , పువ్వులా లేని దాని కోసం బాధపడి కృంగి కృశించిపోకూడదు.
ముల్లులా ఉన్నదానితో తృప్తి పడితే కలకాలం ఆనందంగా ఉండవచ్చు.
అందుకే పాకిస్తాన్ కవి హమీద్ అన్నాడిలా.....
వసంతాన్ని కొనియాడుతూ, మెచ్చుకుంటూ ముళ్లు పాడటం విన్నాను. మరోవైపు పువ్వులు త్వరగా రాలిపోతున్నందుకు బాధ పడుతూ ఏడుస్తున్న శోక రాగాన్ని విన్నాను అని.