ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలసాహిత్యం---50(2)--శివ్వాం. ప్రభాకరం,బొబ్బిలి--ఫోన్ : 7013660252
November 17, 2020 • T. VEDANTA SURY • Memories

శ్రీమతి ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారు బాల సాహిత్యము లో విశేష కృషి జరిపి కన్న తల్లిదండ్రులైన మలపాక మహాలక్ష్మి , మలపాక నరసింహ రాఘవేంద్రరావు గారికి, అత్త వారు అయిన ఆకెళ్ళవారికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారు. ముఖ్యంగా ఈమె భర్త ఆకెళ్ళ వెంకట సుబ్బారావు గారు వెంకట సుబ్బలక్ష్మి గారి సాహిత్య కృషిలో చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఈ నాటి బాలలు రేపటి ఉత్తమ  పౌరులుగా తీర్చిదిద్దబడడానికి సుబ్బులక్ష్మి గారి కథలు ఎంతగానో ఉపయోగపడతాయి. తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్. నందిని సిధారెడ్డి మాటల్లో చెప్పాలంటే  " సాంకేతిక మాధ్యమాలు చిన్నపిల్లల ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న తరుణమిది....... ఈ దశలో బాలలను బాలలుగా కాపాడగలిగే శక్తి బాలసాహిత్యానికి ఉందని నా భావన. చిన్నపిల్లలది స్వచ్ఛమైన మనసు. ఎలా తీర్చిదిద్దితే అంత మంచిగా తయారవుతుంది. చురుకుదనం సున్నితత్వం, మంచితనం, మానవత్వం మొదలైనవన్నీ కథల ద్వారా పిల్లల మనసుల్లో నాటవచ్చు. అటువంటి మంచి ఉద్దేశంతో బాలల కథలు రాస్తున్న రచయిత్రి వెంకట సుబ్బలక్ష్మి ." అంటారు నందిని సిధారెడ్డి "బృందావనం" బాల కథా సంపుటి ముందుమాటలో. పిల్లల మనసుకు హత్తుకునే లా కథలను చెప్పడమే ఆమె ప్రత్యేకత. ఆ కథల్లో ఏదో నీతి ఇమిడి ఉంటుంది. అమ్మ మాట వేదం, మానవత్వమే గెలుపు, ఇది నా దేశం, అతితెలివి అనర్ధదాయకం, మంచి గురువు, పరిష్కారం లాంటి కథలు బృందావనం పుస్తకానికి హైలైట్ ! ఇక  మరో  పుస్తకం " అమ్మ మాట తేనె మూటకు" వద్దాం. ఈ పుస్తకంలో  30 కథలు ఉన్నాయి. "అమ్మమాట- తేనె మూట'' కథలో సింహం, నక్క, మేకపిల్ల, నెమలి, చిలుకలతో కథంతా నడిపి పిల్లలు సజ్జన సాంగత్యం చెయ్యాలి అనే నీతిని ఈ కథలో  చెబుతారు. విలువైనవి (పుస్తకాల బహుమతి),ఒక్క మంచి లక్షణం‌ (నిజాయితీగా ఉండటం), శత్రువు(వృద్ధాప్యం)వాటా,తానున్నా...లేకున్నా...
(చేతనైన సాయం చేయడం) ఇలా ప్రతి కథలో ఏదో నీతి ఉంటుంది. సుబ్బలక్ష్మి గారు వ్రాసిన మరో పుస్తకం " బాల కుటీరం". ఇందులో 26 కథలుంటాయి. యద్భావం తద్భవతి, ఉమాపతి ఔదార్యం, రంగనాథం తెలివి, చెడులో మంచి,  మరుజన్మ , ఎంపిక   లాంటి చిన్న చిన్న కథలు ఇందులో ఎన్నో ఉన్నాయి. ప్రతి కథ బాలలకు నీతిని అందించేవే ! సుబ్బలక్ష్మి గారి సాహిత్య కృషికి నిదర్శనంగా" భారత్ భాషా భూషణ్" ,సాహిత్య శ్రీ సావిత్రి బాయి పూలే, స్త్రీ శక్తి అవార్డు, సాహిత్య శ్రీ అవార్డు, డాక్టర్. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ కళాపీఠం అవార్డు, లేఖిని బాల సాహిత్య పురస్కారం, బాల సాహిత్య శిరోమణి బిరుదు ప్రధానం, బాల సాహితీ రత్న బిరుదు ప్రధానం, సాహిత్యశ్రీ  --- ఇలా 23 బిరుదులు, మెమెంటోలు  అందుకుని  ఆయా      సంస్థలచే సన్మానింపబడ్డారు. అంతేకాక సుబ్బలక్ష్మిగారు అనేక సాహితీ సంస్థలలో సభ్యురాలు కూడాను. వీరు స్వయంగా ఆకెళ్ళ అసోసియేషన్, బాలగోకులం అనే రెండు సంస్థలు స్థాపించి పెద్దలకు, పిల్లలకు అనేక సాహితీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుబ్బలక్ష్మి గారు కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు కార్యశాలల్లో పాల్గొని పిల్లలకు కథా రచన గురించి బోధించి వారిచే రాయించారు. వీరు ఇటు సాహిత్య రంగంలోనే కాక సామాజిక  సేవలో కూడా ముందంజలో ఉన్నారు. పేద పిల్లలకు, పెద్దవారికి ధన వస్తు రూపేణా వివాహాలకు, గృహ నిర్మాణాలకు సహాయపడ్డారు. అనారోగ్యంతో ఉన్న వారికి కూడా ఆర్థిక సాయం  చెయ్యడం వీరి కార్యక్రమాలలో  భాగమైపోయింది. వెంకట సుబ్బలక్ష్మి గారు భవిష్యత్తులో కూడా సాహితీ పరంగాను, సామాజిక పరంగాను అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశిద్దాం.  ( సశేషం)