ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బంగారు మనసుకు బంగారు పళ్ళు (సంయుక్త అక్షరాలు లేని బాలల కథ)-డా.ఎం.హరికిషన్ - కర్నూలు - 94410 3221
August 22, 2020 • T. VEDANTA SURY • Story

 ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆయన ధనం ఎక్కువగస్ వున్న ధనవంతుడూ కాదు. అలాగని ఏమీ లేని పేదవాడూ కాదు. ఏదో ఒక చిన్నపాటి రైతు అంతే... కాకపోతే అతనికి సంపాదించినది పదిమందికి పంచి పెట్టడమే గానీ, దాచి పెట్టుకునే అలవాటు అస్సలు లేదు. ఆ వూళ్ళో అందరూ అతన్ని చాలా గౌరవంగా చూసేవాళ్ళు.
   ఒకసారి అతను పక్కనే వున్న బంధువుల ఊరికి బైలుదేరాడు. దారిలో బాగా అలసిపోయాడు. ఒక పెద్ద మర్రిచెట్టు కనబడితే దాని కింద కూచున్నాడు. తన దగ్గర ఇంకా డబ్బుంటే ఎంత బాగుండు.. ఇంకా ఎంతో మంది పేదలకు సాయం చేసేవాడిని కదా అనుకుంటా అక్కన్నే నిదురబోయాడు. కాసేపటికి లేచి చూసేసరికి అక్కడ నేల మీదంతా ఎక్కడ చూసినా తళతళలాడతా బంగారు రంగులో మెరిసిపోతా వున్న మర్రిపళ్ళు కనబడ్డాయి. అతను చెట్టు పైకి చూశాడు. పైన మామూలుగానే వున్నాయి. దాంతో అవన్నీ మూటగట్టుకోని సంబరంగా ఇంటికి పోయాడు.
   తరువాత రోజు మళ్ళా ఆ చెట్టు కిందికి వచ్చాడు, మరిన్ని పళ్ళు దొరుకుతాయేమోనని. అలా ఎన్ని రోజులు వచ్చినా, ఎన్ని రోజులు పడుకున్నా మామూలు మర్రిపళ్ళు పదతా వున్నాయే గానీ ఒక్కటంటే ఒక్కటి గూడా బంగారుపండు పడటం లేదు. దాంతో అతను బాగా నిరాశపడి పోయాడు.
   ఒకరోజు వాళ్ళ వూరికి ఒక గొప్ప ముని వచ్చాడు. రైతు ఆయనకి జరిగిందంతా చెప్పాడు. ముని చిరునవ్వు నవ్వి “నాయనా... ఆ మర్రిచెట్టు అలాంటిలాంటి అల్లాటప్పా చెట్టు కాదు. చానా మహిమలు వున్న దేవతల చెట్టు. నీ మనసులో ఇతరులకు సాయం చేయాలనే కోరికతో నీవు పడుకున్నప్పుడు బంగారుపళ్ళు పడ్డాయి. కానీ నీవు వాటిని తీసుకోని సాయం చేయకుండా, రోజూ బంగారుపళ్ళ కోసం పోయావు. నీ బంగారం లాంటి మంచి మనసులో ఆశ వచ్చి చేరింది. అందుకే అది బంగారుపళ్ళను ఇవ్వలేదు" అని చెప్పాడు.
   రైతుకు వెంటనే తన తప్పు తెలిసిపోయింది. బంగారుపళ్ళన్నీ అమ్మేసి అవసరమున్న వాళ్ళకంతా సాయం చేశాడు. తరువాత రోజు చెట్టు దగ్గరకు పోయి “అమ్మా... నాలో ఎటువంటి దురాశా లేదు. మరిన్ని పళ్ళు దొరికితే ఒక్కొక్కనికి గాక వూరందరికీ వుపయోగపడేలా ఏదైనా పని చేద్దామని మాటి మాటికీ వచ్చానే గానీ ఆశతో గాదు. నా కోరిక మంచిదే అయితే మళ్ళా మరిన్ని పళ్ళు కురిపించు" అని మొక్కుకోని పడుకున్నాడు. అంతే... తరువాత రోజు పొద్దునకంతా ఎక్కడ చూసినా బంగారుపళ్ళే.