ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాధ్యత --విజయలక్ష్మీనాగరాజ్--హుజురాబాద్--9966559567
October 5, 2020 • T. VEDANTA SURY • Story

రెండు బస్సులు మారి అలసి సొలసి ఇంటికి చేరిన ఆనంద్ కు  స్వాగతం పలికాయి... వంట రూమ్ లో నుంచి నిలబడుతున్న గిన్నెల శబ్దాలు. సోఫాలో కూర్చుని ...కాళ్ళకు ఉన్న షూ విప్పేసి... టై లూస్ చేసుకుంటూ ...ఈరోజు శ్రీమతి గారు ఎందుకో కోపంగా ఉన్నట్టున్నారు అని  అనగానే... లోపల్నుండి గిన్నెల శబ్దం మరింత గట్టిగా వినపడింది. అబ్బో ...విషయం చాలా వేడి మీద ఉన్నట్టుందే... అని ఆలోచిస్తూ ఫ్రెషప్ అవడానికి వెళ్ళిపోయాడు.

ఛ...ఈయన ఎప్పుడు ఇంతే ...నన్ను నా ఫీలింగ్స్ ని ఏమాత్రం పట్టించుకోరు .ఇప్పుడు కూడా చూడు... నేను కోపంగా ఉన్నాను అని తెలిసి కూడా... ఏంటి అని అడగకుండా తన మానాన తాను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోయారు. అసలు మనసు అనేదే లేదు...వట్టి బండరాయి... గోడకు చెప్పినా ఈయన మీద అలిగినా ఒకటే...అని గొణుగుకుంటూ కాఫీ పట్టుకుని వెళ్ళింది రాధ.

అయినా నేనేం నా కోసం ఏమీ అడగలేదు కదా...ఆయన కోసమే అడిగా... రోజు రెండు మూడు బస్సులు ఎక్కి అలసిపోయి ఇంటికి వస్తున్నారు. ఒక కారు కొనమని అడగడం నేను చేసిన తప్పా... ఎప్పుడు చూడు నేను ఇంటికి పెద్ద కొడుకుని అంటూ బాధ్యతల గురించే మాట్లాడతారు గాని తన గురించి ఏరోజు ఆలోచించరు.

తమ్ముడికి ఉద్యోగం వచ్చింది .చెల్లి పెళ్లి అయిపోయింది ..ఇకనైనా మీ గురించి ఆలోచించండి  అని ఎంత పోరు పెడుతున్న నా మాటలు చెవికి ఎక్కించుకోవడం లేదు...నేను  నా బొఠిక్ మీద సంపాదించిన రెండు లక్షలు కూడా ఇచ్చా...ఇవాళ అయినా కార్ కొంటారో లేదో గట్టిగా అడగాలి...అని ఆలోచనలో మునిగిపోయింది.

ఆనంద్...రాగానే కాఫీ ఇచ్చి... ఏమండీ నేను రెడీ అయి వస్తా...కార్ షో రూంకి వెళ్దాం అంది.

ఆనంద్...అదీ...సారీ...రాధ...ఆ డబ్బులు చాలా అత్యవసరమైన పని పడి ...వాడేసా...అని ఇంకా ఏదో చెప్పబోతుంటే...

తోక తొక్కిన త్రాచులా ఒక్కసారిగా గయ్యిమంది... రాధ.

ఏంటి ఖర్చు చేశారా...ఇవి కూడా ఖర్చు అయిపోయాయా ..ఇక మీరు మారరా ...మన గురించి ఆలోచించరా... ఎప్పుడు చూడు ఆ పని ఈ పని అంటూ సంపాదించింది అంతా పంచుతూనే ఉంటారు కదా .ఇప్పుడు నేను కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా పంచేశారా... ఇప్పటివరకు మీరు ఎన్ని చేసిన భరించాను. ఇక మీదట భరించే ఓపిక నాకు లేదు...

అది కాదు రాధా ...ఒక్కసారి నేను చెప్పేది విను. ఏంటి మీరు చెప్పేది నేను వినేది. ఇక మీదట మీరు నాతో మాట్లాడకండి .కారు కొంటే మాట్లాడండి లేదా మానేయండి. అంటూ విసురుగా బెడ్ రూం లోకి వెళ్లి  తలుపేసుకుంది .

ఒఫ్ఫో...ఇది దీని ఆవేశం... చెబుదామన్నా వినదు కదా...మొండిఘటం...అని అనుకుంటూ టీవీ చూడడంలో లీనమై పోయాడు... కోపం తగ్గాక వివరాలు చెప్పొచ్చులే అని.

బెడ్రూం లో ఏడుస్తూ పడుకున్న రాధకి వాళ్ళమ్మ ఫోన్ చేయడంతో కళ్ళు తుడుచుకుని మామూలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ...హలో అమ్మా...అనగానే... ఒక్కసారిగా వాళ్ళమ్మ ఏడ్చేసింది...

కంగారుగా ఏమైందమ్మా...అని అడగ్గానే నాన్న గారు మధ్యాహ్నం కళ్ళు తిరిగి పడిపోయారు. హాస్పిటల్ కి తీసుకు వస్తే గుండెపోటు... అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అన్నారు.అన్నయ్య ఊర్లో లేడు... నాకు ఏమీ పాలుపోక అల్లుడు గారికి ఫోన్ చేస్తే అర్జెంట్గా రెండు లక్షలు తీసుకొని వచ్చి  మీ నాన్నగారి ప్రాణాలు కాపాడి...నా పసుపు కుంకుమలు కాపాడిన  దేవుడమ్మ  నా అల్లుడు... అంటూ ఎంతో ఉద్వేగంతో చెప్పింది.

అది విన్న రాధకి ఒక్కసారిగా కళ్లుతిరిగినట్టయింది..కొడుకు గానే కాదు అల్లుడయినా కొడుకే అని నిరూపించి కష్టకాలంలో ఆదుకున్న ఆనంద్ గొప్పతనంతో తన కళ్ళకు కమ్మిన స్వార్థపు పొరలు వీడిపోయాయి.

పరుగు పరుగున ఆనంద్ దగ్గరకు వెళ్ళి ...కన్నీళ్ళతో ...
నన్ను క్షమించండి... తొందరపడ్డాను

అమ్మ ఫోన్ చేసింది...
ఈ విషయం తెలియక  మిమ్మల్ని అపార్థం చేసుకున్నానండీ. నన్ను మన్నించండి" అంటూ ఆమె భర్త ఒడిలో వాలిపోయింది. 

ఆమె తన కోసం పడే తాపత్రయం తెలిసిన వాడై...మన వాళ్ళు అందరు బాగుంటే మనం సంతోషంగా ఉంటాం రాధా...లగ్జరీ ల దేముంది...ఇవాళ కాకపోతే రేపు కొనొచ్చు...అంటున్న భర్త ఔన్నత్యానికి మురిసి తనని అల్లుకుపోయింది.
 వాళ్లిద్దరి మధ్య ఉన్న మౌనానికి ఆ విధంగా తెరపడింది.