ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలసాహిత్యం---42 (1)-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,--ఫోన్ : 7013660252.
November 2, 2020 • T. VEDANTA SURY • Memories

సాహితీవేత్తలను గుర్తుకు తెచ్చుకునే టప్పుడు తప్పనిసరిగా ప్రముఖ సాహితీవేత్త పత్తిపాక మోహన్ గారు మన జ్ఞాపకా లకు వస్తారు. కరీంనగర్ జిల్లాలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన సిరిసిల్ల సమీపంలోని " లింగంపేట"  గ్రామంలో  5 జనవరి,1972లో చేనేత వృత్తి నేపథ్యం గల పెద్ద ఉమ్మడి కుటుంబంలో జన్మించారు. వీరి ఇంటిపేరున  ఒక వీధి కూడా ఉంది. అదే పత్తిపాక వారి వీధి.  పత్తిపాక లక్ష్మీరాజం, గంగా భాయి  దంపతులకు మోహన్ జన్మించారు. బాల్యం నుండే మోహన్ గారి తాతగారు బ్రహ్మశ్రీ శంకరయ్య ఓనమాలు కంటే ముందుగా మోహన్ గారికి వేమన, కబీరుల గురించి చెప్పేవారు. పత్తిపాక మోహన్ గారి మేనత్త  ఇందిరాభాయి పుస్తక ప్రపంచానికి పరిచయం చేశారు.  చందమామ, ఇతర పత్రికలు, పుస్తకాలు ఆమె అధికంగా కొని  చదివి అందులో ఉన్న  కథలను, ఇతర విషయాలను విద్యార్థిగా ఉన్న మోహన్ కు తెలియజెప్పే వారు. వీరి మేనత్త, తాతగారు లేకుంటే సాహిత్యంతో మోహన్ గారికి సంబంధం ఉండేది కాదేమో అని అంటారు.అలా వారు మోహన్ గారి జీవితాన్ని సాహిత్య  రంగం వైపు బాల్యం నుండే మళ్ళించినట్టయింది.చేనేత రంగం కుటుంబంలో పుట్టి సాహిత్య రంగ కుటుంబానికి మళ్ళి చేనేత రంగ కుటుంబాల కష్టసుఖాలను తన కవితల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన ఘనుడు మోహన్.
 మోహన్ గారు 7వ తరగతి చదువుతున్నప్పుడు వారి ఉపాధ్యాయుడు రిపబ్లిక్ డే నాడు సభ నిర్వహణ కార్య క్రమం అప్పజెప్పారు. అంత చిన్న వయసున్న మోహన్  గారు " నేను అంతటి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించలేను "అని చెప్పలేదు. మొదటి  సభా వ్యాఖ్యానం అయినా జడవలేదు. బెదరలేదు. వ్యాఖ్యానం చేసి అందరి మెప్పును పొందారు. అలా స్కూలులో ప్రారంభమైన సభా వ్యాఖ్యనం, గవర్నర్ సభలో చేసే ప్రసంగం వరకూ దారి తీసింది. ప్రముఖవ్యాఖ్యాతగా పేరు బడసారు.  రమారమీ 800 సభలను నిర్వహించారు. మోహన్ గారు 7వ తరగతి చదువుతున్న ప్పుడే  " ఓటు" మీద కవిత రాశారు. స్కూలు మేగజైన్లో కవితలు రాసేవారు. తదుపరి  తన మిత్రులతో కలసి "కవిత్వం" అనే లిఖిత పత్రికను నడిపారు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు  గూడూరు సీతారాం గారి ద్వారా ప్రముఖ కవి సి. నారాయణ రెడ్డి ( సి.నా.రె ) గారి పరిచయ భాగ్యం ఏర్పడింది. ఆ పరిచయం సినారె గారి చరమాంక దశ వరకూ మిగిలి ఉంది.  ఆయన సభలకు మోహన్ గారే వ్యాఖ్యాతగా ఉండేవారు. మిత్రులతో కలసి "మానేరు రచయితల సంఘం" ఏర్పాటు చేశారు. సిరిసిల్లలో జరిగిన కవి సమ్మేళనాలలో మోహన్ గారు పాల్గొనేవారు. చేనేత జీవితానికి తన కవిత్వానికి అవినాభావ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తను రాసిన ప్రతి పది కవితలలో ఐదు చేనేత కార్మికులవే ! ఇతని కవిత్వం రాసేటప్పుడు తన చుట్టూ ఉన్న సమాజాన్ని   దాటిపోలేదు. ఆ కారణంగా తనను " అస్థిత్వ వాద కవి" అని అంటారు. ఈ చదువు అనంతరం  పత్తిపాక వారు ఉస్మానియా యూనివర్సిటీలో 
ఎం. ఏ చదివేటందుకు చేరారు. ఉస్మానియా యూనివర్సిటీ లో చదువుతున్న రెండేళ్లు సాహిత్య సమావేశాల్లో పాల్గొనే వారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనంతరం సిర్పూర్ లో తెలుగు ఉపాధ్యాయునిగా చేరారు.ఎన్. గోపి గారి లాంటి ప్రముఖుల ప్రోత్సాహంతో మోహన్ గారు గజల్ పై పీ హెచ్. డి  చేశారు. తరువాత కొంతకాలం "నాగారం " లో ఉపాధ్యాయ వృత్తిలో చేరారు.2007లో మానవ వనరుల మంత్రిత్వశాఖఅనుబంధ సంస్థ  " నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ఎన్.బి.టీ)లో అసిస్టెంట్ ఎడిటర్ గానూ, ప్రోగ్రామ్ ఆఫీసర్ గాను బాధ్యతలు చేపట్టి వృత్తి పట్ల అంకితభావం చూపి విజయం సాధించారు. బంతిపూలు , తెగిన పువ్వు, కవితలు రాశారు. మోహన్ గారు వ్రాసిన విమర్శనాత్మక వ్యాసాల సంకలనం  "కౌముది".     పచ్చబొట్టు,  కఫన్ లు నానీల సంపుటం తయారు చేశారు. ఇక బాల సాహిత్యం లోను మోహన్ గారిది అందవేసిన చేయి. పత్తిపాక మోహన్ గారు వృత్తి, ప్రవృత్తులలోనూ  భాగంగా బాలల కోసం ఎంతో  బాల సాహిత్యాన్ని సృష్టించారు. శాతవాహనుడి  దగ్గరనుండి ఆధునికుల వరకూ గల కవులను పరిచయం చేసి "  పిల్లల కోసం మన కవులు"  అనే సంకలనం తీసుకువచ్చారు. అతను వ్రాసిన "చందమామ రావే " అనే బాలగేయాల సంపుటి 2013లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యా లయం వారి బాలసాహిత్య పురస్కారం లభించింది. మోహన్ గారి బాలగేయాల పుస్తకం" వెన్నముద్దలు" 2016 లో వెలువడింది. 1997లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా తొలి యువజన సాహిత్య పురస్కారం అందుకున్న ఘనత పత్తిపాకమోహన్ గారికి దక్కింది. ఇది తన జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టంగా  మోహన్ గారు పేర్కొంటారు.  ( సశేషం )