ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఫ్రాన్సిస్ డే - చెట్టియార్! ఇద్దరూ ఇద్దరే!!--తమిళనాడు రాజధానిగా చెన్నై ఎప్పుడూ సంచలనాలతో వార్తలలో ఉండే నగరమే. 1996 లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండిన ఎం. కరుణానిధి మద్రాసు నగరానికి చెన్నై అని పేరు మార్చారు. అప్పటివరకూ మద్రాసు దినోత్సవమని జరుపుకునే వారు. ఈరోజు కోటిన్నర జనాభాతో దేశంలోని ప్రధాన నగరాలలో ఒకటిగా మద్రాసు ఉంటోంది. ఇక్కడ ఏం జరిగినా నలుగురినోటా నానుతుంది.భారత దేశంలోని ఓ రాష్ట్ర రాజధానిగానే కాక ప్రపంచంలో ఉంటున్న తమిళులు గర్వంగా చెప్పుకునే ప్రాంతమై ఉంటోందీ నగరం. ఓవైపు మురికంటూ ఉన్నప్పటికీ తమిళులు సింగార చెన్నైగా చెప్పుకుంటూ ఉంటున్న ఈ నగరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది.ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటివరకూ తనను నమ్ముకుని బతకడానికొచ్చిన జీవితాన్నిచ్చిన నగరమై చరిత్ర పుటలకెక్కిన ఈ నగరం నేను పుట్టి పెరిగిననాటికీ ఇప్పటికీ ఎంతగానో మారిపోయింది కత్తిపారా జంక్షన్ ని రాత్రి పూట చూడటానికి బలే ఉంటుంది. చెన్నైలోని ఫ్లయ్ ఓవర్లు, మెట్రో రైల్ మార్గాలు, ఆకాశ హర్మ్యాలు అంటూ నగరం రూపురేఖలు ఎంతగా మారిపోయాయో చెప్పలేను. అటువంటి నగరాన్ని విడిచిపెట్టి వచ్చి తిరిగి వెళ్ళలేని పరిస్థితిలో హైదరాబాదులో ఉండటం బాధగానే ఉంది. వేరే దారి లేక ఉంటున్నానిక్కడ.ఆధునీకరణతో కొత్త రూపురేఖలతో వృద్ధి చెందిన ఈ చెన్నై నగరానికి శ్రీకారం చుట్టినతను "ఫ్రాన్సిస్ డే". తూర్పు ఇండియా కంపెనీ ఏజెంట్ అయిన ఫ్రాన్సిస్ డే 1639 ఆగస్ట్ 22వ తేదీన చోళ మండల సముద్ర తీరాన కొంత జాగా కొన్నాడు. ఆ వ్యక్తి కొన్న జాగాలో ఆంగ్లేయులు సెయింట్ జార్జ్ కోటను నిర్మించారు. ఆ తర్వాత దీని చుట్టుపక్కల నివాస స్థావరాలు పుట్టుకొచ్చాయి. అలా చెన్నై పట్టణం ఏర్పడింది.చెన్నై పేరుకు సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ముందు చెప్పుకున్నట్టే 1996లో డిఎంకె ప్రభుత్వం చెన్నై అనే పేరు మార్చకముందు మద్రాస్ అనే అంటుండేవారు.ఫ్రాన్సిస్ డే కొన్న జాగాకు సమీపంలో కన్ని జాలర్ల కుటుంబాలు నివసిస్తుండేవి. అలాగే ఫ్రాన్సుకి చెందిన ఇద్దరు కాథలిక్ ఫాదర్లు కూడా ఇక్కడ ఉంటుండేవారు. అప్పట్లో ఆదొక గ్రామం.