ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -10- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
September 14, 2020 • T. VEDANTA SURY • Memories

సాహిత్య రంగంలో కుఠిల రాజకీయాలు నడుపుతున్నవారికి ఏడుపే మిగిలిపోతుంది. ఎవరి సత్తా వారిది.ఎవరి పరిధిలో వారు వ్రాస్తారు. ఎవరికివారు ఉన్నతులమని, తమంతటి రచయితలు లేరని భావించుకోవచ్చు. అది అంహంకారం మాత్రమే! అహంకారం ఎప్పుడూ మనిషిపతనానికి దారితీస్తుంది. నిండుకుండ తొనకదనే సామెత ఉంది. ఏమీ రానివాడే నాకంతా వచ్చు ఎదుటివాడికేం రాదు
అని విర్రవీగుతాడు. పెద్దవారిని చూసి ఇంకా నేర్చుకోవాలి అనే తపన మనిషిలో ఉండాలి. ఎవరి పరిధి ఏమిటో వారే గుర్తెర గాలి. తనకంటే ఉన్నతమైనవారుంటారని గ్రహించాలి.ఏ చెట్టూ లేని దగ్గర ఆముదపు చెట్టే మహా వృక్షమని మనంగ్రహించాలి. కేంద్రసాహిత్య అకాడమీవారు విశాఖపట్నంలోనిర్వహించిన సభకు తనను ఎంపిక చేయలేదనే ఓర్వలేని తనం ఆ వ్యక్తి గుణాన్ని అకాడమీవారు తెలుసుకోగలిగారు.ఆ కారణంగా ఆ వ్యక్తికి సాహిత్య అకాడమీ కార్యక్రమాల్లోభవిష్యత్తులో పాల్గొనే అవకాశం మరిరాదని భావిస్తున్నాను.
ఏ వ్యక్తికి  ఏ సంస్థవారు  సన్మానం చేస్తారని తెలిసినా సన్మానింపబడే వ్యక్తి కన్నా ముందుగా ఈర్ష్యాపరుని యొక్కఫోన్ గానీ, ఉత్తరంగానీ ముందుగా వెళ్తుంది. ఈ ఈర్ష్యా పరుని ఉత్తరాలు, ఫోన్లు విషయం ఆ సంస్థవారి ద్వారా సన్మానితునికి ముందుగానే చేరిపోతున్నాయి. ఎందరో పెద్దరచయితలు ఈర్ష్యాలువు అగ్ని శిఖలకు బలి అయిన వారున్నారు. అయితే ఆ వ్యక్తులు ఈ ఈర్ష్యాలువును విడిచి
పెడుతున్నారా అంటే అదీలేదు. వారికి అవకాశం వచ్చినప్పుడు వారి ప్రతాపాన్ని వారు చూపించే సందర్భాలు అనేకం
ఉన్నాయి.మనుషి మనస్థత్వాన్నితెలుసుకొని ఈర్ష్యాలువకు  జరపవలసిన సన్మానాలు జరపకూడదని నిర్ణయించు
కున్నట్టు అట భోగట్టాలను ఆ నోటా ఈనోటా వినడం జరిగింది. అవతలివాని " కేరెక్టర్ " ఎటువంటిదో  సంస్థలు పసిగట్టినట్టున్నాయి. తగిన శాస్థి జరిగిందని మనం భావించాలి. ఆ కారణంగా నేను చెప్పదలచుకున్నదేమిటంటేఒకరిదారిలో ముళ్లకంపలు వేయకుండా తమదారిన తాము  నడచుకుంటూ వెళ్తే బంగారు  పల్లకిలో  ఊరేగింపుగా వెళ్ళొచ్చు. లేకపోతే పదిమందిచే " ఛీ...ఛీ" లు తప్పవు. 
