ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలసాహిత్యం -32-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, విజయనగరం జిల్లా ఫోన్: 7013660252.
October 11, 2020 • T. VEDANTA SURY • Memories

కవిరావుగారు బాల సాహిత్య రచనలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందారు. ఇతని అసలు పేరు ఇంకొల్లు వెంకటేశ్వరరావు. కవి రావు గారు 1927 ఆగస్టు 17న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలో గల" మత్తివారిపాలెం" గ్రామములో జన్మించారు. వీరి జీవితమంతా ఒక్క బాలసాహిత్యానికే అంకితమయ్యారు. బాలసాహిత్యం తప్ప మరో వ్యాసాంగం తెలియదు.కవిరావు గారు యతి ప్రాసలు చూసుకొని బాల గేయాలు, పద్య కవితలను, గేయకథలను వ్రాసేవారు. నార్ల చిరంజీవి గారితో పరిచయం ఇతర బాల సాహిత్య వేత్తలతో పరిచయానికి దారితీసింది. ఏడిద కామేశ్వరరావు, వేజండ్ల సాంబశివరావు, బి.వి.నరసింహా రావు, ముద్దులూరి రామకృష్ణ,  అలపర్తి వెంకట సుబ్బారావు మొదలగు బాల సాహిత్యవేత్తల పరిచయం ఏర్పడింది. వీరితో బాల సాహిత్యం గురించి అనేక సందర్భాలలో చర్చించేవారు.1952లో బి వి నరసింహారావు గారి అధ్యక్షతన తెలుగు బాలల రచయితల సంఘం ఏర్పడింది. దీనికి ముద్దులూరి రామకృష్ణ కార్యదర్శిగాను, ఏడిద కామేశ్వరరావు, అలపర్తి వెంకట సుబ్బారావు, లవణం, కవిరావు, నార్ల చిరంజీవి గార్లు ఈ సంఘంలో సభ్యులుగా ఉండేవారు. కవిరావు అనేకమైన రచనలను చేశారు. అందులో బొమ్మరిల్లు, నెలవంక, గుజ్జగూళ్ళు, ఆటో బొమ్మలు, చిరుమువ్వలు, బొమ్మల కొలువు, ముద్దు పాప
( ఆటవెలది పద్యాలతో శతకం) వ్రాశారు. ఇవన్నీ ఇతని బాల సాహిత్యానికి సంబంధించిన రచనలే ! కవిరావు గారు తన 24 యేండ్ల వయసులో వ్రాసిన" బొమ్మరిల్లు” 1951లో విడుదలయింది. ఈ గ్రంథము పిన్నలను పెద్దలను మిక్కిలిగా ఆకట్టుకుంది. అనేకమంది ప్రశంసలు పొందింది.1954లో "బొమ్మరిల్లు" పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ వారు పురస్కారాన్నిచ్చి కవిరావును సత్కరించారు. తెలుగు బాల సాహితీ రచయితలలో మొట్టమొదటిసారిగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందినవారు కవిరావు గారే ! 1954లో కవిరావుగారు "బొమ్మరిల్లు" పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పొందిన మొదటి వ్యక్తి అయినప్పటికీ అతనిలో అహంకారము ఇసుమంతైనా ఉండేదికాదు. అందరితో కలసిమెలసి తిరిగేవారు. తను రాసినదే వేదవాక్కు అనుకోకుండా ఎదుటివారి నుంచి మంచి మంచి సలహాలను స్వీకరించేవారు.1956లో అంటే కేంద్ర సాహిత్య అకాడమీ పొందిన 2 సంవత్సరముల తరువాత గిడుగు వెంకట సీతాపతి గారు రాజమండ్రిలో నిర్వహించిన ఆరు వారాల బాలసాహితీ శిక్షణ శిబిరంలో పాల్గొని బాల సాహిత్య రచనలకు సంబంధించి  అనేక  మెళకువలను నేర్చుకొని భవిష్యత్తు కాలంలోతను చేయబోయే రచనలకు ఆ మెలకువలను ఉపయోగించుకున్నారు. కానీ తన సమకాలీన రచయితలకు ఏమొచ్చులే ? " వారు నాకు శిక్షణ ఇచ్చేది ఏమిటిలే?" అనే గర్వం తనలో ఉండేది కాదు. ఎదిగిన కొద్దీ ఒదగమనే నానుడి తనకు అన్వయిస్తుందని మనం భావించాలి."