ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలసాహిత్యం--48--శివ్వాం. ప్రభాకరం,బొబ్బిలి--ఫోన్ : 7013660252
November 14, 2020 • T. VEDANTA SURY • Memories

ప్రముఖ బాల సాహితీ వేత్త కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అయిన వాసాల నరసయ్యగారు కరీంనగర్ జిల్లా మెట్ పల్లి మండలం "చౌలమద్ది" గ్రామంలో జన్మించారు.వీరు మొదట 1961-62లో ఒక  సంవత్సరం వరకూ  ఉపాధ్యాయ వృత్తిని చేేేసేవారు. 1962 సెప్టెంబర్ లో కరీంనగర్లో పోస్టల్ క్లార్క్ గా  చేరి సుమారు 42 ఏళ్లు వివిధ హోదాల్లో తపాల శాఖలో పని చేశారు. వాసాల వారు సుమారు 25 ఏళ్లు అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించి  ఆ సంఘాన్ని బలోపేతం చేయడానికి దోహదకారి అయ్యారు. నర్సయ్య గారి తండ్రి, అన్నయ్య గార్లు వీధి నాటకాలు ఆడుతుండడం వల్ల ఆ ప్రభావం సాహిత్యరంగం పై కూడా పడింది.  దాని మూలంగా నరసయ్య గారు సాహిత్య రంగం పై ఆసక్తి పెంచుకున్నారు. అనేక మైన గేయాలు,  కథలు, గేయ కథలు బాల సాహిత్యంలో రాశారు. వీరు రాసిన కవితలు, కదంబ కార్యక్రమాలు ఆకాశవాణిలో ప్రసారం అయ్యాయి. హిందీ సెంట్రల్ హిందీ డైరెక్టరేట్ న్యూ ఢిల్లీ వారి పిలుపుమేరకు 1989 నుండి 1994 వరకు వివిధ శిబిరాల్లో  నరసయ్య గారు పాల్గొన్నారు. 13 పుస్తకాలు వెలువరించారు.15 పుస్తకాల సమీక్షలు చేేసారు. 300కు పైగా బాలల కథలు 200కు పైగా టిట్బిట్స్, రెండు వేలకు పైగా జోకులు ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, చందమామ, బాలమిత్ర, బాలబాట, బుజ్జాయి పత్రికల్లోముద్రించబడ్డాయి. నరసయ్య గారు పోస్టల్ డిపార్ట్మెంట్ లో తను పని చేసిన అనుభవంతో తపాలా శాఖ చరిత్రనంతా ఒక పుస్తకంగా రాశారు. అది చదువుతుంటే తపాలా శాఖలో ఆ శాఖ  ఏర్పడినప్పటి నుంచి ఈరోజు వరకూ వచ్చిన మార్పులను పాఠకులకు అందించారు. ఆ పుస్తకం చదివిన తరువాత తపాలా శాఖకు ఇంత చరిత్ర ఉందా అని మనకు అనిపి  స్తుంది.  ఈయన రచించిన  " చిట్టిపొట్టి కథలు"  సంపుటిని తెలుగు విశ్వవిద్యాలయం వారు ఉత్తమ బాల సాహిత్య గ్రంథంగా ఎంపిక చేసి సన్మానించారు. వాసాల నరసయ్య గారిని " తెలుగు వెలుగు" సంస్థ వారు సన్మానించారు.
" అంజయ్య - అరటి తొక్క" అనే నీతి కథల సంపుటిని నరసయ్యగారు రాశారు. ఇందులో47 కథలు ఉంటాయి.  చాలా వరకూ చిన్న కథలే !  హాస్య పూరితంగా ఉండేవి. బాలలను అలరించటానికి, మేథో వికాసానికి కథలు, గేయాలు, పొడుపు కథలు ఎంతగానో దోహదం చేస్తాయి. అయితే అలా అర్థమయ్యే రీతిలో రచనలు చేయడం అంత సులభమేమీ కాదు. అలా రచనలు చేయగలిగే అరుదైన బాల సాహితీవేత్త వాసాల నర్సయ్య . ఇతనితో నేను ఏనాడు ముఖాముఖి  కలిసింది లేదు. మా ఇరువురినీ పత్రికలే కలిపాయి. పత్రికలలో  నా కథలు ప్రచురితం అయ్యేటప్పుడు, అవి బాగున్నప్పుడు ఫోన్ ద్వారా తన సంతోషాన్ని  వ్యక్తపరచేవారు. అలానే నేను కూడా నర్సయ్య గారి కథలు పత్రికలలో ప్రచురితం అయ్యేటప్పుడు నా భావాలను వ్యక్తపరచేవాడను. ఇలా మా రచనలే మమ్మల్ని ఒకరి మీద ఒకరికి  అభిమానులుగా మార్చాయి. స్నేహపూరి త మైన సన్నిహితత్వాన్ని పెంపొందింపజేసాయి. నరసయ్య గారు  అత్యంత విలువైన అవార్డులను పొందడమే కాదు తను కూడా బాల సాహితీవేత్తలను ప్రోత్సహించే విధంగా " వాసాల నరసయ్యగారి అవార్డు" ను ఏర్పాటు చేసారు. 
అందులో చాలామంది  బాల సాహితీవేత్తలకు వాసాలవారు అవార్డులను అందజేశారు. ఆ అవార్డును అందుకున్న వారిలో నేనూ ఒకడినై ఉన్నానని గర్వంగా చెప్పుకుంటున్నా ను. ఈ సందర్భంగా మరోసారి వాసాల నరసయ్యగారికి నా కృతజ్ఞతా భావాన్ని తెలియజేసుకుంటున్నాను. కరీంనగర్ లో ఉండ్రాల రాజేశంగారికి, వి. పరశురామ్ గారికి, నాకు 
ఘనంగా సన్మానం చేసారు. ఆరోజున ఆ సన్మాన సభకు గౌరవనీయులు వేదాంత సూరిగారు, పత్తిపాక మోహన్ గారు, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత  భూపాల్ గారు హాజరై సన్మాన సభలో ప్రసంగించారు. ఆ సంఘటన ఎన్నటికీ మరువలేనిది. ( సశేషం)