ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పైడి జైరాజ్ : హరికృష్ణ మామిడి
October 1, 2020 • T. VEDANTA SURY • News

పైడి జైరాజ్(28.09.1909-11.08.2000)జన్మస్థలం: కరీంనగర్ జిల్లా.
 భారతీయ సినిమా మాటలు నేర్వక ముందు మూకీ యుగంలోనే తెలంగాణ గడ్డమీద పుట్టాడు పైడి జైరాజ్.
అతను ముంబాయి చేరుకుని స్టార్ గా ఎదిగి తన కీర్తి బావుటాను ఎగురవేశాడు. అటు మూకీ సినిమాల్లోనూ
తర్వాత వచ్చిన టాకీ సినిమా ప్రపంచంలోనూ తనదైన విలక్షణతను చాటుతూ భారతీయ సినీ యవనికపై
వెలుగొందినవాడు పైడి జైరాజ్. ఆరడుగుల ఆజాను బాహుడైన జైరాజ్ ఆనాటికి అత్యంత వెనుకబడ్డ కరీంనగర్ లో
పుట్టి, హైదరాబాద్ నగరంలో చదువుకుని, నటన పైన, సినిమా రంగం పైన వున్న మక్కువతో ముంబాయి చేరుకుని
అంచెలంచెలుగా ఎదిగి భారతీయ సినీ చరిత్రలో చిర స్థాయిగా మిగిలిపోయాడు. సినిమా వికాసానికి తన జీవిత
కాలంలో చేసిన సేవలకుగాను 1980 లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును
అందుకుని తెలంగాణా కీర్తిని నలుదిశల వ్యాపింపచేశాడు.
 సెప్టెంబర్ 28వ తేది 1909వ సంవత్సరం కరీంనగర్ లో జన్మించిన పైడిపాటి జయరాజ్ ఇండియన్
నైటింగేల్ సరోజిని నాయుడు భర్త ఎం. గోవిందరాజులు నాయుడుకు మేనల్లుడు. బాల్యంలోనే జైరాజ్ కుటుంబం
కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళి స్థిరపడింది. జైరాజ్ కు చిన్నప్పటి నుండి నాటకాలంటే ఇష్టం. 1913లోనే
దాదాసాహెబ్ ఫాల్కే హిందీ సినిమాకు పురుడు పోశాక సినిమా కళ దేశమంతా విస్తరించింది. అందుకే కావచ్చు
నిజాం కాలేజ్ లో చదువుచున్నపుడే సినిమాల్లో హీరోగా చేయాలన్న కోరిక జైరాజ్ కు కలిగింది. 
ఏదో సందర్భంలో సరోజిని నాయుడు జైరాజ్ ను తన అల్లుడుగా కాకుండా స్వయం కృషితో నీ ప్రతిభ ఏమిటో నీ కాళ్ళపై నిలబడి నిరూపించుకోవాలని ఉపదేశించడంతో జైరాజ్ పట్టుదలతో సినీరంగంలో తన ప్రతిభను పరీక్షించుకోవాలని 1928లో ముంబాయి రైలు ఎక్కాడు. ఆ రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమ ఇంకా కళ్ళు తెరవలేదు. హిందీ సినిమాల్లో మూకీ ట్రెండ్ నడుస్తుంది. అలాంటి టైమ్ లోనే అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముంబాయి వెళ్ళాడు జైరాజ్. తెలుగువాళ్ళంతా మద్రాస్ వెళ్ళి వేషాలు వెతుక్కుంటుంటే తెలంగాణాకు చెందిన జైరాజ్ మాత్రం పది అడుగులు ముందుకు వేసి ముంబాయిలో తొలితరం బాలీవుడ్ నటుడుగా పునాది వేశాడు.
 పైడి జైరాజ్ ముంబాయిలో అడుగుపెట్టే సమయానికి అనేక హిందీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అప్పటికేబాలీవుడ్ లో చాలా కాంపిటీషన్ ఉంది. సంపన్న కుటుంబాలకు చెందిన వారికి మాత్రమే సినిమా అవకాశం
దక్కేది. ఆరడుగుల ఎత్తు, ఆకట్టుకునే శరీర సౌష్టవం, ఇతర నటులను తలదన్నే రూపంతో జైరాజ్ పదిమందిలో
ప్రత్యేకంగా కనిపించేవాడు. అయినా అవకాశాల కోసం  జైరాజ్ ఎదురు చూశాడు. అదే సమయంలో ముంబాయిలో
మహావీర్ ఫిలిం కంపెనీలో పనిచేసే తన చిన్ననాటి స్నేహితుడు మావరేర్కర్ అనే నిర్మాత దగ్గరకు తీసుకువెళ్ళి
పరిచయం చేశాడు.
