ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -1- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
September 2, 2020 • T. VEDANTA SURY • Memories

బాలసాహిత్యం వ్రాయడానికి పూనుకొనేముందు అందుకు  సంబంధించిన అనేక పుస్తకాలు చదవడం జరిగింది. అందులో రెడ్డి రాఘవయ్యగారు వ్రాసిన  ' బాలసాహిత్య నిర్మాతలు' అనే గ్రంథాన్ని వివర్థనీ సంగీతసాహిత్య సాంస్కృతిక సంస్థ, బొబ్బిలి వారు నన్ను ఉత్తమ ఉపాధ్యా యునిగా ఎంపిక చేసి పురస్కారాన్ని అందజేసిన సందర్భం గా  ప్రముఖ బాలసాహితీవేత్త శ్రీ బెలగాం భీమేశ్వరరావు గారు కానుకగా అందజేసారు.ఈ పుస్తకం2002లో మొదటి ముద్రణ వేయబడింది. ఇందులో 152మంది బాలసాహితీ  వేత్తల జీవిత చరిత్రలుంటాయి.వారంతా బాలసాహిత్యానికి  ఎనలేని కృషిచేసినవారే ! బాలసాహిత్యానికి సంబంధించి నేను చదివిన మరో పుస్తకం డాక్టర్. గంగిశెట్టి శివకుమార్ గారు వ్రాసిన ' తెలుగు బాలకథా సాహిత్యం '   (విహంగ విశ్లేషణ ) అనే గ్రంథాన్ని గంగిశెట్టివారు నాకు అందజేసారు.ఇందులో బాలసాహిత్య స్వరూప వికాసాలు అన్న వ్యాసంలో అనేకమంది ప్రముఖుల  అభిప్రాయాలు అందజేశారు.
నేటి  బాలలే రేపటి పౌరులు అంటారు.''సృష్టి సౌందర్యానికి,మానవుని ఆత్మౌన్నత్యానికి ప్రతిబింబాలు బాలబాలికలు" అంటారు నార్ల చిరంజీవిగారు. ప్రసిద్ధ ఆంగ్లరచయిత జాన్పాల్ రిచర్డ్ " అతి చిన్న గ్రహాలు సూర్యుని దగ్గరగా ఉన్నట్లు మ‌రీ పసికందులు దైవానికి దగ్గరగా ఉంటారు." అంటారు." బాలసాహిత్యపు మూల ధ్యేయం బాలలలో సత్ప్రవర్తనకలిగించడం. వారిని మాతృభూమిని ప్రేమించే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం అంటారు మద్దులూరి రామకృష్ణ." ఉత్తమ బాలసాహిత్యం పలుకుబడిని నేర్పుతాయి. మాతృ భాషాభిమానాన్ని , జాతీయతను రేకెత్తిస్తాయి. వినడంలో, చదవడంలో,మాట్లాడటంలో సిగ్గునీ,సంకోచాన్నితుడిచివేసి లోని శక్తిని పైకి చూపిస్తాయి.  జిజ్ఞాసను,చైతన్యాన్ని విరబూయిస్తాయి " అంటారు మిరియాల రామకృష్ణ. ఇటువంటి ప్రసిద్ధ రచయితల భావాలను ఉటంకించమేగాక గంగిశెట్టివారు బాలల గురించి చెబుతూ   "బాలప్రపంచం విచిత్రమైనది. అచట బాధలుండవు. క్రోధా లుండవు. మోసాలుండవు. మాయామర్మం తెలియని మరో ప్రపంచం వారిది"అంటారు తన మొదటివ్యాసంలో. బాలలుఅంటే ఎవరు ? ఏయే వయస్సు గలవారు బాలలు ? అన్న ప్రశ్నలు బాలసాహిత్య రచయితలలో ఉద్భవించాయి. ఈ సందర్భంగా గంగిశెట్టివారు తను వ్రాసిన ' బాల సాహిత్య  స్వరూప వికాసాలులో చాలామంది ప్రముఖుల అభిప్రాయాలను అందజేశారు. " బాలబాలికలు అంటే పదహారేండ్లకు 
