ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు మాలతీ చందూర్ వర్ధంతి ఈరోజు* స్మరించుకుందాం: మాడిశెట్టి గోపాల్
August 21, 2020 • T. VEDANTA SURY • News

మాలతీ చందూర్ కృష్ణా జిల్లా నూజివీడులో వెంకటాచలం, జ్ఞానాంబ దంపతులకు 1928 డిసెంబర్ 26న జన్మించారు. 8వ తరగతి వరకూ నూజివీడులోనే చదువుకున్న ఆమె.. ఏలూరులో హైస్కూలు, ఉన్నత విద్య పూర్తిచేశారు. అనంతరం ఏలూరులోనే కొంతకాలం ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ప్రముఖ రచయిత ఎన్‌ఆర్ చందూర్‌తో 1948లో ఆమె వివాహం జరిగింది. అనంతరం వారు చెన్నైలో స్థిరపడ్డారుఅనంతరం మాలతీ చందూర్ ఎన్నో రచనలు చేశారు. ఆంధ్రప్రభ వారపత్రికలో రాసిన ‘ప్రమదా వనం’ శీర్షికతో దేశవిదేశాల్లోని తెలుగు గృహిణులను ఎంతగానో ఆకట్టుకున్నారు. వరుసగా 47 ఏళ్లపాటు కొనసాగిన ఈ శీర్షిక గిన్నిస్ రికార్డులకు కూడా ఎక్కింది. 1953లో ‘వంటలూ-పిండి వంటలూ’ పేరుతో ఒక పుస్తకం రాశారు.
అలాగే పాత కెరటాలు పేరుతో అనేక ఆంగ్ల రచనలను అనువదించారు. ఆమె రాసిన ఆంగ్ల- తెలుగు భాషా వంటల పుస్తకం నేటికీ రికార్డు స్థాయిలో అమ్ముడుపోతోంది. చెన్నైలోని శ్రీపొట్టి శ్రీరాములు స్మారక సొసైటీ చైర్‌పర్సన్‌గా ఆమె అనేక సాహీతీ కార్యక్రమాలను నిర్వహించారు.
 ఎన్నో పురస్కారాలు
చందూర్ తెలుగులో 26 నవలలు, 300కి పైగా ఆంగ్ల రచనలకు అనువాదాలు చేశారు. ఆమె మొదటి కథ ‘రవ్వ లడ్డూలు’ కాగా.. మొదటి నవల ‘చంపకం చెదపురుగులు’. దాదాపు 11 ఏళ్ల పాటు కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా పనిచేశారు. ‘ఆలోచించు, భూమి పుత్రి, హృదయనేత్రి, కలల వెలుగు, మనసులోని మనసు, శతాబ్ది సూరీడు, శిశిర వసంతం’ వంటి అద్భుత పుస్తకాలను ఆమె రచించారు.
1987లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1993లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కోల్‌కతాకు చెందిన భారత భాషా పరిషత్ అవార్డు, తెలుగు వర్సిటీ అవార్డు అందుకున్నారు. ప్రముఖ తమిళ రచయితలు శివశంకరి, జయకాంతన్, ఎన్.ఎ.పార్థసారథి, పుళమై పిత్తన్, సుజాత, కలైంజర్ కరుణానిధి తదితరులు చేసిన రచనలను సైతం మాలతి తెలుగులోకి అనువదించారు.