ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలూకి నివాళి--- యామిజాల జగదీశ్
September 26, 2020 • T. VEDANTA SURY • Poem

మానవజాతిని 
ఐదు దశాబ్దాలుపైగా
నీ గానమాధుర్యంతో
ఓలలాడించిన బాలూ...

మట్టి నిద్దరపోవడానికి పాడావు
పువ్వు నిద్దరపోవడానికి పాడావు
కన్ను నిద్దరపోవడానికి పాడావు
కడలి నిద్దరపోవడానికి పాడావు
కానీ
నీ దీర్ఘ నిద్రకు
జోలపాట పాడిందెవరు?
ఏ మనిషీ పాడలేడని 
మృత్యువే పాడిందా....??

స్వర్ణవేదిక చూశావు
పూలవేదిక చూశావు
ఈ ప్రపంచాన్ని 
లెక్కలేనన్నిసార్లు పర్యటించి
కళావేదికను చూశావు
కవులందరి మాటలకు
నీ గళంతో ఊపిర్లు పోశావు

నువ్వు భౌతికంగా ఇక లేవన్న 
దుర్వార్త వినడంతోనే
సంగీత ప్రపంచ హృదయం
పిడుగు పడ్డట్లుగా
తుత్తునియలైపోయింది బాలూ...

ఈరోజు సాయంసంధ్య 
అస్తమించి పర్వతాలలో 
వాలిపోయింది

సంగీత జాజి మొల్ల 
వాడిపోయింది

పరువప్రాయ జాబిల్లి
లోయలో రాలిపోతోంది

మంచులో తడిసే పూదోట
ఎడారయ్యింది

ప్రేమ గులాబీ
కృశించిపోయింది

చందమామ నీరుకారి
శోక కడలిలో
వాలిపోయింది

వానచినుకులను 
మరవని చాతకపక్షిలా
నిన్ను స్మరిస్తుందీ సంగీత ప్రపంచం

గులాబీలను ప్రేమించే
బుల్ బుల్ పిట్టలా
నీ ఖ్యాతిని కీర్తిస్తుందీ సంగీత ప్రపంచం

మొహ్మద్ రఫీ
కిశోర్ కుమార్
ముఖేష్
మన్నాడే
ఘంటసాల వరుసలో
కాలం ప్రసాదించిన 
మహాగాయకుడివి నువ్వు

నీ దేహానికి 
స్నానం చేయించడానికి
గంగక్కర్లేదు
కావేరక్కర్లేదు
కృష్ణక్కర్లేదు
గోదావరక్కర్లేదు
విశ్వవ్యాప్తంగా ఉన్న 
నీ అభిమానుల కళ్ళు కార్చే
కోటి చుక్కలతో స్నానం చేయిస్తారు నిన్ను
ఇదిగో నావీనూ ఓ రెండు.....!!