ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలసాహిత్యం ---47(1)-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 7013660252.
November 12, 2020 • T. VEDANTA SURY • Memories


పైడిమర్రి రామకృష్ణ ప్రముఖ బాల సాహిత్యవేత్త. పైడిమర్రి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో 1973 జూలై 18న జన్మించారు. ఇతని తండ్రి నరసింహ మూర్తి, తల్లి హేమలత. బాల్యం నుండి కథలు చదవడం, వ్రాయడం అంటే చాలా ఇష్టం. ఏడో తరగతిలోనే అప్పటి బాలల మాసపత్రికగా పేరు గాంచిన " బాలమిత్ర " లో కథలు వ్రాయడం ప్రారంభించి 
ఈ పత్రికలోఇప్పటికీ సుమారు 150కి పైగా కథా రచనలు చేసారు. బి. కాం కంప్యూటర్స్ తరువాత ఎం. బి. ఏ (మార్కెటింగ్) తమిళనాడులోని కాంచీపురం కంచి కామకోటి పీఠాధిపతులకు చెందిన శంకర స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో చదివారు. పైడిమర్రి రామకృష్ణ గారు మిమిక్రీ కళాకారుడిగా, మైమ్ ఆర్టిస్ట్ గా, చిత్రకారుడిగా, రేడియో ఆర్టిస్ట్ గా సుపరిచి తులుకాగా రచనా శక్తితో చిన్నతనం నుంచే కథలు రాయడం అలవాటు పడ్డారు. బాల సాహిత్యం మీద ఎన్నో పరిశోధ నలు చేసి సూటిగా సరళంగా చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకునే వ్యవహారిక భాషలో రచనలు చేయడంలో ఈయనకు ఈయనే సాటి. గ్రాంథిక ,  వ్యవహారిక భాషలో విద్యార్థులకు పట్టు లభించాలంటారు. తను వ్రాసిన కథలను అమూల్య గ్రంథాలుగా ప్రచురించారు. నిజానికి పైడిమర్రి గారు  వృత్తిరీత్యా హైదరాబాదులోని టెర్మినల్స్ ఎస్ ఐ ఎస్ ఇండియా లిమిటెడ్ లో రీజనల్ మేనేజర్ (సేల్స్) గా సేవలందిస్తున్నారు.   పైడిమర్రి రామకృష్ణగారి మొదటి కథ 1987లో చిన్నారి బాలల మాస పత్రికలో " బుద్ధి కుశలత” ప్రచురింపబడింది. ఇప్పటివరకు దాదాపు 400 కథలు వరకు ప్రముఖ బాలల పత్రికలలో బాలల శీర్షికలలో ప్రచురింప బడ్డాయి.1999లో  రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ, రాష్ట్ర సాంస్కృతిక మండలి సంయుక్తంగా నిర్వహించిన కథానిక  శిబిరానికి ఖమ్మం జిల్లా రచయితగా 15 రోజులు శిక్షణ పొంది, కథా రచనలో అనేక మెలకువలు నేర్చుకున్నారు. ఇప్పటి వరకూ 370 కథలు పైబడి రాశారు. తాను రాసిన కథలలో కొన్నింటిని  "అనగనగా ఒక అడవి", మామయ్య డాట్.కాం, రంగుల రాట్నం, చింటుగాడి కథలు, మృగరాజు కథాసంపుటాలుగా తెచ్చారు.“ చింటూగాడి కథలు" కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యా లయం సాహితీ పురస్కారం అందుకోవడం విశేషం. దేశం నలుమూలలా ఉన్న తెలుగు  బాలల సాహితీవేత్తలను పరిచయం చేస్తూ " బాల సాహితీ శిల్పులు"(సూర్య ఆదివారం అనుబంధం లో ) “ బాల సాహితీ బంధువులు” (ఆంధ్రప్రభ - బాలప్రభలో సాహితీ అలలు” (అల పత్రికలో) అనే శీర్షికలను నిర్వహించారు. 1999 లో గుంటూరు నుంచి కొంతకాలం వచ్చిన విజేత ఆదివారం అనుబంధంలో " కథా కిరణాలు" శీర్షికన దాదాపు 120వారాలు కథకుల పరిచయాలు పైడిమర్రి వ్రాశారు.వీటిని " బాల సాహితీ శిల్పులు", కథా కిరణాలు" మన తెలుగుకథ కుల పుస్తకాలుగా ప్రచురించారు.  పైడిమర్రి గారికి ప్రౌఢ సాహిత్యములో పెద్దల కథలు రాయటంలో నేర్పు ఉన్నా బాలసాహిత్యం వైపే ఆసక్తి చూపి ఆ దిశగా కృషి చేశారు. పైడిమర్రి బాలసాహిత్య కృషిని గుర్తించి బాల సాహిత్య పరిషత్తు, కిన్నెర ఆర్ట్స్, ఢిల్లీ తెలుగు అకాడమీ వంటి సంస్థలు ఘనంగా సత్కరించాయి. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారిచే బాలసాహిత్యంలో కీర్తి, సాహిత్య పురస్కారాలు రెండూ అందుకున్నారు. ఇలా బాలసాహిత్యం రెండూ  అందుకున్న మొదటి రచయిత పైడిమర్రి కావడం విశేషం. వీటితో పాటు" కొలసాని- చక్రపాణి" బాల సాహిత్య పురస్కారం, చొక్కాపు బాల సాహిత్య పురస్కారం, నారంశెట్టి బాల సాహిత్య పురస్కా రం, ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారి గోకులం సంస్థచే " బాల నేస్తం" రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ వారి యూత్ అవార్డులు అందుకున్నారు. ఖమ్మంలో కొంతకాలం "  స్థిగ్ధ యూత్ అసోసియేషన్  వ్యవస్థాపక అధ్యక్షులుగా బాల సాహితీ కార్యక్రమాలు పైడిమర్రి నిర్వహించారు. 2000 సంవత్సరం జనవరి 26న ఖమ్మం జిల్లాలో అప్పటి జిల్లా కలెక్టర్ ఏ. గిరిధర్ 1997 - 98 యూత్ అవార్డు బాల సాహిత్యములో అందించి రెండు వేల రూపాయలు రివార్డు, సన్మాన పత్రం  అందజేసి సన్మానించారు. అనేక బాల సాహితీ శిక్షణ కార్య శాలలో పాల్గొని అనేకమంది బాలలకు, బాలసాహితీవేత్త లకు మార్గదర్శకులయ్యారు. ఎంతో కాలంగా రాష్ట్ర బాలసాహిత్య పరిషత్తు కోశాధికారిగా సేవలందిస్తున్నారు పైడిమర్రిగారు. నిజానికి ఒక కథ పిల్లల కోసం రాయాలంటే రచయిత బాలల స్థాయికి ఎదిగి రాయాలి అని అంటారు వీరు. ( సశేషం )