ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బంగారు తోడేలు--సుజాత.పి.వి.ఎల్.---రంగాపురం అనే ఊరిలో శరభయ్య అనేవాడు విగ్రహాలకు రంగులు వేస్తూ జీవనం సాగింస్తుండే వాడు.ఒకరోజు సాయంతం గణపతి బొమ్మకి బంగారు పూతని వేయాలని ఒక వెడల్పాటి తొట్టిలో బంగారు వన్నె గల రంగులు కలిపి ఉంచాడు. అంతలో ఎక్కడ్నుంచి వచ్చిందో గాని ఒక తోడేలు హడావిడిగా వచ్చి అనుకోకుండా ఆ తొట్టిలోకి జారి పడింది. ఆ తొట్టిలో బంగారు రంగు నీళ్లు ఉండేటప్పటికీ ఆ తోడేలుకి బంగారు రంగు అంటుకుంది. వెంటనే అడవిలోకి పరిగెత్తింది తోడేలు . అడవిలోని జంతువులన్నీ దాన్ని చూసి "బంగారు తోడేలు. ..బంగారు తోడేలు" అని పిలవడం మూలాన దానికి గర్వం ఏర్పడింది. ఈ రంగుతో అడవిలోని జంతువులన్నింటిని భయపెట్టొచ్చని ఆలోచించింది తోడేలు. మిగిలిన జంతువులు దాని ఠీవిని చూసి ఇదేదో కొత్త జంతువని తలచి భయం, భక్తితో మెలగ సాగాయి.వాటి పిరికితనాన్ని ఆసరాగా తీసుకున్న తోడేలు ..."రోజుకొకరు మాంసం తెచ్చి నాకివ్వాలని " ఆజ్ఞాపించింది. అలాగేనని రోజుకో జంతువు మాంసం తెచ్చి దానికివ్వ సాగాయి. కాలు కింద పెట్టనీయ కుండా సేవలు చేయ సాగాయి. ఇలా రాజా భోగాలు అనుభవిస్తుంది తోడేలు. ఒకనాడు అడవిలోని జంతువులన్నీ సమావేశానికి పిలిచింది తోడేలు. తను రాజ సింహాసనం పై కూర్చొని ''ఎప్పటికి నేనే ఈ అడవికి రాజుని.నేను చెప్పినట్టు వినక పోతే, సింహం పులి లాంటి జంతువుల్ని కూడా లెక్క చేయను, చంపేస్తాను..అర్థమైందా? ఖబడ్దార్ !"..అంటూ గర్వంగా విర్రవీగ సాగింది. అంతలో టపటపా ఉరుములుతో, మెరుపులతో వాన పడింది. అందరూ చూస్తుండగా ఆ బంగారు రంగు కాస్త నీళ్లలో కొట్టుకు పోయింది .మామూలు తోడేలుగా మిగిలి పోయింది . అసలు విషయం తెలిసిన మిగిలిన జంతువులన్నీ ఇంతకాలం మమ్మల్ని మోసం చేసి.. బానిసలుగా చూస్తావా? ..అంటూ చుట్టుముట్టి చితక బాదాయి . తోడేలు నిజ స్వరూపాన్ని బయట పెట్టిన వానదేవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి.--నీతి: చూశారా! పిల్లలూ ..! మోసం ఎంతో కాలం దాగదు.
June 27, 2020 • T. VEDANTA SURY • Story