ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలసాహిత్యం---46(2): - శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,-ఫోన్ : 7013660252.
November 11, 2020 • T. VEDANTA SURY • Memories

సత్యనారాయణగారు బాలసాహి  త్యంలో చేసిన రచనలు అనేకం చందమామ, బాలజ్యోతి, ఆంధ్రజ్యోతి, బాలబాట బాల భారతం బాలమిత్ర బాల రంజని ఆంధ్ర భూమి, ఆంధ్రప్రభ లాంటి చాలా పత్రికలలో  ప్రచురితమయ్యాయి. N.C.E.R.T వారిచే రూపొందించబడిన చిల్డ్రన్ అఛీవ్ మెంట్, ఎక్స్ పెరి మెంట్ రేడియో ప్రోగ్రాంకు సుమారు 20 రచనలు అందించారు. ఇది “ చిలకపలుకులు” అనే కార్యక్రమం ద్వారా 1992 - 93 కాలములో ప్రసారం చేయబడ్డాయి. ఈ సందర్భంలో ఈ కార్యక్రమంపై రెండు రేడియో ప్రోగ్రాములలో కూడా పాల్గొన్నారు. పిల్లలలో మానవతా విలువలు పెంపొందాలనీ, లెక్కలంటే భయం పోవాలనీ వృత్తితో పాటు ఈ రచనా వ్యాసాంగం చేపట్టి పలువురి ప్రశంసలు అందుకున్నారు.బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం ప్రాంతాల్లోనే కాక ఒంగోలు, నాయుడుపేట పుట్టపర్తి , హైదరాబాద్ మొదలగు కొన్నిచోట్ల ఉన్నత పాఠశాలల్లో గణితం పట్ల మాతృభాష పట్ల మక్కువను పిల్లలు కలిగించేందుకు సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులలో తన రచనలను మెరిట్ లో గల పిల్లలకు ఆయా పాఠశాలల గ్రంథాలయములకు ఉచితంగా అందించారు.
రిటైర్మెంట్ అనేది తన ఉద్యోగానికే గానీ మనసు కాదని అంటారు ఎన్ వి ఆర్ గారు. ప్రభుత్వం వారు అందించే పెన్షన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ విలువ గల సాహిత్య సేవ పిల్లలకు అందచేయ గలుగుతున్నాననీ, అది ఎంతో సంతృప్తినిస్తుం దనీ అంటారు. వీరియొక్క చందమామ కథ ఒకటి   “ కోడలి కోసం” అనే పేరుతో దూరదర్శన్ లో ప్రసారమైంది. బాలసాహిత్యంలో అనేక కథలు గేయాలు వ్రాసిన వీరు  “ కలియుగ దైవం, సాయిశతకం, దేవుడు నాయన పాటలు మొదలగు ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా రచించారు. వీరి ఆశయ సాధనలో కొంతమంది వీరి పూర్వ విద్యార్థుల సహకారం లభిస్తున్నదని సగర్వంగా చెబుతారు. వీరి పుస్తకం "మాట్లాడే అంకెలు'' ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకంలో 2000 సంవత్సరం లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఎంపిక చేయబడి ఉపయోగింపడింది. 2017 మార్చిలో పెదపెంకి కళాభారతి సంస్థ వారు, ఆ గ్రామ పురజనులు మూర్తి గారిని, నన్ను ఒకే వేదికపై  సన్మానిం చారు. లోగిస గ్రామానికి చెందిన బాలానంద సంఘంవారు ఉగాది పురస్కారం అందించారు. అనకాపల్లి, రామ బాణాల బాలానంద సంఘం వారు 1986 లోను, జట్టు ఆశ్రమం వారు 2007లో బాలసాహిత్య రక్షకునిగా ఎన్వీఆర్ గారిని  సన్మా నించారు. పిల్లల కోసం గణితాన్ని ఆంగ్ల నుండి తెలుగులోకి అనువాదం చేసారు. ఇక మరో విషయం మనం ఇక్కడ  చెప్పుకోవాలి. " చిలుకమ్మ పెండ్లి" శతజయంతి కానుక సందర్భంగా తెలుగు బాలసాహిత్య వేదిక ప్రచురణవారు 100 బాలగేయాలతో ఒక ప్రత్యేక సంచికను 2009లో ప్రచురించారు. ఆ సంచికలో ఎన్వీఆర్. సత్యనారాయణ, బెలగాం.భీమేశ్వరరావు, బెహరా. ఉమామహేశ్వరరావుగార్ల బాలగేయాలకు చోటు లభించడం ముదావహం.మనమంతా
గర్వించదగ్గ విషయం. ( సశేషం )