ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఫలించని పులి కుట్ర: -యామిజాల జగదీశ్
August 30, 2020 • T. VEDANTA SURY • Story

ఓ అడవిలో ఓ పులి ఓ మనిషిని వెంబడించింది.
దాని నుంచి తప్పించుకోవడానికి అతను ఓ చెట్టు ఎక్కాడు.
చెట్టు పైభాగానికి చేరుకున్న అతనికి కంగుతిన్నాడు.
అక్కడ ఓ పెద్ద కోతి కూర్చుని ఉంది.
దానిని చూసి గజగజా వణికిన అతను కోతికి తల వంచాడు. తనను ఏమీ చేయవద్దని చెప్పుకున్నాడు.
అప్పుడా కోతి దిగులుపడకు. నేను నిన్ను ఏమీ చేయను... నన్ను కాపాడమన్నావుగా ...నీకు ఏ ఆపదా రాకుండా చూసుకుంటాను  ఈ రాత్రికి....అని మాట ఇచ్చింది కోతి.
రాత్రి రానే వచ్చింది.
మనిషిని తరుముకుంటూ వచ్చిన పులి ఆ చెట్టుకింద ఆకలితో కూర్చుని ఉంది. మనిషి, కోతీ వంతులేసుకుని నిద్రపోయారు.
మనిషి నిద్రపోతున్నప్పుడు కోతి కాపలా ఉండేది. కోతి పడుకున్నప్పుడు మనిషి కాపలా ఉండేవాడు.
ఈ విషయాన్ని గ్రహించిన పులి మనిషి, కోతి మధ్య తగవు పెట్టి వేరు చేస్తే తప్ప తనకు ఆహారం లభించదనుకుంది పులి. మనిషిని చూసి పులి నక్క వినయాలు పోయి మాట్లాడింది....మనిషీ, నా మాట విను, కోతి పడుకుంది కదా...దాన్ని చెట్టు మీద నుంచి తోసేసే....నేనిప్పుడు ఆకలితో ఉన్నాను. దాన్ని చంపి తినేస్తాను. నిన్ను ఏమీ చేయనంది పులి.
మనిషి మనసు కోతి కన్నా ప్రమాదకరం. తాను త్పపించుకోవచ్చన్న ఆలోచనతో పులి చెప్పినట్టే కోతిని చెట్టు పై నుంచి కిందకు నెట్టేసాడు.
చెట్టు కింద పడటంతోనే కోతి విషయాన్ని అర్థం చేసుకుంది. అప్పుడు పులి కోతితో, ఇదిగో నీకు మనిషి నైజం తెలియడం కోసమే అలా చేయించాను. నాకు కావలసింది మనిషి మాంసమే తప్ప నీ మాంసం కాదు.....నిన్ను విడిచిపెడుతాను. నువ్వు చెట్టుపైకి వెళ్ళి నిద్రపోతున్న మనిషిని కిందకు నెట్టేసే అని చెప్పింది. నీకు ఏ అపకారమూ చేయకుండా మనిషి మాంసం తిని నా ఆకలి తీర్చుకుంటానంది పులి.
పులి మాటలకు సరేనన్న కోతి చెట్టు పైకి వెళ్ళి మనిషిని సమీపించింది. కోతిని చూసి మనిషి భయపడ్డాడు.
కోతి ఇదిగో మనిషీ భయపడకు....నన్ను నమ్ము. నన్నేమీ చేయకు అని నన్ను శరణు వేడావు. కనుక నీకు ఏ ఆపదా రానివ్వను....నిన్ను కాపాడుతాను. పులి నుంచి తప్పించుకోవడం కోసం నిన్ను చెట్టు మీద నుంచి నెట్టేస్తానని నమ్మించి నీ దగ్గరకు వచ్చానంది కోతి. నువ్వే మాత్రం దిగులు పడకు. హాయిగా ఉండంది కోతి. కోతి, మనిషి మధ్య విభేదాలు సృష్టించి తన ఆకలి తీర్చుకోవాలనుకున్న పులి పన్నాగం తుస్సుమంది.
ఈ కథ నీతి ఏమిటంటే, ఒకరు మనల్ని నమ్మి సాయం కోరినప్పుడు వారికి కావలసిన సహాయాసహకారాలు అందించాలే తప్ప దగా చేయకూడదు. స్నేహానికి విలువివ్వాలి. స్నేహబంధాన్ని మించిది మరొకటి లేదు.