ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలసాహిత్యం---39(1)-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,ఫోన్ : 7013660252.
October 26, 2020 • T. VEDANTA SURY • Memories

 నడిచే విజ్ఞాన సర్వస్వం(వాకింగ్ ఎన్సైక్లోపీడియా)
అని పిలువబడే బుడ్డిగ సుబ్బరాయన్ ప్రముఖ బాల సాహితీవేత్త. సాధారణంగా ఇతని పేరును బట్టి మన తెలుగువాడు కాదు అనుకోవచ్చు. ఇతను పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 1928 మే 2వ తేదీన జన్మించారు. ఇతని తండ్రి బుడ్డిగా వెంకన్న. తల్లి సుబ్బమ్మ. 1945 వరకు నరసాపురంలో చదువుకొని 1945 నుంచి 1947 వరకు రాజమండ్రిలోనే ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువు పూర్తి చేశారు. 1948 నుండి 1950 వరకు మద్రాస్ యూనివర్సిటీ ప్రెసిడెన్సీ కళాశాలలో బీఎస్సీచదివారు.1951 మే నెలలో వివాహం జరిగింది. వివాహం కాకముందే అంటే 1950లో మద్రాస్ లో గల తెలుగు భాషా సమితిప్రచురించిన సర్వస్వం తయారు చేసే కార్యక్రమంలోమునిగిపోయారు.14 సంపుటాలతో అతిపెద్ద తెలుగు ఎన్సైక్లోపీడియా పథకానికి సలహాదారుగా ముఖ్య సమన్వయకర్తగా పని చేశారు. గాడిచర్ల హరి సర్వోత్తమరావు తో కలిసివయోజన విద్యకు సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అక్షరాస్యత ఉద్యమానికి ఎనలేని సేవ చేశారు. 1967 నుండి దుర్గాభాయ్ దేశ్ ముఖ్ తో కలసి విద్యా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.1962 - 63 సంవత్సరాల మధ్య సుబ్బరాయన్ గారు" విజ్ఞాన వాహిని " సైన్స్ మాస పత్రిక సంపాదకుడిగా పనిచేశారు.1973లో తెలుగు భాషా సమితి తరపున సి ఎస్ ఐ ఆర్ ఆర్థిక సహాయంతో  “ విజ్ఞాన ప్రగతి” అనే సైన్స్ మాసపత్రిక కు సుబ్రహ్మణ్యంగారు సంపాదకత్వం వహిస్తూ 1973 నవంబర్  నెలలో “ విజ్ఞాన ప్రగతి” ని బాలల విజ్ఞాన సంచికగా నిర్వహించారు. 1975 వరకు ఆ పత్రికను 
అత్యంత విలువైన విజ్ఞాన సమాచార మాస పత్రికగా నిర్వహించారు. 1976లో హైదరాబాదులో నెలకొల్పబోయే  బాలల అకాడమీకి సరైన వ్యక్తి  బుడ్డిగ సుబ్బరాయన్ అని రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు తలచారు. కానీ అప్పటికే విజ్ఞాన సర్వస్వం తయారు చేయుటలో మునిగి ఉన్న సుబ్బరాయన్ గారు ఆ పదవిని స్వీకరిద్దామా వద్దా అన్న ఆలోచనలో పడ్డారు. దానికి కారణం అప్పటికే విజ్ఞాన సర్వస్వం 13 భాగాలు తయారయ్యాయి. 14 భాగం మాత్రమే మిగిలి ఉంది. రాఘవరావుగారు సుబ్బరాయన్ పై ఒత్తిడి తెచ్చారు. ఆ కారణంగా సుబ్బరాయన్ గారు 1976 సెప్టెంబర్ 6 న హైదరాబాద్ లో గల " ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ" లో సంయుక్త కార్యదర్శి పదవి చేపట్టారు. ఆ తరువాత 1976 సెప్టెంబరు 14 తేదీనాడు భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీని ప్రారంభించారు. సుబ్బరాయన్ 1976 అక్టోబరులో ఆంధ్రప్రదేశ్ లో గల సమితిస్థాయి, జిల్లా స్థాయి లలో బాలలకు ప్రతిభా పాటల పోటీలను నిర్వహించారు. 1977 ఫిబ్రవరి 11 నుండి 17వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు“ ఆంధ్ర ప్రదేశ్ బాలల మహాసభలు”  పేరిట నిర్వహిం చారు. దీని ముఖ్య లక్ష్యం ఏమిటంటే  ఎదుగుతున్న బాలల్లో భావ సమైక్యత సాధించ డమే దీని ముఖ్యోద్దేశం. బుడ్డిగ సుబ్బరాయన్ వివిధ జిల్లాల నుంచి 44 మంది బాల బాలిక లను ఎంపిక చేసి ఆంధ్ర ప్రదేశ్ దర్శన్ యాత్రను సాగించారు. పర్యాటక స్థలాలలో ఉన్న ఆకర్షణీయమైన ప్రదేశాలను         “ ఆంధ్రప్రదేశ్ దర్శన్ " పేరుతో ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు.( సశేషం )