ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాబా ఆలయానికి బిచ్చగాడి విరాళం--నిన్న సాయంత్రం మిత్రులు కృష్ణారావుగారితో అవీ ఇవీ మాట్లాడుతుండగా ఒకటి రెండు ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆయన పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆయన దినచర్యలో భాగంగా షిర్డీ సాయిబాబా గుడికి, శనివారంపూట కుషాయిగూడాలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆదయానికి వెళ్ళి వస్తుంటారు.గురువారంపూట సాయిబాబా గుడి ముందర కూర్చుని అడుక్కునే వారికి, శనివారాలు వేంకటేశ్వర స్వామి గుడిదగ్గర కూర్చునే భిక్షగాళ్ళకు చిల్లరనాణాలు వేయడం ఆయనకు అలవాటు. అయితే ఆయన అంతకు దేశంలోని వివిధ ప్రాంతాలలో పని చేశారు. అక్కడక్కడా ఆయన గుడికి వెళ్ళొచ్చిన విషయాలు కూడా చెప్తూ చెప్తూ ఓ గుడి దగ్గరకు ఓ పెద్దావిడ కారులోంచి దిగి మధ్యాహ్నం వరకూ ఉండి తిరిగి కారులో వెళ్ళిపోయే కథనాన్ని చెప్పారు. ఆవిడ చిరిగిన చీర కట్టుకొచ్చేది కాదు. మామూలు నేతచీర కట్టుకొచ్చేదట. గుడి ముందర మిగిలిన భిక్షగాళ్ళతో పాటూ ఆమె కూర్చుని అడుక్కునేదట. కారులో వచ్చి పోతుండటం తెలుసుకున్న మిత్రులు కృష్ణారావుగారు ఆవిడ కథనాన్ని తెలుసుకునుంటే బాగుండేది. ఆయనే మరొక విషయం కూడా చెప్పారు విజయవాడ పరిధిలోని ముత్యాలంపాడులో ఉన్న సాయిబాబా గుడికి ఓ బిచ్చగాడు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిన విషయాన్ని చెప్పారు. అతని పేరు ఎడ్ల యాదిరెడ్డి.ఇక్కడి గోశాల ప్రహరీగోడపైన యాదిరెడ్డి ఫోటోను అతికించారట.ఆయన గుడి ముందర కూర్చుని అడుక్కుంటూ వచ్చన డబ్బులలో దాదాపు ఎనిమిది లక్షల.రూపాయలు ఆలయాభివృద్ధికోసం ఇచ్చారట. నల్లగొండ జిల్లాలోని చింతపల్లి గ్రామం యాదిరెడ్డి స్వస్థలం. ఆయన తన పదో ఏట విజయవాడకు వెళ్ళిపోయారు. తొలి థోజుల్లో రిక్షా తొక్కేవారు. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు రిక్షాపుల్లర్ గా జీవితం గడిపిన యాదిరెడ్డి తర్వాతిరోజుల్లో అనారోగ్యంపాలై రిక్షా మీద ఆధారపడలేక ముత్యాలంపాడు రామాలయం ముందర అడుక్కోవడం మొదలుపెట్టారు. తన ఆరోగ్యం నయమైతే లక్ష రూపాయలు సాయిబాబాకు మొక్కుకున్నారు. అలాగే ఆయన కోలుకున్న వెంటనే అనుకున్న లక్ష రూపాయలు బాబా గుడికి ఇచ్చేశారు. మొదట్లో ఆయన లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు ఆలయ నిర్వాహకులు కంగుతిన్నారట. ఓ బిచ్చగాడు అంత డబ్బు ఎలా ఇచ్చారని. కానీ ఇదంతా భక్తులు తనకిచ్చిన భిక్షేనని యాదిరెడ్డి చెప్పారు.ఈ ఆలయ గౌరవాధ్యక్షుడైన పి. గౌతం రెడ్డి మాట్లాడుతూ ఆలయంలో గోశాల అభివృద్ధికి యాదిరెడ్డి ఓమారు మూడు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారన్నారు. అలాగే దత్తాత్రేయ ఆలయ నిర్మాణానికి కూడా ఆయన ఇచ్చిన విరాళాన్ని వినియోగించామన్నారు గౌతంరెడ్డి. పైగా వెండి ఆభరణాలను కూడా ఇచ్చిన యాదరెడ్డికి కుటుంబమంటూ ఏమీ లేదు. జీవితాంతం సాయిబాబాకు సేవ చేయాలన్నదే తన ఆశయమన్నారు యాదిరెడ్డి.- యామిజాల జగదీశ్
June 27, 2020 • T. VEDANTA SURY • News