ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలసాహిత్యం---40(2):- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 7013660252.
October 29, 2020 • T. VEDANTA SURY • Memories

చొక్కాపు వెంకట రమణగారు బాల చంద్రిక పిల్లల మాస పత్రిక కు సంపాదకుడిగా బాల చెలిమి, చెకుముకి మాస పత్రికలకు గౌరవ సలహాదారుడిగా వ్యవహరించారు.బాలల తొలి వ్యక్తిత్వ వికాస మాసపత్రిక అయిన" ఊయల" కు సంపాదకునిగా పనిచేశారు. ఆయన పిల్లల కోసం కథారచన శిక్షణా శిబిరాలు, బాలసాహిత్య రచయితల  సదస్సులు నిర్వహించారు, వివిధ దిన వార మాస పత్రికల లో అనేక శీర్షికలు నిర్వహించారు. సుమారు 500కు పైగా వ్యాసాలు, కథలు గేయాలు ఇతను శీర్షికలతో రచనలు చేశారు. ఆంధ్రప్రభ దినపత్రికలో బాలప్రభ, ఆంధ్రభూమి దినపత్రికలో బాల భూమి వంటి ప్రత్యేక కాలమ్స్ నిర్వహించారు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో వీరి నిర్వహించిన "ఊయలకు" మంచి పేరు వచ్చింది. " చెట్టు మీద పిట్ట" అనే కథా సంపుటి పర్యావరణం గురించి వ్రాయబడింది.ఈ కథా సంపుటి ఇది చిన్నారుల మనసుల్లోకి పోతుంది. దీనికి పలు అవార్డులు కూడా వచ్చాయి. “ చెట్లు చెప్పిన కథలు ” పుస్తకానికి  తెలుగు విశ్వవిద్యా లయం సాహితీ పురస్కారం - 2016 లభించింది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సేవ విశిష్ట పురస్కారంతో సత్కరించింది.  కేంద్ర సాహిత్య అకాడమీ వారు బాలసాహిత్య పురస్కారాన్ని  చొక్కాపువారు 2015 లో  అందుకున్నారు. అంతేకాకుండా “ బాల సాహితీ భూషణ” అవార్డును కూడా అందుకున్న చొక్కాపు వారు  75కు పైగా పుస్తకాలు రాశారు. "కథాకుటీరం" సంస్థను స్థాపించి భారతదేశంలో తొలిసారిగా తెలుగులో కథలు చెప్పే పండుగను "కథాకళి " పేరుతో ఏడు రోజుల పాటు 2018లో నిర్వహిం చారు.100 నిమిషాలలో 100  కథలు చెప్పి ప్రపంచ  రికార్డు సృష్టించి “ స్టోరీ పోటర్” అవార్డు పొందారు. పాఠశాల ఉపాధ్యాయులకు “ క్లాస్ రూమ్ స్టోరీ టెల్లింగ్ ఫర్ టీచర్స్ ” పేరుతో అనేక పాఠశాలల్లో శిక్షణా శిబిరాలు నడిపారు.  చొక్కాపు వెంకట రమణగారు తను కథ, మాటలు రాసిన “శిఖరం” పిల్లలు సినిమాకి రాష్ట్ర ప్రభుత్వ బంగారు నందిని  ప్రముఖ నటుడు అమితా  బచ్చన్ చేతుల మీదుగా అందుకున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన డాక్టర్ రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారాన్ని లక్ష రూపా యల నగదును భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ చేతుల మీదుగా అందుకుని  సత్కరింపబడ్డారు. అంతేకాదు. డాక్టర్ ఎన్. మంగాదేవి బాల సాహిత్య పురస్కారం, చక్రపాణి కొలసాని బాల సాహిత్య పురస్కారం సమతా రావు , బాల సాహిత్య పురస్కారం అందుకున్నారు. ఇతర దేశాలైన ఇండోనేషియా, జకార్తాలో “ ఇంద్రజాల కిరీటి” పురస్కారం, మైమ్ కళాధర్ చారిటబుల్ ట్రస్ట్ వారి “ సేవా శిఖర ”పురస్కారం వంటి100 కు పైగా అవార్డులు చొక్కాపువారు అందుకున్నారు.చొక్కాపు వెంకట రమణ గారు వ్రాసిన రచనలు గుజరాత్ మహారాష్ట్ర ప్రభుత్వాలు బడి పిల్లలకు పాఠ్యాంశాలుగా పెట్టబడ్డాాయి. తెలంగాణ రాష్ట్ర సిలబస్ కమిటీలోనూ తెలుగు అకాడమీ టెట్ టీచర్లకు రూపొందించిన కళలు - కళా విద్య నిర్మాణ కమిటీలోను సభ్యులుగా పాల్గొన్నారు. వీరి రచనలు హిందీ కన్నడ భాషల్లోకి అనువదించబడ్డాయి. చొక్కాపు వారు మెజీషియన్ గా దేశవిదేశాలలో 7 వేలకు పైగా ఇంద్రజాల ప్రదర్శనలిచ్చి " మేజిక్ చాప్లిన్" గా వేలాది మంది బాలలకు ఆత్మీయులయ్యారు."మ్యాజిక్ ఫన్ స్కూల్ "స్థాపించి 5000 
మందికి మ్యాజిక్ లో ఉచిత శిక్షణ ఇచ్చారు ఎంతోమందితో ప్రపంచ రికార్డు విన్యాసాలు నిర్వహించారు వందలాది మంది కళాకారులకు  ఉపాధి మార్గాలు చూపిం చారు. బాలల హక్కుల రక్షణకు ఉద్యమించారు.తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు,విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సిలింగ్ తరగతులు నిర్వహించారు. చొక్కాపువారికి పిల్లలే జీవితం,
పిల్లలే ప్రపంచం. పిల్లలే సర్వస్వమని అందరూ చెప్పుకుం
టారు. ఇక చొక్కాపువారి మ్యాజిక్  సినీ ప్రముఖులను ఎలా ఆకర్షించిందో చెప్పుకుందాం. ప్రముఖ సినీ హీరో చిరంజీవికి మ్యాజిక్ నేర్పి “  కొదమ సింహం”  సినిమాలో మ్యాజిక్ ను చిరంజీవి ద్వారా చేయించారు. జోకర్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ తోనూ, " వన్స్ మోర్" సినిమాలో ఆలీ, చిన్నా, తనికెళ్ల భరణి గార్ల తోను, “ స్వరకల్పన” లో ఏడిద శ్రీరామ్ గారిచేతను చొక్కాపువారు తన మ్యాజిక్ విద్యను
ప్రదర్శింపజేసారు. ( సశేషం )