ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం - 24--శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ :701 3660 252
September 30, 2020 • T. VEDANTA SURY • Memories

బాలసాహిత్యాన్ని అభివృద్ధి చేసిన వారిలో చాలామంది బాలసాహిత్య వేత్తలు ఉన్నారు. అందులో చాలామంది  కనుమరుగైపోయారు. ఈనాటి  తరంవారికి ఆనాడు బాలసాహిత్యానికి కృషి చేసినవారు ఎందరో తెలియకపోవచ్చు. వారిలో కొంతమంది గురించి తెలుసుకుందాం. అద్దంకి కేశవరావుగారు బాలల గురించి చెబుతూ" మొక్కై  వంగనిదే మానై వంగుతుందా" అని అంటారు. మొక్కను తిన్నగా పెంచాలని ఏ విధంగా మనం భావిస్తామో పిల్లలను కూడా బాల్యం నుండి సక్రమమైన పద్ధతిలో క్రమశిక్షణతో కూడుకున్న జీవనం సాగించాలని ఆశిస్తాం . బాలలు ఆ విధముగా మంచి నడవడిక కలిగి పెద్దవాళ్ళవ్వాలంటే  బాల్యం నుండి పెద్దలు వాళ్లని క్రమశిక్షణా పద్ధతులలో  పెంచాలి. అద్దంకి కేశవరావుగారు ఉపాధ్యాయులుగా పని చేసేవారు. వీరు బాలల పత్రికలలో అనేకమైన గేయాలు, గీతాలు, నాటికలు రాసేవారు. దేశభక్తి గేయాలు, నాట్య గీతాలు, బాలల సాహస కథలు అనేకం రాశారు. ప్రకృతిలో గల గులాబీ తోటలు,సీతాకోక చిలుక లు, చిలుకలు, తువ్వాయి, నింగిలోని తారలు, రకరకాల పక్షులు,జంతువులు గురించిఅనేకమైన బాల గేయాలు రాసారు. వీరు రాసిన బాలగేయా లను చూడండి. ''మొక్కకు పువ్వే అందం– కొలనుకు తామరలందం/ నింగికి చందురు డందం-- భూమికి ప్రకృతే అందం/ పాపకు చిరునవ్వందం--ఇంటికిపాపాయందం"// అంటారు. వారు రాసిన మరో గేయం చూద్దాం. "ఐక్యమత్యమూ- ఆత్మ బలము! ఒకటై ఉంటే సంఘబలం! / ఒకటే మాటా, ఒకటే చేతా ! ఒకటే బాటా ఒకటే రాతా / కలిగినవాడూ--కనగా లేడు!
వైరి కన్నెత్తి నిన్నేనాడూ! "// అని ఒక సందేశ గీతాన్ని ఆలస్తారు. విజ్ఞానదాయకమైన, ప్రభోధక ములైన అనేక గీతాలను చాలా సులభశైలిలో రచించారు డాక్టర్ అవసరాల రామకృష్ణారావు గారు మరో బాల సాహిత్య రచయిత. ఇతను హాస్య పూరితమైన భక్తి రసం తో కూడుకున్న అనేకమైన రచనలు చేశారు.“ కేటూ-డూప్లికేటూ''
" గణిత విశారద ” అనే గ్రంథాలను బాలల కోసం రాశారు. “జోకు లేక బతుకు సాకేనేల '' అంటారు అవసరాలవారు. వీరి రచనలు బాలజ్యోతి, చందమామ మాస పత్రికలలో అనేకం కొంచెం  ప్రచురింపబడ్డాయి. " ఆలోచనలు పెంచే రచనలు చెయ్యటమే తన ధ్యేయం " అంటారు అవసరాల వారు. ఆకొండి శ్రీనివాసరాజారావు గారు మరో బాల సాహితీ వేత్త. వీరు ఉపాధ్యాయులు కూడా. సైన్సుకు సంబంధించిన అనేక రచనలను పాటల రూపములో బాలలకు అందించారు. “హరివిల్లు" అనే పుస్తకాన్ని రచించి బాలలకు అందించారు.బాగా ప్రచారంలో ఉన్న గేయాలను ఆధునిక పద్ధతులను అనుసరించి ఈ క్రింది విధముగా వ్రాసియున్నారు. " ఎండలు కాసేదెందుకురా ?వానలు కురిసేటందుకురా !" అనే గేయాన్ని అనుసరించి " చదువులు చదివేదెందుకురా ? మనసులు ఎదిగేటందుకురా!/మనసులు ఏదిగే  దెందుకురా? మమతలు పెరిగేటందుకురా!/మనసులు పెరిగేదెందుకురా? మనమందర మొకట య్యేందుకురా //అని అంటారు. సైన్సుకుసంబంధించిన విషయాలే కాకుండా గణితంపై గీతాలను వ్రాసి బాలలకు అర్థమయ్యే రీతిలో అందిం చేవారు.ఈదుపల్లి వెంకటేశ్వరరావుగారి రచనలను ఒకసారి పరిశీలిద్దాం. వీరు బాలల కోసం రాసిన ఎన్నో గేయాలు, గేయ కథలు అనేక పత్రికలలో ప్రచురితం అయ్యాయి. వీరు ప్రకృతిలో ఉన్న అందాలను, చిత్ర విచిత్రాలను చిట్టిపొట్టి మాటలతో బాలలు వినేందుకు సరదాగా రచనలు చేశారు. వీరు రాసిన ఒక గేయాన్ని చూద్దాం.  " పరుగులు తీసే తరగలు మీరు/  వెలుగులు పూసే దారలు మీరు/ మాయాలోకం మలినమంటని/ మంజుల మల్లెల రేఖలు మీరు"//అని అంటారు ఈదుపల్లి వారు.(సశేషం )