ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలసాహిత్యం ---51(2)--శివ్వాం. ప్రభాకరం,బొబ్బిలి,ఫోన్ : 7013660252.
November 19, 2020 • T. VEDANTA SURY • Memories

వేంపల్లి రెడ్డి నాగరాజు గారు ఎల్. ఐ.సీ ఉద్యోగంలో చేరకముందు ఈనాడు, ఉదయం, ఆంధ్రజ్యోతి,  దినపత్రికలలో జర్నలిస్ట్ గా పనిచేసారు. తరువాత కాలంలో ఉద్యోగం చేస్తూ ప్రౌఢ సాహిత్యంలోనూ, బాలసాహిత్యం లోనూ విశేష కృషి చేసారు. బాల సాహిత్యాన్ని బాలలకు
చేరువ చేయాలనే ఉద్దేశంతో తన స్వంత డబ్బు ఖర్చు పెట్టి 
 "రూపాయికే నీతికథ" అనే స్లోగన్ తో 40 వేల వరకూ ముద్రించి 40వేల కథల పుస్తకాలను బాలలకు అందజేశారు. ఒక పుస్తకాన్ని రూపాయికి అమ్మడంలో ఆంతర్యం ఏమంటే రూపాయి ఇచ్చి పుస్తకం కొంటే  దాని విలువ కొనుక్కున్న వారికి తెలుస్తుంది. అదే ఫ్రీగా అందజేస్తే ఆ పుస్తకాలు వృధా అయ్యే ప్రమాదం ఉంది అంటారు నాగరాజు. ఆ ఆలోచన తోనే పుస్తకానికి రూపాయి ధర నిర్ణయించారు. అలా బాల సాహిత్యం అభివృద్ధిని కోరుకున్నారు. విద్యార్థులలో నైతిక విలువలు, సంబంధాలను పెంపొందించే కథలను నాగరాజు గారు అనేకం రాశారు. కవిగా గుర్తింపు పొందిన నాగరాజు గారు బాలల కోసం సరళమైన పదాలతో, తెలుగు పాటలు, నీతి కథలు తయారు చేసి విద్యార్థులకు అందజేశారు. ఆయన కథలు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యార్థుల పరిశోధన కోసం వినియోగిస్తున్నారు. ద్రవిడ విశ్వవిద్యాలయము ఈయన రచనలపై పూర్తిస్థాయి  పరిశోధన కొనసాగుతుంది. బాల సాహిత్యం పై ప్రత్యేక ఆసక్తి కలిగి ఉన్న నాగరాజు గారు ఇప్పటివరకూ
 " బొమ్మలు చెప్పని కమ్మని కథలు, బొమ్మలు చెప్పిన కమ్మని కథలు, పాల బుగ్గలు పసిడి మొగ్గలు, నవతరం బాలల నీతి కథలు, గోరుముద్దలు అనే కథాసంపుటాలు వెలువరించారు. ఆయన కృషికి దక్షిణ భారత హిందీ ప్రచార సభ జాతీయ పురస్కారాన్ని  కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ సుష్మా స్వరాజ్ చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్ర మంత్రులుగా నేదురుమిల్లి రాజ్యలక్ష్మిగారు, కాల్వ శ్రీనివాసులుగారు  పని చేసిన కాలంలో నాగరాజుగారు వారి చేతుల మీదుగా ఉత్తమ పురస్కారాలను అందుకున్నారు. 2012లో అంతర్జాతీయ తెలుగు మహాసభల నిర్వహణలో భాగంగా కడపలో రెడ్డి నాగరాజును సత్కరించారు.బాలసాహిత్యంలో వీరి సేవలకుగాను  రాయచోటి  రాజు విద్యా సంస్థల ప్రతినిధులు  " బాల సాహితీ మిత్ర " బిరుదును ప్రదానం చేశారు. విద్యార్థుల్లో మార్పు తేవడానికి తన వంతు కృషి  చేస్తున్నాననీ, గాడి తప్పిన సంబంధ బాంధవ్యాలు బాల సాహిత్యంతో నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నానీ  ఎల్లప్పుడు నాగరాజు గారు అనేవారు. విద్యార్థులలో లోపించిన నైతిక విలువలు, సంస్కారం, ఋజువర్తనము పెంపుదలకు బాల సాహిత్యం దిక్సూచిలా పనిచేస్తుందనీ, పిల్లలలో సామాజిక స్పృహ, సత్ప్రవర్తన, క్రమశిక్షణ వంటి లక్షణాలు అలవడేం దుకు  బాల సాహిత్యం ఎంత గానో ఉపకరిస్తుందనేది తన విశ్వాసం అంటారు నాగరాజు. పలు నీతి కథలను విద్యార్థులకు అందించడమే తన లక్ష్యంగా భావించేవారు. సాధారణ కథలు కంటే బాలల కోసం వ్రాసే కథలే ఎంతో తృప్తినిస్తాయనీ, బాలలు చిన్న మొక్కలు లాంటి వారనీ మొక్కలోనే వంచే శక్తి బాలసాహిత్యానికి ఉందనీ, నైతిక విలువలు గల బాలలు భవిష్యత్తులో ఉన్నతమైన సమాజాన్ని నిర్మించగలరనీ, అందుకు కుటుంబం, పాఠశాలు  బాలల నైతిక ప్రవర్తన పై ఎంతో ప్రభావం చూపుతాయనీ, ఆ విలువలు ఇక్కడి నుండే ప్రారంభం కావాలంటారు. అలాంటి చదువులు అవసరమనీ, విద్యార్థులలో పుస్తక పఠనం పెంపునకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలనీ, చందమామ బాలమిత్ర లాంటి కథల పుస్తకాలు నేటి కాలం లో బాలలకు అందుబాటులో లేకపోవడం  బాలసాహిత్యా నికి తీరని లోటును చేకూర్చుతుందనీ అంటారు నాగరాజు. విద్యార్థులలో విలువలనూ, మేథా శక్తిని, ఆలోచనా శక్తిని పెంపొందించేందుకు బాలలు కథలు వినేందుకు ఒకటి లేక రెండు పీరియడ్లు తప్పనిసరిగా కేటాయించాలి అంటారు నాగరాజు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలో బాల సాహిత్యం అనగానే  వెంటనే గుర్తుకొచ్చే పేర్లలో రెడ్డి నాగరాజు పేరు ఉండేలా పేరు సంపాదించుకున్నారు. సశేషం