సాహిత్య రంగంలో కృషి చేసి జంథ్యాల వారి శైలిని  చేరుకోవడం మంచిది. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు  బాలసాహిత్యంలో చాలా పద్యాలు రాశారు అలానే ప్రౌఢసాహిత్యంలోనూ  అనేక పద్యాలు రాయడం జరిగింది అయితే బాలసాహిత్యంలో కరుణశ్రీ గారు రాసిన పద్యాలు చదివినవారికి ఎంత మధురంగా తేలికైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయో తను వ్రాసిన ప్రౌఢసాహిత్యం కూడా అంతే మధురంగా ఉంటుంది. ఇందులో వ్యత్యాసం అంటూ ఉన్నదనుకొనేందుకు ఏమీ లేదనిపిస్తుంది. నేను ఏడవ తరగతి చదువుతున్న రోజుల్లోనే మాకు తెలుగు పాఠ్య పుస్తకంలో అన్నింటికంటే ముందుగా  కరుణశ్రీ గారు రాసిన ఒక పద్యాన్ని విద్యార్థుల కోసం ప్రచురించడం జరిగింది అదేమిటంటే " నమ్ముము తల్లి నాదు వచనమ్ము ; ధనమ్మునకై  బజారులో/ అమ్మనుజేశ్వ  రాధముల కమ్మను  ని "న్నని బుజ్జగించి నీ/ గుమ్మము లోన నేడ్చు పలుకుంజెలి కాటుకకంటి వేడి భా/ష్పమ్ములు చేతితో తుడిచి వైచెడి భాగ్యమ్ము నీకె యబ్బెరా!! అలానే 7వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో మరో పద్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది అదేమిటంటే "భీష్ముని పైకి కుప్పించి లంఘించు గో/ పాలకృష్ణుని కుండలాల కాంతి/కరిరాజు మొఱపెట్ట  పఱువెత్తు కఱివేల్పు/ముడివీడి మూపుపై  పడిన జుట్టు/
సమరమ్ము గావించు  సత్య కన్నులనుండి/ వెడల్పు ప్రేమక్రోధ వీక్షణములను/ కొసరి చల్దులు మెక్కు గొల్ల పిల్లల వ్రేళ్ళ సందు మాగాయి పచ్చడి పసందు/ఎటుల కనుగొంటివయ్య! నీకెవరు చెప్పి /రయ్య! ఏ రాత్రి కలగంటివయ్యా! రంగుకుంచెతో దిద్దితీర్చి చిత్రించినావు!/ సహజ పాండితికిది నిదర్శనమటయ్య!!" బమ్మెరపోతనపై  జంధ్యాల పాపయ్య పాపయ్య శాస్త్రి గారు వ్రాసారు. కరుణశ్రీ గారు ఉదయశ్రీలో 
'' ధనుర్భంగము " అనే శీర్షికతో వ్రాసిన పద్యాలు హై స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు నేర్పబడ్డాయి. " ధనుర్భంగము"
అనే శీర్షికను " సీతాస్వయంవరం " అనే శీర్షికతో మాకుపాఠ్యాంశంగా ఉండేది. ఈ విషయం నాకు అంతగా ఎందుకుజ్ఞాపకం ఉందంటే --- మా నాన్నగారు టీచర్. నాకు వేసవి శలవులు ముగియక ముందే అంటే మరో నెలలో ప్రారంభం కాబడుతున్న విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాలను కొని తెచ్చి పెట్టేవారు. శలవుల్లోనే తెలుగు, ఇంగ్లీషు సబ్జెక్టులను తనే ముందుగా చదివి నాచే చదివించి వాటికి 
భావం చెప్పి కంఠస్థా చేయించేవారు. సీతాస్వయంవరంలోగల పద్యాలన్నీ చదివినవే చదవడం జరిగేది. అందులో ఉన్న ఒక పద్యాన్ని మరీమరీ చదివేవాడిని. ఆ పద్యం ఏమిటంటే "ఫెళ్ళు" మని విల్లు--గంటలు" ఘల్లు" మనె--గు/భిల్లు" మనె గుండె నృపులకు --- "ఝల్లు" మనియె/ జానకీదేహ ---మొక నిమేషమ్మునందె ;/ నయము జయమునువిస్మయము గదుర.//ఈ పద్యములో ఫెళ్ళు మని విళ్ళు
విరిగిన శబ్దం. అదే సమయంలో ఆ విళ్ళుకున్న గంటలు ఘల్లుమన్నాయి. అక్కడ ఉన్న  రాజుల గుండెలు గుభిళ్ళు  మన్నాయి. సీతాదేవి శరీరం ఒక్క నిముషమ్ములోనే ఝల్లుమంది" ఇవన్నీ ఒక్కసారి జరిగిపోయాయి. ఇలా కరుణశ్రీ  వ్రాసిన అనేక పద్యాలు  మనం ఎంత చదివినా తనివితీరనివిగా ఉంటాయి. ఇవి నిజానికి కరుణశ్రీ పేర్కొన్నట్టు తనబాలసాహిత్యంలోనివి కావు. ప్రౌఢసాహిత్యం లోనివే ! 
