ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలసాహిత్యం -34(1)- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, --ఫోన్ : 701 3660 252.
October 14, 2020 • T. VEDANTA SURY • Memories

పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారు ప్రముఖ బాల సాహిత్యవేత్త. ఇతను 1909లో ఆనాటి మద్రాసు రాష్ట్రం లో గల తూర్పు గోదావరి జిల్లా '' రావికంపాడు''  గ్రామంలో జన్మించారు అని కొందరు చెబుతుంటే  చొక్కాపు వెంకటరమణ గారి " బాల సాహితీ వైతాళికులు" లో  గోదావరి మండలం కోనసీమలోని అమలాపురంలో 1910 మార్చి 8వ తేదీన జన్మించారని చెప్పబడుతుంది. పాలంకి వారికి నాలుగు సంవత్సరముల వయసు లోనే బాల్యంలోనే తల్లి మరణించడం చేత తండ్రి, పోషణలోనే అతి గారాబంగా పెరిగారని మనకు తెలియుచున్నది. పాలంకి వారి తండ్రి సంస్కృతం  లోనూ, తెలుగులోనూ పండితులు.   అనేకమైన కథలు పాలంకి వారి తండ్రి,  అమ్మమ్మ , బామ్మలు కూడా ఇతనికి కథలు చెప్పేవారు. ఆ కథలలో ఎక్కువగా రామాయణ,భారత, భాగవత కథలు, పంచతంత్ర కథలు, ఉపాఖ్యానాలతో  కూడుకున్న కథలు అధికంగా ఉండేవి. తనకి 8 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే 4 సంవత్స రాలు వయస్సు ఉన్న సూర్యప్రకాశమ్మతో వివాహం జరిగింది. పాలంకి వెంకట శ్రీరామచంద్రమూర్తి బాల్యంలో పాఠశాల చదువు కాకినాడ లోను, మద్రాసు, (ఈనాటి  చెన్నై) లోనూ  జరిగింది. వీరు  మద్రాసు లో గల ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ  పొందిన తరువాత మద్రాస్ లో గల మద్రాసు సెంట్రల్ కోపరేటివ్ ల్యాండ్ మార్ట్ గేజ్ బ్యాంక్ లో ఉద్యోగం లో  చేరారు. ఇతను ఉద్యోగంలో చేరిన కొత్తలో వారి అక్క గారింట్లో కొంతకాలం ఉండవలసి వచ్చింది. వీరి బావగారు  ఆంగ్ల సాహిత్యంలో మంచి దిట్ట. ఇంగ్లీష్, లిటరేచర్ లో 
ఎం ఏ ప్రథమశ్రేణిలో పట్టం పుచ్చుకున్నారు.ఆంగ్ల సాహిత్య నవలలలో  గొప్పదనాన్ని సమీక్ష చేస్తూ తెలియజెప్పేవారు. ఆ సమీక్షలు పాలంకి వెంకట రామమూర్తి గారికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. వారి బావగారింట్లో మార్క్ ట్వెయిన్, స్టీవెన్సన్, ఆస్కార్ వైల్డ్, డికెన్స్ జార్జ్ ఎలియట్, ఫీల్డింగ్ లాంటి ప్రముఖ రచయితల పుస్తకములు ఉండేవి.
పాలంకి వారు తరువాత కాలములో మంచి రచయిత కాగలిగారంటే బాల్యము నుండి తండ్రి అమ్మమ్మ బామ్మలు బావగారు , తను చదువు  కున్న విశ్వవిద్యాలయాలలో గల ఆచార్యులు అందజేసిన సాహిత్య రుచులు మాత్రమే. పాలంకి వారు మొదటిలో పెద్దలు సాహిత్యం రాసేవారు.
 తన ఇరవై మూడు సంవత్సరాల వయస్సులో 
"  ఎవరి ప్రసవవేదనకో " అన్న మొదటి కథను వ్రాయగా 1932లో " వినోదిని" అన్న పత్రికలో ప్రచురితమయ్యింది. అలానే భారతి అనే మాసపత్రిక లో కొన్ని కథలు ప్రచురితమ య్యాయి. పాలంకి వారు రాసిన కథలను మొక్కపాటి నరసింహశాస్త్రి గారు చదివి  '' నీ కథలు బాగానే ఉంటున్నాయి. కానీ నవలికల లాగ చాలా పెద్దవిగా ఉంటున్నాయి. చిన్న కథ అన్నది చిన్నది గానే ఉండాలి'' అని సలహా ఇచ్చారు. పాలంకి వారు రాసిన కథలకు మొక్కపాటి వారు ఎటువంటి సలహాలు ఇచ్చారో నేను కూడా మన రచయితలలో ఒకరికి అదే సలహా ఇచ్చాను. కొన్ని సంవత్సరాల క్రితం ఒక రచయిత రాసిన కథల పుస్తకం ఒకటి నాకు ఇచ్చారు. ఆ పుస్తకం పొడవు వెడల్పులు కూడా చాలా పెద్దవి. అందులో చాలా కథలు మూడు పేజీలు లేక మూడు పేజీలు దాటి ఉన్నాయి. ఆ పుస్తకం బాల సాహిత్యా నికి   సంబంధించిన పుస్తకం. బాల సాహిత్యానికి సంబంధిం చిన కథల పుస్తకాలలో కథలు వీలైనంత చిన్నవిగాఉండాలి.  అంటే ఆరపేజీ నుండి పేజిన్నర  వరకు ఉండాలి. బాలలు వాటిని చూసేసరికి మానసికంగా ఆ కథను చదవడానికి సంసిద్ధులు అవుతారు. పిల్లలు చదువడానికి ఇష్టపడతారు. శ్రద్ధ కూడా చూపుతారు. రచయిత కథ ఎంత బాగా రాసినప్పటికీ, భాష ఎంత సరళంగా ఉన్నప్పటికీ,  బాలలు ఆ కథను చూసేసరికి  అమ్మో ఇంత కథా అని అనుకో  కూడదు. అలా సలహా ఇచ్చినందుకు ఆ రచయిత నాతో రాను రాను దూరం అయ్యారు. అయితే అందుకు నేను బాధ పడలేదు. మొదటి నుండి నాకున్న లక్షణం ఏమిటంటే నా మనసులో ఏముందో అది బయటికి చెప్పడమే నా విధి.అవతలివారు ఏమనుకుంటారోనన్న ఆలోచన చెయ్యను. మనం ఇచ్చిన సలహా సరి అయినదా కాదా అన్నది అవతలి వారు నిర్ణయించుకోవాలి.( సశేషం )