ముద్దుపాప"అనే నీతి శతకంలో ఆటవెలది పద్యాలతో రచనలను సాగించారు. ఈ పద్యాలు బాలలకు  నీతిని, సత్ప్రవర్తనను, సమానత్వాన్ని సౌభ్రాతృత్వాన్ని, మానవతా విలువలను నేర్పుతాయి. "ఇంటిలోన నీదు ఇష్టంబె చట్టంబు/సాగదచట పాఠశాల గాన/ సానుభూతి, సర్వ సమత నేరుగా మొట్ట/ మొదటి మెట్టు నీకు ముద్దు పాప" // ఈ పద్యంలో బాలలు తమ ఇళ్లల్లో ఎలా ప్రవర్తించాలి? పాఠశాలలో ఎలా ప్రవర్తించాలో తెలియజెప్పారు కవిరావుగారు. ఇక రోడ్డు రూల్స్ గురించి కవిరావు గారు ఈ క్రింది పద్యంలో ఇలా వివరిస్తారు."ఎడమ పక్క చూచి-- నడువంగ వలె రోడ్డు/ కుడిని నడువ పోవ-- కూడ దెపుడు/బాట తప్పినడువ--మోటారులెదురగు
మోసమగును నీకు ముద్దు పాప!"// రోడ్డుమీద నడిచే టప్పుడు బాలలు ఏ విధంగా నడవాలో ఈ పద్యంలో తెలియజేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినప్పటికీ కవిరావుగారు తన కృషిని అంతటితో ఆపివేయ లేదు. “ బాలల విజ్ఞాన సర్వస్వం” రూపొందిం చాలన్నది వీరి దృఢమైన కాంక్ష. తన ఆశయాన్ని నెరవేర్చు కోవాలన్న ఉద్దేశ్యముతో వెలగా వెంకటప్పయ్య గారిని కలిసి ఆలోచన చేశారు. చివరకు 1961లో  " బాల సాహిత్య పరిషత్తు" పేరుతో ఒక సంస్థను స్థాపించారు. దానికి వెలగా వెంకటప్పయ్య గారు అధ్యక్షులుగాను, కవిరావుగారు కార్యదర్శిగాను ఉండేవారు. ఈ సంస్థ ద్వారా కవిరావు గారి జీవిత ఆశయమైన" బాలల విజ్ఞాన సర్వస్వం" చేయడానికి పూనుకున్నారు. అందుకుగాను చాలా పుస్తకాలను సేకరించి పెద్ద గ్రంథాలయం ఏర్పాటు చేశారు. అయినా కొన్ని అవాంతరాలు మూలంగా ఈ కార్యక్రమం ఆగిపోయింది. అయినా బాల సాహిత్యములో తన కృషిని అంతటితో ఆపలేదు."బాల సాహితీ కవిరాజు"గా భాసిల్లారని అన్నారు ప్రఖ్యాత కవి బోయి భీమన్న గారు. 1964లో అఖిలభారత బాలల రచయితల సంఘం, లక్నో సమావేశంలో బాల సాహిత్యంలో విశేష కృషి చేసినందుకుగాను ఉత్తమ బాలల రచయితగా బహుమతిని అందుకున్నారు.1966లో యునెస్కో వారి సహకారముతో దక్షిణ భారత పుస్తక సంస్థ వారు మద్రాసులో నిర్వహించిన శిక్షణా శిబిరంలో మన రాష్ట్రం తరఫున పాల్గొన్న తెలుగు బృందానికి కవిరావు గారు నాయకత్వం వహించారు. 1975లో ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ వారు ఆంధ్ర ప్రదేశ్ బాలల మహాసభలను నిర్వహించారు. ఆ సందర్భంగా బాలసాహితీ రంగానికి విశేష సేవలందించినందుకుగాను కవిరావుగారికి బాలబంధు పురస్కారంతో సత్కరించారు. ఊయల కమ్యూనికేషన్స్ సంస్థ “బాల సాహితీ విభూషణ ”   పురస్కారంతో  సత్కరించింది. 1979లో ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ కోరిక మేరకు  ''వెలుగు బాటలు" అనే పేరుతో ప్రముఖుల జీవిత చరిత్రను  కవిరావుగారు ఒక సంకలనాన్ని తెచ్చిపెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ బాలల అకాడమీ వారు 365 కథలను  కవి రావు గారి ఆధ్వర్యంలో " నెలవంక " పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించదలచారు. ఆ కథలను సేకరిస్తున్న సందర్భంలోనే కవిరావు గారు అనారోగ్యంతో బాధపడుతూ2006 అక్టోబర్ 12న పరలోక ప్రాప్తి పొందారు.  (సశేషం)