ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలసాహిత్యం---50 (1)--శివ్వాం. ప్రభాకరం,బొబ్బిలి---ఫోన్ : 7013660252
November 16, 2020 • T. VEDANTA SURY • Memories

ప్రముఖ బాలల సాహిత్య రచయిత్రి,  అందరిచే
" అక్కయ్య "అని ఆప్యాయంగా పిలవబడుతున్న ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మిగారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 23 మార్చి 1952 న జన్మించారు. వీరి తల్లిదండ్రులు  వులపాక మహాలక్ష్మి,  వులపాక వెంకట నరసింహ రాఘవేంద్రరావులు. తండ్రి  వులపాక వెంకట నరసింహ రాఘవేంద్రరావుగారు ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ లో పని చేసేవారు. వీరి తండ్రి గారు వేరు వేరు ప్రదేశాలలో ఉద్యోగం చేసేవారు. ఆ కారణంగా  సుబ్బలక్ష్మి గారి చదువు వేరు వేరు ప్రదేశాలలో సాగింది. సుబ్బలక్ష్మి గారు తన  ఎనిమిదవ యేట డైరెక్ట్ గా రెండవ తరగతిలో స్కూలులో  చేరి 2 నుంచి 4 వరకూ నరసాపురంలోనూ, 5, 6, 7 తరగతులు విజయవాడలోనూ  8 ,9 తరగతులు ఏలూరు లోనూ, 10, 11, 12 హైదరాబాదులో నున్న మల్టీ పర్పస్ సెకండరీ స్కూల్ లోనూ విద్యాభ్యాసం జరిగింది. బి.ఏ డిగ్రీ విశాఖపట్నం లోనూ, బి.ఇడి హైదరాబాదులోనూ  చేశారు.  వీరు బి. ఏ; బి ఇడి డిగ్రీలు పాసై ఉపాధ్యాయ వృత్తికి అర్హతలు సంపాదించినా‌ ఉపాధ్యాయ వృత్తి చేయక , హైదరాబాదులోని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఇ.పి.ఎఫ్) ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం సంపాదించారు. అదే ఆఫీసులో సెక్షన్ సూపర్వైజర్ గా పనిచేసి2012లో అకౌంట్స్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు.వీరు చేస్తున్న వృత్తి ఇ.పి.ఎఫ్ డిపార్ట్మెంట్లో. సుబ్బలక్ష్మి గారు ఆకెళ్ళ వెంకట సుబ్బారావు గారిని వివాహం చేసుకున్నారు.  వీరు బాల్యము నుండి చందమామ ఇతర బాలల సాహిత్యానికి సంబంధించిన పత్రికలు, పుస్తకములు నిరంతరం చదువుతుండటం వలన  వీరికి బాలసాహిత్యం వైపు మనసు మళ్లింది. సుబ్బలక్ష్మి  గారు చందమామ, బాలమిత్ర, బుజ్జాయి, విశ్వరచన, బాల తేజం, నాని, బాలబాట, ఆంధ్రప్రభ , ఆంధ్రభూమి, విపుల మొదలగు పాత, కొత్త పత్రికలలో వీరి రచనలు ప్రచురింప బడ్డాయి. సుబ్బలక్ష్మి గారికి కథ, కవిత, నాటకము మొదలగు ప్రక్రియలలో అభిరుచి ఉండి అనేక రచనలు చేసినప్పటికీ బాల సాహిత్యము పైనే మక్కువ, మోజు పెంచుకున్నారు. బాలలపై ఉన్న ప్రేమాభిమానాలతో అనేక వందల రచనలు చేశారు. బాల సాహిత్య రచయితలు అతి కొద్దిమంది ఉన్న ఈ రోజుల్లో సుబ్బలక్ష్మి గారు బాలసాహిత్య రచనలతో ముందుకు పోవడం బాలసాహిత్యానికి ప్రాణం పోసినట్ట యింది. సుబ్బలక్ష్మిగారి తొలి బాలకథా సంకలనం " బాల 