హైస్కూలు స్థాయిలో బాలసాహిత్యానికి సంబంధించినవేఇవ్వాలి. కానీ హైస్కూలు స్థాయిలో ఏమిచ్చారో చూడండి.తన రచనలను ఏ స్థాయివారైనా అర్థం చేసుకోగలరు అనివ్యక్తమవుతుంది.  ఈ పద్యం చూడండి  " ఆ మహోజ్వల రజిని మోహన, విహార/ నవ నవానంద బృందావనమ్మునందు/ అమల యమునా నదీ శాద్వలములమీద/ లలితబాల రసాల పల్లవ పరీత/ మధురమంజుల మాలతీ మంటపమున/ పాల ఱా తిన్నెపయి కల్వపూలతోడ/మాల  గట్టుచు కూర్చున్న  బాల యెవరు ?/ ప్రణయమకరంద మాధురీ  భరిత ముగ్ధ/ లోచనమ్ములలోని యాలోచనమ్ము/ లేమొ--  ప్రేమ సుధారసశ్రీముఖ మగు/ఆ ముఖములోని యాకాంక్షలేమొ---త్రిజగతీ సముజ్వల సౌందర్యతిలక మామె/ ముద్దు చేతులతో ప్రేమ పుష్పమాల/ అందమెగ వోయు ఏ కళానందమూర్తి/కంఠము నలంకరింప నుత్కంఠ
పడునొ ?// మరికొన్ని పద్యాలు చూడండి " రాధికా క్రోధమధురాధరమ్మొకింత/నవ్వెనో లేదో! పకపక నవ్వె ప్రకృతి;నవ్వుకొన్నది బృందావనమ్ము ; యమున/నవ్వుకొన్నది ; చంద్రుడు నవ్వినాడు;/విరుగబడి తమపొట్టలు విచ్చిపోవ/  నవ్వినవి రాధ తలలోని పువ్వులెల్ల!!  అవును లేవోయి కపట మాయా ప్రవీణ!/ధీరుడవు మంచి శిక్షనే కోరినావు?/ నిత్య సుకుమారమైన సున్నితపు మేను/ నాదు చేబంతి తాకున నలిగిపోదె?/సొక్కుసోలిన నీ మోము చూడగలనె/చేతులెట్లాడు నిను శిక్షింపనాథ!"// " రాధ పై ప్రేమ అధికమో
మాధవునకు/మాధవునిపైన రాధ ప్రేమయె ఘనమ్మొ"/ఈ రహస్యము నెఱుగలే  రెవరుకూడ /ప్రణయమయ నిత్యనూత్నదంపతులు వారు!" ఇలా అనేక మధురమైన అతిసున్నితమైన పదాలతో పద్యాలను కరుణశ్రీ తమ రచనలలో పొందుపరిచారు. ఈ భాషా సంపదను నేటి రచయితలు పొందాలంటే తప్పనిసరిగా కరుణశ్రీని చదవాలి.  (సశేషం)