ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పూలవనం: --కె ఎస్ అనంతాచార్య
October 27, 2020 • T. VEDANTA SURY • Poem

ఆకులు పూలు తెచ్చి
అందంగా పూదించే అలంకారం 
శక్తి ఆరాధన
భక్తిగా కొలిచే
సంప్రదాయం

పెతరామవాస్య నాడు పెద్దల తలచుకొని  ఎంగిలి పూల బతుకమ్మ తో  ఏటా మొదలయ్యే పండుగ
ఆనందం మెండుగ

తంగేడు, గునుగు కట్ల నిత్యమల్లెలు 
ఒక్కోక్కటి పేర్చుతూ  అందమైన పూల గోపురం అందిట్లో కొలువయ్యే  గౌరమ్మ తో మెరిసే  బంగారు బతుకమ్మ ఆత్మ గౌరవం నీవే నమ్మ

నవరాత్రుల్లో నవ్య శోభన సాగే సంబురం
సద్దుల రోజుతో ముద్దుగ ముగిసే పూల జాతర  

 తీరొక్క పూవుల తో వెలిగే  బంగారు బతుకమ్మ  మా ఇంటివెలిసిన దుర్గమ్మ 

పూల వనంలో  అతివల అపురూప౦గా  సాగే దృశ్యం ఆరాధనా సాదృశం

వీరుల చరితలు 
శూరుల గాథలు జానపదాల నెత్తుకొనే ముత్తైదువలు చప్పట్ల మధ్య వయ్యారంగా సాగే పడతుల నృత్యాలు  ఉయ్యాల పాటల్లో రాముని తత్వాలు

తలపై నిలుపుకుంటే  తెలంగాణ ను మోసినట్లు భుజం మీద అమరిన ఆడబిడ్డ అత్తవారింటి 
కనక మహాలక్ష్మి

ధూప దీప నైవేద్యాలు
సత్తు పిండి పలారాలు
వాయినాలతో వదిన మరదళ్ల సరసాలు  సరదాలతో పూల ముచ్చట్లు

ఒక్కేసి పువ్వేసి చందమామ  జాములు గడిచి కాలం ముందుకు నడిచి మళ్ళిరావమ్మా అంటూ  నీటనంపే ఎదురుచూసే అమాయకత్వం

బతుకున రంగులు 
విరియాలని విరుల కూర్చిన కొమ్మ బతుకమ్మ తెలంగాణా హృదిన మెరిసే పూల బొమ్మ