ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ప్రపంచయాత్రికుడు--మన దేశంలో మొదటగా తయారైన ఎలక్ట్రిక్ రేజర్, పదునైన బ్లేడు, కెమెరాలో దూరాన్ని సరి చేసే భాగము, ఫలరసాలు తీసే పరికరం, కిరోసిన్ తో నడిచే ఫ్యాను, ఐదు వాల్వులు గల రేడియో, రెండు సీట్ల మోటారు కారు ఇలా అరుదైనవాటిని కనుగొన్న ఆయనను మన దేశపు ఎడిసన్ గా పేర్కొనడం కద్దు. నిరంతర అన్వేషకుడైన ఆయన మరెవరో కాదు, జి. డి. నాయుడుగా ప్రసిద్ధి చెందిన గోపాలస్వామి దొరస్వామి నాయుడు.1893 మార్చి 23వ తేదీన తమిళనాడులోని కోయంబత్తూరు దగ్గర కలంగల్ అనే గ్రామంలో జన్మించిన ఆయన మూడవ తరగతి వరకే చదువుకున్నారు. ఆయన తయారు చేసిన పరికరాలతో కోయంబత్తూరులోని 'జి.డి. నాయుడు ప్రదర్శనశాల' అని ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.పేద విద్యార్ఠులకు సహాయసహకారాలు అందించిన ఆయన 1945లో కోయంబత్తూరులో మొదటి ఇంజనీరింగ్ కళాశాల స్థాపించారు. ఆయన రాసిన ప్రపంచ యాత్ర అనుభవాల గురించి ఓ పుస్తకం రాశారు. శ్రీలంక నుంచి బయలుదేరి ఏడాది పాటు ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు జి.డి. నాయుడు. ఇలా నాలుగుసార్లు తన జీవితకాలంలో వివిధ పర్యటనలు జరిపారు. ప్రతిసారి పర్యటన అనేక నెలలపాటు కొనసాగింది. ఈ పర్యటనలలో తనకు ఎదురైన సంఘటనలను ఈ పుస్తకంలో వివరించారు.ఆయన శ్రీలంకనుంచి బయలుదేరిన ఫ్రెంచ్ నౌక మార్గమధ్యంలో అగ్నిప్రమాదానికి లోనైంది. అప్పుడాయన ప్రాణాలు కాపాడుకోవడానికి సముద్రంలోకి దూకి ఈదుకుంటూ పోయి రష్యాకు చెందిన ఓ చమురు నౌకలో ఎక్కారు. ఈ సంఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. అయినప్పటికీ ఆయన ఈ ప్రమాదంలో ఆయన ఇద్దరు మహిళలను కూడా కాపాడి రష్యా నౌకలో ఎక్కించడం విశేషం.లండన్ లో ఉన్న రోజుల గురించి చెబుతూ అక్కడ ఉన్న రక్షకభటులను పరీక్షించిన సంఘటన ఆసక్తికరం. ఆయన తనకు తానే ఓ ఉత్తరం పోస్టు చేసుకున్నారు. చిరునామా అంటూ లేకుండా తనకెలా ఉత్తరం వచ్చిందో తెలీడం లేదని పరీక్షించుకున్న తీరు, చేతిలో చిల్లిగవ్వ కూడా లేనట్లు నటించి సహాయం పొందిన తీరు రంజుగా ఉంటాయి.తన 16 ఎంఎం కెమెరాతో ఎన్నో ముఖ్యమైన విషయాలను నమోదు చేశారాయన.ప్రత్యేకించి అయిదో జార్జ్ చక్రవర్తి మరణించినప్పుడు బకింగ్ హాం భవంతిలో జరిగిన ఆయన అంత్యక్రియలను జి.డి. నాయుడు చిత్రించారు. అలాగే 1936 లో జర్మనీ వెళ్ళి హిట్లర్ ని కలిసి ఆయనకు ఫోటో తీశారు. ఆ ఫోటోపై హిట్లర్ సంతకం కూడా తీసుకున్నారు.ముస్సోలినికి తీసిన ఫోటో గురించికూడా ఈ పుస్తకంలో రాశారు.కమలా నెహ్రూ అనారోగ్యంతో స్విట్జర్లాండ్ లోని ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. ఆరోజుల్లో అక్కడే ఉన్న నెహ్రూని కలిసి ఫోటోలు తీశారు. ఆ ఫోటోలలోనూ నెహ్రూ సంతకాలు తీసుకున్నారు.అలాగే ఆయన మహాత్మా గాంధీకి తీసిన ఫోటో గురించికూడా రాసుకున్నారు. ఆయన వెళ్ళిన ప్రదేశాలలో ఉండే ప్రముఖులకు ఫోటోలు తీయడం ఆయనకు అలవాటు.కానీ ఆ ఫోటోలన్నీ ఏమయ్యాయో తెలీలేదు. ఓమారు ఆయన చైనాలో పర్యటిస్తున్న సమయంలో కొందరు దోపిడీదారుల చేతికి చిక్కి బయటపడిన విషయాన్నికూడా రాసుకున్నారు. తాను బక్కచిక్కి జబ్బుపడ్డ వాడిలా కనిపించడంతో ఏమీ చేయక ఆ దోపిడీదారులు తనను విడిచిపెట్టేశారని రాసుకున్నారు.అమెరికా పత్రికలలో ఆయన గురించి వచ్చిన విషయాలు....అమెరికాలో యంత్రాల గురించి తెలుసుకున్న విషయాలు...అప్పుడు తీసుకున్న ఫోటోలు తన యాత్రానుభవ పుస్తకంలో నమోదు చేశారు.విదేశ పర్యటనలలో ఉన్నప్పుడు ఆయన శాకాహారాన్నే తీసుకునేవారు. వేర్వేరు దేశాలలోని ఆయన ఎదుర్కొన్న సంఘటనల గురించి రాసుకున్న జి. డి. నాయుడు ఓసారి చికాగోలో ఓ గదిలో ఉండగా నలుగురైదుగురు యువతులు తాగిన మత్తులో లోపలికి చొరబడి ఆయనతో ఆ రాత్రి అక్కడ నుంచి వెళ్ళబోమని గొడవపడి పడుకుండిపోయారట. తీరా ఆ రాత్రంతా వారికి కాపలా ఉండి నిద్రపోలేదట.16 ఎంఎం కెమెరా సృష్టికర్తను ఇంటర్వ్యూ చేసిన జి.డి. నాయుడు ఓమారు ప్రపంచ యాత్రను ముగించుకుని కేరళలోని కొచ్చి రేవు తీరానికి చేరుకున్నప్పుడు ఆయనను జర్మనీ గూఢచారిగా అనుమానించి అయిదురోజులు విచారణ చేశారట. కారణం, ఆయన దగ్గర.వేల ఉత్తరాలు, ఫోటోలు ఉండటమే. చివరికి ఆయన దగ్గర మరేదీ లేకపోవడంతో విడిచిపేట్టేశారు.జి.డి. నాయుడు 1974 జనవరి నాలుగో తేదీన మరణించారు.- యామిజాల జగదీశ్
August 15, 2020 • T. VEDANTA SURY • Memories