ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బంగారు కల--డి.కె.చదువులబాబు
October 15, 2020 • T. VEDANTA SURY • Story

మగధపుర రాజ్యంలో ధర్మపురం ఒక చిన్న పల్లెటూరు.అక్కడ రాజమ్మ,,రంగయ్య అనే దంపతులున్నారు.వారు చాలా పేదవారు.రెక్కాడితేకానీ డొక్కాడని జీవితం.వారికి ఒక కూతురు ఉంది.ముద్దులు మూటగట్టినట్లు చాలా అందంగా బంగారంలా ఉన్న ఆ అమ్మాయికి  బంగారు అని పేరు పెట్టారు.
ఆ పల్లెలో కనకయ్య అనే పెద్దాయన ఉన్నాడు. ఆయన కొడుకులకు పొలంపనులను అప్పజెప్పి,విద్యాదానాన్ని మించిన దానం లేదని తనవద్దకు పచ్చే వారికిఉచితంగాచదువుచెప్పేవాడు.ఆడపిల్లల చదువు గురించి ఎవ్వరూ పట్టించుకోని ఆ పల్లెలో ఆడపిల్లలందరూ పనులకుపోతూంటే బంగారు మాత్రం పట్టుబట్టి యుక్తవయస్సు వచ్చేవరకూ ఆయన వద్ద చదువుకుంది. ఆడపిల్ల చదువుకొని ఏం ఉద్దరించాలని అందరూ అన్నాకూడా ఆమె వెనుకడుగు వేయలేదు.ఆయన చదువుతో పాటు అనేక మంచిమంచి విషయాలు,కథలు చెప్పేవాడు.బంగారుకు పెళ్ళి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు.
ఒకరోజు బంగారుకు బంగారంలాంటి కల వచ్చింది.ఆమె పట్టువస్త్రాలు ధరించి,ఒళ్ళంతా వజ్రవైఢూర్యాలున్న బంగారు నగలు ధరించి ఉంది. ఒక అందమైన రాజకుమారుడు రెక్కలగుర్రం పై వచ్చాడు.ఆమె దగ్గరగా గాలిలో గుర్రాన్ని నిల్పి ,పరిచయం చేసుకుని వివాహమాడుతానన్నాడు.ఠక్కున కళ్ళు తెరిచి చూసింది.ఎవ్వరూలేరు.
ఆ కల అలా నాలుగురోజులు రావటంతో ఆశ్చర్యంతో అమ్మ,నాన్నలకు చెప్పింది.
"కలలునిజమవుతాయా?పూరిగుడిసెలో ఉండే నిన్ను రాకుమారుడు పెళ్ళి చేసుకోవటమేంటి?పిచ్చిపిచ్చి ఆలోచనలేంటి?"అనిమందలించారు.బంగారును ఆ కల వెంటాడుతూనే ఉంది.
బంగారు అమ్మమ్మ  గౌరమ్మ రాజధానిలో ఉంటోంది.పూలతో రకరకాల
అలంకరణలు సృష్టించటంలో ఆమెది అందెవేసిన చెయ్యి. తోటలో పూలతో రాజభవనాన్ని,రాజ దర్భార్ ను అలంకరించటం,రాణికి పూలజడలు తయారు చేయటం చేసేది.అందుకు కూలి అందేది.వయస్సు పైబడటంతో ఆమెకు రోజురోజుకూ ఓపిక తగ్గిపోతోంది.తోడుగా వుంటుందని మనుమరాలును రమ్మని కబురంపింది.బంగారు అమ్మమ్మ దగ్గరకు
వచ్చింది.ప్రతిరోజూ అమ్మమ్మతో కలిసి
రాజభవనానికెళ్ళేది.పనిలో బాగా సహాయపడేది.
మగధపురాన్ని  పరిపాలించే జయవర్థనుడు అనారోగ్యంతో మరణించటంతో ఆయన కుమారుడుచక్రధరుడురాజయ్యాడు.ఆయన సభ కవి, పండితులతో కళకళలాడుతుండేది. పండితగోష్టులు జరుగుతుండేవి.
ఒకరోజు  ప్రభాకరుడనే పండితుడు రాజసభకు వచ్చాడు.తాను మూడు ప్రశ్నలడుగుతానన్నాడు.మూడు ప్రశ్నలకూ ఒకే సమాధానం చెప్పాలి. సరైన సమాధానం చెప్పగల మేధావి ఈ రాజ్యంలో ఉన్నాడా?అంటూ సవాల్  విసిరాడు.అడగమన్నాడురాజు.
ప్రభాకరుడు చిరునవ్వుతో సభఅంతటా కలియచూసి ...
" ఈ భూమిమీద నిర్లక్ష్యానికి గురవుతున్న మహావృక్షం ఏది?
కోరని కోర్కెలుకూడా తీర్చే కల్పవృక్షంఏది?
గరళాన్నిమింగి అమృతాన్ని పంచే విశిష్టమై
న ప్రాణి ఏది?"అని ప్రశ్నించాడు.
ప్రభాకరుడి ప్రశ్నలు ఎంత ఆలోచించినా ఎవ్వరికీ అర్థంకాలేదు. పండితులందరూ తలలు పట్టుకుని కూర్చున్నారు.
చాలాసేపటి తర్వాత ప్రభాకరుడు" మీకు సమాధానం తోచటానికి కొన్ని సూచనలిస్తాను.నేను ఈ ప్రశ్నలడగటానికి ముందుగా మీరాజ్యంలో తిరిగాను.
