ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బంగారు పక్షులు (నీతి కథ) ---సరికొండ శ్రీనివాసరాజు
November 8, 2020 • T. VEDANTA SURY • Story

"ఏం మార్కులురా? 600 కి 250 మాత్రమేనా? ఎంత తిట్టినా, కొట్టినా నీలో మార్పు రావడం లేదురా! అటు చదువు లేదు. ఇటు ఇంట్లో పనులు చేయవు. సోమరిపోతును భరించడం కష్టంరా! చెల్లెలిని చూడు. చిన్నదైనా ఎంత కష్టపడి చదువుతుందో! నిన్ను బండి మానిపించి, ఓ నాలుగు పశువులు కొని, వాటి బాధ్యత నీకు అప్పజెబితే అప్పుడైనా తెలుస్తుంది కష్టం విలువ." అన్నాడు సోము వాళ్ళ నాన్న. రోజులు గడుస్తున్నాయి. మళ్ళీ పరీక్షలు సమీపిస్తున్నాయి. "ఒరేయ్ శుంఠా! ఈసారి మార్కులు బాగా వస్తే నీకు ఇష్టమైన 100 రూపాయల చాక్లెట్ కొనిస్తారా. ఇప్పుడైనా చదివారా." అన్నాడు సోము వాళ్ళ నాన్న. సోము ఈసారి శ్రద్ధగా చదివాడు. 60 శాతం మార్కులు వచ్చాయి. అనుకున్నట్లే చాక్లెట్ కొనిచ్చాడు నాన్న.

 
      "సోము ఈసారి ఇంకా బాగా చదవాలిరా." అన్నాడు నాన్న. మంచి మార్కులు వస్తే ఏమి కొనిస్తాడో వాగ్దానం చేయలేదు. ఈసారి సోము మార్కులు 40 శాతానికి పడిపోయాయి. సోము చదువులో వెనుకబడడమే కాదు. ఇంటివద్ద ఏ పనులు చేయడు. ఆటలు కూడా ఆడడు. తిండి మాత్రం దండిగా తింటాడు. పెద్ద సోమరిపోతు.
 
       ఒకరోజు సోము అతని క్లాస్ మేట్ రాము పుట్టినరోజుకు రాము వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. రాము వాళ్ళ ఇంట్లో 5 పంజరాలలో రంగు రంగుల రామచిలుకలు కనిపించాయి. అవి సోమును ఎంతో ఆకర్షించాయి ‌ పుట్టినరోజు వేడుకల నుంచి ఇంటికి వచ్చిన సోము తనను ఆకట్టుకున్న చిలుకల గురించి చెప్పాడు. "ఈసారి నువ్వు పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోరా. నీకు బంగారు పక్షులనే బహుమానంగా ఇస్తాను." అన్నాడు సోము వాళ్ళ నాన్న. సోము మరింత పట్టుదలతో చదివాడు. ఈసారి చాలా మంచి మార్కులు సాధించాడు.
 
       సోము వాళ్ళ నాన్న సోమును, సోము చెల్లెలు అపర్ణను ఊరికి దూరంగా ఉన్న తన ఖాళీ ప్లాటుకు తీసుకెళ్ళాడు. అక్కడ పెద్దగా ఉన్న తుమ్మచెట్టుకు లెక్కలేనన్ని గిజిగాడు పక్షులు గూడు కట్టుకుని నివసిస్తున్నాయి. "ఆవే బంగారు పక్షులు." అన్నాడు సోము వాళ్ళ నాన్న. ఆశ్చర్యం! నిజంగానే బంగారు రంగులో ముద్దుగా ఉన్నాయి గిజిగాడు పక్షులు. "నాన్నా! అంత బుల్లి పక్షులు ఇంత అందమైన, అద్భుతమైన, పెద్ద గూళ్ళను ఎలా నిర్మించాయి?" అన్నాడు సోము. అప్పుడు అపర్ణ "మనమెంత చిన్నగా ఉన్నాము. ఎంతోమంది కృషి చేసి, మనకు ఇళ్ళు కడుతున్నారు కదా! అలాగే ఎన్నో గిజిగాళ్ళు కలసి వాటి ఇళ్ళను నిర్మించుకుంటున్నాయి." అంది. "అవి మనలా కాదు. ఏ పక్షి గూడు ఆ పక్షే నిర్మించుకుంటాయి. అన్ని పక్షులూ అంతే! అవి కష్టపడితేనే వాటి గూళ్ళు తయారు అవుతాయి. కష్టపడకుండా ఏ ప్రాణీ బ్రతకలేదు. ఇంత చిన్న గిజిగాళ్ళు చూడు. అంత అందమైన, అద్భుతమైన, పెద్ద గూళ్ళను ఇంత బుల్లి పక్షులు కట్టాయంటే అవి తమ శక్తికి మించి ఎంత కష్టపడ్డాయో చూడు." అన్నాడు సోము వాళ్ళ నాన్న. సోము సిగ్గుపడ్డాడు. ఆ బంగారు పక్షులకు మనసులోనే కృతజ్ఞతలు తెలిపి, వాటిని ఆదర్శంగా తీసుకుని, కష్టపడి చదివి, మంచి ప్రయోజకుడైనాడు.