ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల్యం:--- యామిజాల జగదీశ్
November 14, 2020 • T. VEDANTA SURY • Poem
  • వయసూ జ్ఞాపకం లేదు
    కారణమూ జ్ఞాపకం లేదు
    ఓరోజు నాన్నతో 
    దెబ్బలు తిని
    ఏడుపుతో మొగమంతా
    ఉబ్బింది
  • మూడో క్లాస్ టీచరుకి 
    భయపడి
    రెండో తరగతిలోనే
    ఉండిపోవాలనుకున్న రోజులవి
  • ఇంటికి దగ్గర్లో ఉన్న లైబ్రరీలో
    చిన్న పిల్లల బొమ్మల కథల పుస్తకాన్ని 
    ఎవరికీ తెలీక దొంగిలించిన రోజు
  • ఎలిమెంటరీ స్కూల్ రోజుల్లో
    తోటివారితో ఆటపాటలూ
    అల్లర్లూ
    అలకలూ 
    జగడలూ
    అనేకానేకం
  • తూనీగను పట్టుకుని 
    దానికో దారం కట్టి 
    ఓ చిన్న మట్టిబెడ్డను
    తీయించడం
    చప్పట్లు చరచి ఆనందించడం
    అల్లంతలోనే 
    దానీ తోక తెగి చనిపోవడం
    ఒంటరిగా కూర్చుని ఏడవడం
    ఇప్పటికీ గుర్తే
  • దేవుడికి నీరివ్వడానికి
    తిరస్కరించిన కారణంగా 
    తొండకు శిక్ష విధించిన రోజూ
    జ్ఞాపకమే
    ఆ గుంపులో నేనూ 
  • స్కూల్లో సాయంత్రం
    బెల్లు కొట్టడంతోనే
    గోల గోల చేస్తూ
    ఇంటికి పరిగెట్టుకుంటూ
    వచ్చిన రోజులన్నీ గుర్తే
    ఓమారైతే 
    చూసుకోకుండా గోడకు డీకొని
    కిందపడి గాయపడి 
    ఏడ్చిన సంఘటనా గుర్తే
  • ఇంటర్వెల్లో స్కూలు గేటు దగ్గర
    బండీమీద మామిడికాయ బద్దలు
    కొనుక్కుతినడం
    బఠాణీలు దాచుకుతినడం
  • లెక్కలు, జాగ్రఫీ, ఇంగ్లీష్ టీచర్లంటే
    చచ్చేంత భయం
    వాళ్ళు సెలవు పెట్టారంటే 
    పట్టరాని ఆనందం
  • అల్లరి చేసి 
    క్లాసు బయట
    గోడకుర్చీ వేయడం
    ఇతరులు నవ్వితే
    ఉడుక్కుని ఏడవడం
    ఇలా ఒకటేంటీ
    బాల్యమంతా బలే బలే
    పసందు, బహు పసందు
  •