మందారం". ఈ పుస్తకం బాలల పుస్తకముగా మంచి పేరు 
ప్రఖ్యాతులు గడించింది. వీరు అనేక కవి సమ్మేళనాలలో కూడా పాల్గొన్నారు. వీరిచే వ్రాయబడిన రచనలు తాను పనిచేస్తున్న   కార్యాలయంలో గూడా గుర్తింపబడి
అప్రిషియేషన్, అభినందనల ఉత్తరాల పరంపరలను అందుకున్నారు. ఎన్నో బహుమతులు వచ్చాయి. బాలల,  స్త్రీల, కార్మికుల సమస్యల గురించి అనేక రచనలు చేసి  ఆయా కార్యక్రమాలలో పాల్గొన్నారు. E.Tv, T.V9, R T V, తెలుగు వెలుగు పరిచయ కార్యక్రమాల్లో  పాల్గొన్నారు. సుబ్బలక్ష్మి గారి సాహిత్య కృషి గురించి చెప్పుకోవాలంటే బాల సాహిత్యంలో 1.బృందావనం, 2.బాలమందారం
3.బాల కుటీరం 4. బాలానందం 5. అమ్మ మాట- తేనె మూట 6. చైల్డ్ రోజెస్- ఆంగ్ల బాల కథా సంపుటి 7. లోభి  8. మన ఇష్టం 9. నిజమైన ధనం 10. రష్యన్ జానపద కథల బాల కథా సంకలనం. లోభి, మన ఇష్టం, నిజమైన ధనం, రష్యన్ జానపద కథలు బాల కథా సంకలనాన్ని ( సచిత్ర బాల కథా పుస్తకములు ) అప్పటి గవర్నర్ శ్రీ సుశీల్ కుమార్ షిండే గారిచే ఆవిష్కరింపబడింది. సుబ్బలక్ష్మి గారు 1. కథా మందారం 2. అమ్మా! నువు మారావు 3. అక్షింతలు - కథా సంపుటిలు వ్రాశారు. అంతేకాదు"కవితా మందారము"  అనే కవితా సంపుటిని, మూఢనమ్మకాలు, తల్లిదండ్రుల బాధ్యతలు (సచిత్ర వయోజన విద్య ) పుస్తకాలు  ప్రచురించారు. బాల మందిరం, బాల కుటీరం సంపుటాలకు విశ్వ సాహితీ వారి ఉత్తమ బాలల కథా సంపుటి అవార్డులు లభించాయి. వీరి కలం నుండి వెలువడిన కథలు బాలలకు నీతిని బోధిస్తాయి. బాలల భవితకు ఉత్తమ మార్గాన్ని సూచిస్తాయి .సుబ్బలక్ష్మి గారు క్షణం తీరికలేని ఈ పి ఎఫ్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తూ బాల సాహిత్యంలోను, ప్రౌఢ సాహిత్యములోను ఇన్ని రచనలు చేశారంటే గొప్ప తనంగా భావించాలి. ఈ కృషి వెనుక వారి భర్త ఆకెళ్ళ వెంకట సుబ్బారావుగారి ప్రోత్సాహం ఎంతగానో ఉందని చెప్పకనే తెలుస్తుంది. సుబ్బులక్ష్మి గారి కథలు తెలుగు బాలలకే కాదు. ఇతర భాషలైన కన్నడం, మలయాళం, ఇంగ్లీషు భాషలలోకి అనువదించబడ్డాయి. వీరు రాసిన
 "అక్షింతలు " అనే కథా సంపుటి " చిగురు" అనే పేరుతో కన్నడంలో అనువదించబడింది.  మహారాష్ట్ర ప్రభుత్వం వారు అక్కడి తెలుగు పాఠ్యపుస్తకాల్లో సుబ్బలక్ష్మిగారు వ్రాసిన కథ" విలువైనది " 7 వ తరగతి పాఠ్యాంశంగానూ,
"అసలు లోపం" అనే కథను తొమ్మిదవ తరగతి పాఠ్యాంశం గానూ నిర్ణయించబడింది. ఇవన్నీ సుబ్బలక్ష్మిగారి రచనా 
పటిమను తెలియజేస్తున్నాయి. ( సశేషం)