జైరాజ్ తెలంగాణాలో పుట్టడం, హైదరాబాద్ లో చదువుకోవడం కారణంగా ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, భాషల్లో అనర్గళంగా మాట్లాడటంతోపాటు, ఆయన అందానికి శరీరసౌష్టవానికి ముచ్చటపడి మావరేర్కర్ తన సినిమాలో అవకాశం ఇవ్వడమేకాక ఆయనే స్వయంగా జైరాజ్ కు మేకప్ చేయడం ఆయన సినీ జీవితంలో అనుకోని మలుపు. 
అయితే ఆ సినిమా పూర్తి కాకపోయినప్పటికీ అదే సినిమా దర్శకుడు నాగేంద్ర మజుందార్ తన సొంత చిత్రం 'జగమ్ గాతి జవాని' అనే మూకీ చిత్రంలో జయరాజ్ కు సహాయ నటుడిగా అవకాశం ఇచ్చారు. ఆ చిత్రంలోని కథానాయకుడు మాదవ్ ఖేల్ కు గుర్రం స్వారీ, యుద్ధం చేయడం రాకపోవడంతో ఆయా సన్నివేషాల్లో ముసుగు వేసుకుని జైరాజ్ ను నటింపచేసారు. ఆ తర్వాత నాగేంద్ర మజుందార్ నవజీవన ఫిల్మ్ వారి 'రస్సేరి రాణి' చిత్రంలో జైరాజ్ ను హీరోగా పరిచయం చేశారు.
 'ది ప్రిజెన్ ఆఫ్ జెండా' అనే ఇంగ్లీష్ నవల ఆధారంగా తీసిన ఈ చిత్రంలో జైరాజ్ ప్రక్కన ఫేమస్ హీరోయిన్
మాధురి నటించింది. ఈ చిత్రం అప్పటి మూకీ చిత్రాలలో ఐదు వారాలు నడిచి సంచలనం సృష్టించింది. దాంతో
నవజీవన్ ఫిల్మ్ కి జయ్ రాజ్ మరో నాలుగు సినిమాలు చేశారు. తర్వాత శారద ఫిల్మ్ కంపెనీ ద్వారా జహీరున్నీసా
హీరోయిన్ గా 'మహాసాగర్ నో మోతి' అనే పెద్ద చిత్రంలో హీరోగా చేశారు. అది గొప్ప సక్సెస్ కావడంతో మూకీ
చిత్రాల్లో గొప్ప నటులైన దిల్లీ మోరియా, శాంతారాం,జాన్ మార్చంట్, పృథీరాజ్ కపూర్ సరసన జైరాజ్ చేరారు.
అప్పుడు శారద ఫిల్మ్ కి మరో ఐదు చిత్రాలు చేశారు. అలాగే 1930లో 'స్పార్కింగ్ యూత్' అనే మూకీ చిత్రంతోపాటు 'ట్రయాంగిల్ ఆఫ్ లవ్', 'మాతృభూమి', 'ఫైట్ ఇన్ టూ డెత్' చిత్రంలో కథానాయకుడిగా నటించారు.
 1931లో మొట్టమొదటి టాకీ చిత్రం 'ఆలం అరా' వచ్చినప్పటికీ స్వయంగా పాడుకోలేకపోవడంవల్ల వెంటనే జైరాజ్ కు ఛాన్స్ రాలేదు. తర్వాత అదే ఏడాది హిందీ, ఇంగ్లీష్, ద్విభాషా చిత్రం 'షికారి'లో బౌద్ధ సన్యాసి పాత్రను జైరాజ్ పోషించారు. ఫ్రాంజ్ ఆస్టిమ్ దర్శకత్వంలో జైరాజ్ హీరోగా 1936 లో రూపొందించిన “బాబీ” అనే చిత్రం ముంబాయ్ లో స్వర్ణోత్సవం జరుపుకోవడం, కలకత్తాలో 80 వారాలపాటు నడిచి చరిత్ర సృష్టించింది.       
