ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పోస్ట్ కార్డు పుట్టుక..--సుజాత.పి.వి.ఎల్.--నేడు మనం స్నేహితులకు , బంధువులకు పంపే ఉత్తరాలలో అధికంగా పోస్ట్ కార్డులే వుంటాయి. కార్డుల కున్న గిరాకీ మరే కవర్లకూ, స్టాంపులకూ లేదనే చెప్పాలి. మరి ఈ పోస్ట్ కార్డు ఎలా ఉద్భవించిందో. ఎలా రూపాంతరం చెందిందో తెలుసుకుందాం.ప్రప్రధమంగా' పోస్ట్ కార్డు'ను 1868 సంవత్సరంలో 'ఆస్ట్రియా' కు చెందిన 'ఎమాన్యుఎల్ హార్ మన్' అనే లెక్చరర్ కనుగొన్నాడు. ఆ రోజుల్లో నాలుగైదు పేజీల సుదీర్ఘ లేఖను రాయాలనుకునే వారికి అనువయ్యే విధంగా తపాలా కవర్లు ఉండేవి. నాలుగైదు లైన్లు మాత్రమే ముక్తసరిగా ఉత్తరం రాయాలనుకునే వారు కూడా ఈ కవర్లనే వాడవలసి వచ్చేది. తక్కువ విషయాలను రాయాలనుకునే వారికి చౌక రకమైన పోస్ట్ సాధనo అవసరమంటూ హార మన్ "వియన్నా న్యూ ఫ్రీ ప్రెస్'' అనే ప్రముఖ పత్రికలో సుదీర్ఘమైన ఉత్తరం వ్రాసి ఒక కార్డు నమూనా ను రూపిందించాడు. దీనిని నాటి ఆస్ట్రియా పోస్టు మాస్టర్ జనరల్ ''డాక్టర్ వేమలీన్'' ఎంతగానో మెచ్చుకొని 1869 అక్టోబర్ 1 వ తేదీన మొట్ట మొదటి సారిగా పోస్టుకార్డును వాడకంలోకి తీసుకొచ్చారు. ఆవిధంగా మొదటిసారి పోస్ట్ కార్డుని రూపొందించిన ఘనత 'ఆస్ట్రియా' కి దక్కింది. తరువాత వివిధ దేశాలు ఈ పద్దతిని అనుసరించసాగాయి. 1870 లో బ్రిటన్ లోనూ , 1871 లో కెనడా , డెన్మార్క్ లలో , 1872 లో రష్యా , స్వీడన్ , నార్వే దేశాలలో , 1873 లో అమెరికా ఫ్రాన్స్, స్పెయిన్ లలో పోస్ట్ కార్డులు విభిన్న రూపాలలో వాడకం లోకి వచ్చాయి.1879 లో మన దేశం లో ప్రపధముగా చాలా చిన్న సైజులో ఒక వైపు వ్రాయుటకు వీలుగా, ఒక వైపు చిరునామా వుండే విధంగానూ, కార్డు పై' ఈస్టిండియా' అని ముద్రించబడి ప్రవేశపెట్టబడింది. విక్టోరియా రాణి పరిపాలనలోకి వచ్చిన తదుపరి'ఈస్ట్' పదాన్ని తొలగించి ''ఇండియన్ పోస్టేజి'' అని ముద్రించనారంభించారు. 1902 లో ఎడ్వర్ట్ ప్రభువు పేరిట కార్డులు రాజు చిహ్నంతో రూపొందాయి.1911 లో కార్డు సైజు పెంచబడి రెండువైపులా వ్రాసుకునే రీతిగా రూపొందించబడింది. 1947 లో పోస్టు కార్డులపై అశోక స్తంభంను ముద్రించడం జరిగింది. అటు తరువాత కొద్ది మార్పులతో 'మృగ రాజు' చిత్రముతో నేడు పోస్ట్ కార్డు దర్శనమిస్తుంది.1950 సంవత్సరంలో 9 పైసలతో నున్న పోస్టు కార్డు, క్రమేణా నూతన ద్రవ్య మానంలో 5 పైసలు, ఆరు పైసలు, పది పైసలు, అటు తర్వాత పదిహేను పైసలు, ఇరవై ఐదు పైసలు పిమ్మట యాభై పైసలు వరకు పెరిగినది. ఈ విధంగా వివిధ దశలలో రూపాంతరం పొందిన 'పోస్ట్ కార్డు' కు ఇప్పటికి 150 సంవత్సరాలు నిండాయి.
July 25, 2020 • T. VEDANTA SURY • News