ఆ గ్రామ రోమన్ కాథలిక్ నేత పేరు మదరాసన్ కావడంతో ఆయన పేరుతోనే మదరాస్ పట్టణమని పిలిచేవారనేదొక కథనం. అయితే మరొక కారణం ఈ పేరు వెనుక ఉందనీ చెప్పుకునేవారు. అప్పట్లో శాంథోంలో నివసించిన పోర్చుగీసువారికి చెందిన మాద్రా అనే సంపన్న కుటుంబానికి చెందిన ఓ యువతిని ఫ్రాన్సిస్ డే ప్రేమించాడని, దాంతో అతను తన ప్రియురాలి వంశస్తులైన మాద్రా అనే పేరుని తాను కొన్న జాగాకి పెట్టుకున్నాడని అనుకునేవారు.ఏదేమైనా మద్రాస్ నగరంలో తనకంటూ ఓ రైలునే సొంతం చేసుకున్న ఓ వ్యక్తి గురించి ఒకటి రెండు విషయాలు చూద్దాం. "తాటికొండ నంబెరుమాళ్" చెట్టియార్ అనే అతను చెన్నైలో ప్రసిద్ధమైన ఎర్రకట్టడాలను నిర్మించి చరిత్రపుటలకెక్కారు. ఆయనకు సొంతంగా ఓ రైలుండేది. ప్యారిస్ కార్నర్ లోని హైకోర్టు, లా కాలేజీ, ఎగ్మూరులో ఉన్న శిల్పకళ కళాశాల, మ్యూజియం, కన్నెమరా లైబ్రరీ, మద్రాస్ బ్యాంక్, వైఎంసిఎ వంటి కట్టడాలు ఈయన పర్యవేక్షణలో నిర్మించినవే. పద్దెనిమిదో శతాబ్దంలో ఆంగ్లేయులకు బిల్డింగ్ కాంట్రాక్టరుగా ఉండిన చెట్టియార్ నివసించిన భవనాన్ని శ్వేత భవనం అని అనుకునేవారు. ఈ భవనం చెట్ పట్ బ్రిడ్జీ సమీపంలో డాక్టర్ మెహతా ఆస్పత్రి వెనుక ఉంది. ఇది మూడు మేడల ఆవరణ. ముప్పై గదులుంండేవి. ఈ భవనంతోపాటు ఆ ప్రదేశంలో ఆయనకు తొంబై తొమ్మిది ఇళ్ళు ఉండేవి.అప్పటి మద్రాసులో విదేశ కారుని (French Dideon) కలిగి ఉన్న చెట్టియారుగా ఆయన గురించి గొప్పగా చెప్పుకునే వారు. కారేమిటీ ఆయన సొంత ప్రయాణాలకోసం నాలుగు పెట్టెల ట్రామ్ వాహనాన్ని ఆయన సొంతంగా కొనుక్కున్నారు. తిరువల్లూరులో ఉన్న వీరరాఘవ పెరుమాళ్ గుడికి ఆయన ఈ రైల్లోనే వెళ్ళి వస్తుండేవారు.1856 లో జన్మించిన చెట్టియార్ ఉండిన ప్రాంతాన్ని ఇప్పుడు చెట్ పట్ అంటున్నారుగానీ ఆయన కాలంలో చెట్టిపేట్టయ్ అని పిలిచేవారు. ఆయన బర్మా, రంగూన్ ల నుంచి టేకు చెట్లను దిగుమతి చేసుకునేవారు. వాటిని ఆయన శ్రీలంక, ఇంగ్లండ్, జర్మనీ, దక్షిణాఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తుండేవారు. త్రిచూర్ టింబర్ అండ్ సా మిల్స్ సంస్థ కు నిర్వాహక డైరెక్టరుగా ఉండిన ఈయన గణిత మేధావి శ్రీనివాస రామానుజం (1887 - 1920) అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆయనను తీసుకొచ్చి చికిత్చచేయించి దానికైన ఖర్చులను ఆయనే భరించారు. రామానుజం మరణించినప్పుడు ఆయన ముందుండి అంత్యక్రియలు జరిపించారు.చెట్టియార్ 1925 డిసెంబర్ 3 వ తేదీన చనిపోయారు. - యామిజాల జగదీశ్
July 25, 2020 • T. VEDANTA SURY • News