ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పూర్వ వైభవం!----బాలవర్ధిరాజు మల్లారం
August 30, 2020 • T. VEDANTA SURY • Poem

'అజంతా భాష'గా
'దేశ భాస లందు తెలుగు లెస్స' అని
'ITALIAN OF THE EAST'అని
దేశీయంగా రాణ కెక్కి
అంతర్జాతీయంగా గణతి కెక్కి
నవ్యాతి నవ్యంగా..
రమ్యాతి రమ్యంగా..
దివ్యాతి దివ్యంగా..
మధురాతి మధురంగా..
యాభై ఆరు అక్షరాల అల్లికలతో...
చందస్సు సొబగులతో...
పద్యాల పరిమళాలతో..
మాండలికాల మాధుర్యాలతో..
మెండుగా నిండుగా వెలిగిన
మన ఈ తెలుగు ఇప్పటిదా?
రెండు వేల ఏండ్ల పూర్వపుది.
గతమెంతో ఘన కీర్తి
మన మాతృ భాషా వైభవానిది.
కానీ.... మరిప్పుడు?
ఇంగ్లిష్ ధాటికి తట్టుకోలేక
విద్య,ఉద్యోగ పోటీల్లో నెట్టుకు రాలేక
నేటి యువత మనసును దోచు కోలేక
ప్రజా పాలనకు నోచు కోలేక
చతికిల పడిపోతున్నది.
వర్తమానంలో.. మిత భాషగా
భవిష్యత్తులో.. మృత భాషగా (?)
మారబోతున్న మన భాష దుస్థితికి
కారణాలనేకం.
గత జల సేతు బంధనం అనవసరం.
మరి మన కిం కర్తవ్యం?
ప్రజల ప్రమోదంతో
ప్రభుత్వ ఆమోదంతో
ఇంటా , బయటా 
తెలుగు వినిపిస్తే
తెలుగు కనిపిస్తే
తెలుగులో రాస్తే
తెలుగులో పలికితే 
వికసించదా మళ్ళీ మన మాతృభాషా వైభవం!?
ప్రకాశించదా మళ్ళీ మన తేట తెలుగు వెలుగు!?