లోబడిన పిల్లవారని శబ్ద రత్నాక‌ర కర్తలు, ఆంధ్రవాచస్పతికర్తలు" చెప్పారు. కేంద్ర ప్రభుత్వ శాసనాల ప్రకారం భారతదేశంలో 16 ఏళ్ల వయసులోపు బాలురు, 18 ఏళ్ళు నిండని బాలికలు పిల్లలుగా పరిగణింపబడతారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో  14 ఏళ్ల లోపు వారు పిల్లలుగా పరిగణింపబడతారు " అని  గంగిశెట్టి వ్రాసారు. కానీ నాఅభిప్రాయంలో కేంద్ర ప్రభుత్వ శాసనాలు అవి నిజ జీవితంలో ఎంతవ‌రకూ సమంజసంగా ఉండగలవో ఆలోచిద్దాం. 16ఏళ్ల అబ్బాయి కన్నా 15 సంవత్సరాల అమ్మాయి యొక్క మైండ్ బాగా  మెచ్యూర్  అయిఉంటుంది. ప్రణయ గీతాలు పాడాలన్నా, సంసార జీవితంలో 20 సంవత్సరాలు పైబడిన పురుషునితో సరస సల్లాపాలాడాలన్నా , సమ ఉజ్జీగా ఉండాలన్నా లేక మాట మంతీ ఇతర ఆలోచనల్లో పురుషుడిని డామినేట్ చేసేస్తోంది.  ఉదాహరణకు కొన్ని సినిమాల్లో హీరోయిన్ వయస్సు14,15,16 దాటి ఉండదు. కానీ ఆమె 25 నుండి 60 సంవత్సరములమధ్యనున్న హీరోలతో నటించినప్పుడు  సందర్భాను సారం సీన్ ను బట్టి  తన హావ భావాలను మార్చగలదు. చక్కగా నటించ గలదు.  ఆ కారణంగా 18సంవత్సరాలు లోపు గల అమ్మాయి, బాలుడు కన్నా  ప్రౌఢసాహిత్యాన్ని అర్థం చేసుకోగల స్థితిలో ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి.  గంగిశెట్టివారు 1967లో ఢిల్లీలో జరిగిన అఖిల భారత బాలసాహితీవేత్తల మహాసభ నిర్ణయాన్ని కూడా వారు తన గ్రంథంలో  ఉటంకించారు.  1).  0---6 ఏళ్ల మధ్య వయస్సు  2). 6---9 ఏళ్ల మధ్య వయస్సు.  3). 9--12 ఏళ్ల మధ్య వయస్సు. 4). 12--15ఏళ్ల మధ్య వయస్సు గల బాలలు వివిధ రకాల బాలసాహిత్యానికి అర్హులు. పిల్లలు పుట్టినప్పటి నుండి అయిదేళ్ళ వరకూ మొదటి దశగా పేర్కొనేవారు. ఈకాలంలో  తల్లి దండ్రులు, తాతమ్మలు చిన్న చిన్న కథలు చెప్పడం, చిన్న చిన్న పాటలు చెవులకు శ్రావ్యంగా పాడటం చేసి ఆటలు ఆడించేవారు. అయిదు సంవత్సరాల వయసు దాటి ఆరువచ్చేసరికి ఒకటవతరగతిలో జాయిన్ చేసేవారు. అంత వరకూ శ్రవణ రూపంలో సాహిత్యాన్ని బాలలకు పెద్దలు అందించేవారు. కానీ పిల్లల మేథాశక్తి ( I.Q ) పెరిగింది.  నాఉద్దేశంలో 0 నుండి 3సంవత్సరాలస్థాయిలో కొంతమంది పిల్లలకు  పూర్తిగా మాటలు రాకపోయినా ఆ జంతువుల ఆటలు చూసి ఆనందపడతారు. కొన్ని జంతువుల అరుపు లను చూసి అనుకరిస్తారు. మరికొన్ని జంతువుల అరుపు లను విని భీతిల్లుతారు. . పరిస్థితులు మారాయి. పాటలు పాడటానికి, కథలు చెప్పటానికి. అమ్మమ్మలు, నాన్నమ్మలు లేరు. అమ్మా, నాన్న  ఉద్యోగాలకు  ఉదయం  వెళ్లి ఏ రాత్రికో వస్తారు. ఆయాలే దిక్కు. ఈ వయస్సు గల పిల్లలు 3వ ఏట దాటి 4 వ ఏడు వచ్చేసరికి  ఎల్. కే. జి  లో చేరి 5 సంవత్స రాల వయస్సులో యు.కె.జి లో  కూర్చొని చదువు నేర్చుకుం టున్నారు. కిండర్ గార్డెన్ స్దాయి నుండే బాలల చదువు స్వరూపం మారిపోయింది. అలానే బాలసాహిత్య స్వరూపం కూడా  మారిపోతుంది. శ్రావ్య రూపం నుండి కావ్య రూపంలో ఉండే బాల సాహిత్యాన్ని సృష్టించాలి. నేటి పరిస్థితులకు అనుగుణంగా బాలసాహితీవేత్తలు రచనలు చేయాలి.( సశేషం )