ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల్యం చాటు కూనల్లా చిన్నప్పటి జీవితం ఎంత బాగుంటుందో...!ఎవరేమన్నా వెనకేసుకొచ్చే అమ్మ...!కంట తడిని చూడలేక అప్పటికప్పుడు తినుబండారాల వరాలు కురిపించే నాన్న!తుమ్మినా దగ్గినా, నిద్దరోచ్చి బజ్జున్నా ఖంగారుగా దిష్టి తీసే నానమ్మ ! పనంటే తెలియని పసితనం.. కూర్చున్న చోటే నోటికందించే అమ్మ నాన్నల ప్రేమ!గారాలు పోతూ బుంగ మూతి పెడితే మురిసిపోయే తాతయ్య... స్కూల్ లో చిన్న బహుమతి వచ్చినా తన చేతి వేళ్ళతో తలకద్దుకుని మొటికలు విరుస్తూ... చుట్టు పక్కల అమ్మలక్కలకు తన బిడ్డ గురించి గొప్పగా చెప్పుకునే అమ్మ మురిపం..ఆషాడం లో గోరింటాకు నూరి, చేతి నిండా రుద్ది, నిద్రలో ఎక్కడ ముఖమంతా రుద్దేసికున్టామో అని, గుడ్డ కట్టి తన ప్రేమను ఎర్రగా పండించే అమ్మ స్వచ్చమైన లాలన!!తొలి ఏకాదశి తో పండగలూ పబ్బాలూ మొదలని అప్పచ్చులు చేస్తున్నప్పుడు వచ్చే వేగిన నూనె వాసన!హ్మ్! ఎన్నని నేమరేసుకోనూ.. బరువులు తెలియని పసితనం, బాధ్యతే లేని బాల్యం.. తలచుకుంటే అప్పటి జ్ఞాపకాలే తప్ప, ఇప్పటి అనుభూతుల ఆనవాలే లేని బంగారు చిన్న తనపు కాలం! తిరిగి రాని నేస్తం, మరలిపోని బాల్యం!!దేవుడు కనిపించి వరమడిగితే నా గుండె గిన్నెలో దాచుకున్న బాల్యాన్ని మొత్తంగా తిరిగిచ్చేయమననూ!!-- కవిత చక్ర
July 23, 2020 • T. VEDANTA SURY • Memories