 మొదటి పౌరాణిక చిత్రం 'అహల్య ఉద్దార్'లో హీరోగా వెలిగిపోయాడు. ఈ చిత్రంతో యాక్షన్ ఎడ్వంచర్ చిత్రాల్లో ఆయనకు అనేక సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఆయన మొట్టమొదటి సాంఘిక విప్లవాత్మక సినిమా మున్షీ ప్రేమ్ చంద్ ప్రేమకథ పై 'మిల్ మజ్రూర్', 1936లో ఇండియన్ ఫిల్మ్ కార్పొరేషన్ కరాచిలో చేసిన 'బేరోజ్ గార్' సినిమాలో లీలా చిట్నీస్ పక్కన హీరోగా చేశాడు. కరాచీలో 'గ్యాంగ్ లో' అనే మరో చిత్రాన్ని చేశాడు. జైరాజ్ చేసిన ఒకే ఒక ఫాంటసీ చిత్రం “హతీంతాయి” ఒక గొప్ప సినిమా, అందులో షకీలా పై చేసిన 'సర్వర్ దిగార్ ఆలమ్' అనే పాట ఎంత పాపులర్ అంటే హైదరాబాద్ నిజామ్ ఆ పాటని 10 సార్లు రివైండ్ చేయించుకొని చూసారట.
 'జైరాజ్ హీరోగా చేసిన చివరి చిత్రం 1965లో వచ్చిన 'కుహీకౌన్ ముజ్జికాన్', తర్వాత జైరాజ్ కేరెక్టర్ ఆర్టిస్ట్ గా
పేరు తెచ్చుకున్నారు. జైరాజ్ తన 70 వసంతాల సినీ ప్రయాణంలో 11 మూకీ సినిమాల్లో నటించి తన సత్తా
నిరూపించుకొని, 156కు పైగా టాకీ సినిమాల్లో హీరోగా మొత్తం దాదాపుగా 300 సినిమాల్లో పైగా నటించారు.
1990లో 'ఖూన్ బారీ మాంగ్' అనే టీవీ సీరియల్ లో నటించారు. వాళ్ళబ్బాయి 'దిలీప్ రాజ్' 'అస్మాన్
హహత్' చిత్రంలో నాయకుడిగా నటించినా ఆ తరువాత ఆయన సినిమా రంగానికి దూరంగానే ఉండిపోయారు.
హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ భాషా చిత్రాలలో నటించిన జైరాజ్ తెలుగువాడై ఉండి కూడా ఒక్క తెలుగు
చిత్రంలో కూడా నటించలేకపోయానన్న బాధని ఆయన సన్నిహితుల వద్ద ప్రస్తావించేవారట. తెలుగులో చిత్తూరు నాగయ్యతో కలిసి ఒక చిత్రం నిర్మించటానికి సన్నాహాలు చేసుకున్నా నాగయ్య గారు మరణించడంతో ఆ ప్రయత్నం 
నిలిచిపోయింది.
 ఆగష్టు 11వ తేది 2000 సంవత్సరంలో ముంబాయిలో తన 90వ యేట తుది శ్వాస విడిచిన పైడి జైరాజ్ చలన చిత్ర సీమలో తనదైన శైలితో నటనా చాతుర్యంతో సంచలన విజయాలను సాధించి భారతీయ సినిమా వికాసానికి తన జీవితకాలం కృషి చేసాడు. మూకీ నుంచి టాకీ దాకా జయకేతనాలెగరేసి డెబ్బైఏళ్ళ సినీ చరితకు వారధిగా నిలిచారు. భారతీయ సినిమా తొలితరం నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన పైడి జైరాజ్ పేర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, ప్రతిష్ఠాత్మక రవీంద్ర భారతిలోని మూడో అంతస్థులో “పైడి జైరాజు ప్రివ్యూ థియేటర్” ను ఏర్పాటు  చేసింది. ఇది భారత దేశం మొత్తం మీద షార్ట్ ఫిలింలు, డాక్యుమెంటరీ ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన ఒకే ఒక థియేటర్!!
(సేకరణ:- తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన “ తెలంగాణ తేజోమూర్తులు ” గ్రంధం.)