పాఠశాలల్లో గోరువంకలున్నాయి. చిలుకలులేవు.పూజించవలసినపూలు నేలపైపడున్నాయి.తుమ్మెదలేమో పైపైనఎగురుతున్నాయి.ఎక్కడ చూసినా
పుష్పకవిమానాలు నేలపైకూలిపోయి ఉన్నాయి.వెలుగును పంచే జ్యోతులకు
నూనె కరువైంది"అన్నాడు.
'ఇవేమి సూచనలండీ...ప్రశ్నలకంటే కఠినంగా ఉన్నాయి' అనుకుంటూ దిక్కు
తోచక మౌనంగా ఉండిపోయారు.ఎవ్వరూ సమాధానం చెప్పకుంటే రాజ్యం పరువు మంటకలిసిపోతుందని అందరూ బాధపడసాగారు.ఆ సమయంలో అమ్మమ్మతో బంగారు అక్కడే ఉంది.
అప్పుడు బంగారు రెండుక్షణాలు ఆలోచించి, ముందుకువచ్చి"మీ ప్రశ్నలకు సమాధానం  '  స్త్రీ' అంది.
ప్రభాకరుడు ఆ సమాధానం సరియైనదనిచెప్పి  నమస్కరించాడు.
అక్కడ ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు.
వివరించమన్నాడు రాజు.
బంగారు చిరునవ్వుతో "మహారాజా!పాఠశాలల్లో గోరింకలున్నాయి,
చిలుకల్లేవంటేఅబ్బాయిలున్నారు,అమ్మాయిల్లేరని అర్థం.పూజించవలసినపూలు
నేలపై పడున్నాయి.తుమ్మెదలు పైపైన
ఎగురుతున్నాయంటే  గౌరవించవలసిన
పూలవంటిస్త్రీలుఅణచివేతకుగురవుతున్నారు.తుమ్మెదల్లా పితృస్వామ్య వ్యవస్థలో
పురుష్యులు అధికారం చెలాయిస్తున్నారని
అర్థం.ఎంతమంది సంతానమున్నా పుష్పక
విమానంలామోయగలదుస్త్రీ.ఆమెగౌరవించబడటంలేదనిఅర్థం.వెలుగునుపంచే జ్యోతులకు నూనె కరువైందంటే స్త్రీలకు ఆదరణకరువైందనిభావం.ఈనూచనలప్రకారం మూడుప్రశ్నలకూ సమాధానం స్త్రీ అని గుర్తించాను.  వృక్షం నీడ,ఆహారం,గాలి నిచ్చి తనసర్వస్వం ఇతరులకోసంఎలా అర్పిస్తుందో అలా కుటుంబంకోసం తన జీవితాన్నిఅర్పించే స్త్రీఅనేమహావృక్షంనిరాదరణకుగురవుతోంది.అమ్మగా,అక్కగా,భార్యగా,కూతురిగా కోరని కోర్కెలు కూడా గుర్తించి తీర్చేకుటుంబకల్పవృక్షం స్త్రీ.గరళంలాంటి కష్టాలను దిగమింగి కుటుంబంకోసం అమృతంలాంటి సుఖాలను పంచే ప్రాణి స్త్రీ .అలాంటి స్త్రీ మనరాజ్యంలో నిరాదరణకు,అసమానతకు గురవుతోందని చెప్పటం కోసం ఆయన ఈ ప్రశ్నలడిగాడు." అని వివరించింది.రాజు బంగారు నేర్పుకు,తెలివితేటలకు,అందానికి  ఆకర్షితుడయ్యాడు.ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నాడు.అక్కడే ఉన్న గౌరమ్మ అంగీకారం తీసుకుని, బంగారు ఒప్పుకుంటే ఆమెను వివాహం చేసుకుంటానని సభలో ప్రకటించాడు.
రాజు ప్రభాకరుడి ప్రతిభను ప్రశంసించి
సత్కరించబోయాడు.
ప్రభాకరుడు రాజసన్మానాన్ని తిరస్కరిస్తూ
"మహారాజా!ఈ సృష్టికి మూలం' స్త్రీ' యేకదా!స్త్రీ విద్యను ప్రోత్సహించండి. స్త్రీలకష్టాలను తొలగించే పథకాలను,వారిని ఆదరించి ,గౌరవించే శాసనాలను ప్రవేశపెట్టండి.అదేనాకుసత్కారం"అనిచెప్పి,మరో రాజ్యం వైపు బయలుదేరాడు ప్రభాకరుడు.
వజ్రవైఢూర్యాలు పొదిగిన నగలతో బంగారు పెళ్ళికూతురయింది.చక్రధరుడితో బంగారు వివాహం వైభవంగా జరిగింది.అందరి కలలూ నిజంకావు.కానీబంగారు కల నిజమైంది.
కనకయ్యగురువు తనకు చెప్పిన చదువు,కథలు తన ఆలోచనా పరిధిని పెంచి,జ్ఞానాన్ని ఇవ్వటంవల్లే తాను సమాధానం చెప్పగలిగానని కుటుంబసభ్యులతోచెప్పిందిబంగారు.
చదువు చాలావిలువైనదని ఆమె తల్లితండ్రులు,అమ్మమ్మ గ్రహించారు.బంగారం అదృష్టానికి సంతోషించారు.
డి.కె.చదువులబాబు.3/528.వై.యం.ఆర్.కాలనీ.ప్రొద్దుటూరు.వై.యస్.ఆర్.కడపజిల్లా9440703716