ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -11-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,; ఫోన్ : 701 3660 252.
September 15, 2020 • T. VEDANTA SURY • Memories

" పిల్లల ప్రపంచం విచిత్రమైనది. వారి మనస్తత్వం అంతకంటే విచిత్రమైనది. పిల్లలు ఏ ఊరి వారైనా ఏ ప్రాంతం వారైనా, ఏ భాష వారైనా ఇట్టే కలిసిపోతారు.ఆడుకుంటారు. పాడుకుంటారు. తన్నుకుంటారు. మరల కలిసిపోతారు. అది వారి నైజం"  అని డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారు ప్రముఖ బాల సాహితీ వేత్త చెబుతారు. అలానే ప్రముఖ బాల సాహితీ వేత్త మరొకరు ఈ విధముగా ఒక గేయాన్ని వ్రాశారు " పిల్లలకే అల్లరి తెలుసు/ పిల్లలదే మల్లెల మనసు/ అల్లరి మల్లెలు కొల్లగ జల్లీ/ ఎల్లరినీ రంజించుట తెలుసు. ఇక జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఈ విధముగా బాలల గురించి. " విరిసే పువు రేకుల్లారా:/ మెరిసే చివరాకుల్లారా " అని అంటారు. బాల సాహిత్యం ఉండవలసిన విధానాన్ని గురించి డాక్టర్ దాశరధిగారు " నిజమైన బాల సాహిత్యం తియ్యని మామిడి పండులా ఆపాత మధురంగా ఉండాలి. భాష సరళంగానూ, లలితంగాను ఉండాలి.చెప్పవలసిన విషయం పండు ఒలిచి చేతిలో పెట్టి నట్లు ఉండాలి."
అంటారు. ఇక ప్రముఖ సాహితీవేత్త చలం మాటల్లో 
 "పిల్లలకు పాటలు రాయడం కష్టం. దానికంటే మహాకవి 
కావడం సులభం." అంటారు.  బాల సాహిత్యవేత్తలు ఈ మూల సూత్రం పాటించి నంత కాలం బాల వాంగ్మయం బాలల  ఆదరణ పొందుతుంది. దాదాపు 4 దశాబ్దాలకు పైబడి బిడ్డలతో గడిపిన రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు గారు తెలుగు పిల్లలను గురించి  " తెలుగుదేశపు తెలుగు పిల్లలు /తెలుగు వెలుగు లండీ/ తెలుగు--బాలురు తెలుగు బాలికలు/తెలుగు సొమ్ము లండీ/ అనే మనస్ఫూర్తిగా ప్రశంసిస్తారు. బాలసాహిత్యంలో తల్లి బిడ్డను లాలించి నట్లు ఇలా ఒక పాట ఉంటుంది." ఏడవకు ఏడవకు వెర్రి నాగన్న/ ఏడిస్తే నీ కనులు నీలాలు గారు/ నీలాలు గారితే నే చూడలేను/ పాలైన గారవే బంగారు కనుల" // అని ఆశగా బాధపడుతుంది. బాలసాహిత్యంపిల్లలు చదవడానికేకాదు. పెద్దలకు కూడా  ఉపయోగ పడుతుంది. బాలసాహిత్యంలో పంచతంత్ర కథలు,తెనాలి రామకృష్ణుని కథలు, ఈసపుకథలు, నీతి కథలు జాతక కథలు డాన్ క్విక్ సోట్ , నజీరుద్దీన్ , రాబిన్సన్ కథలు పిల్లలకు, పెద్దలకు చాలా ఇష్టం. ఆ కథలను చదివి ఆనంది స్తుంటారు. కథలు చదివినవారు అందులో  లీనమైపోతారు. రాసే భాషకు, మాట్లాడే భాషకు అంతరం తగ్గించాలనే ఉద్దేశ్యముతో రావిపాటి గురుమూర్తిశాస్త్రి గారు పంచతంత్ర కథలు వ్యవహారిక భాషలో రాశారు.  ఇలా అనేక మంది బాల సాహిత్యం పై వివిధ రచనలు చేశారు. అవన్నీ కూలంకషంగా చదివిన తరువాత బాలసాహిత్యంలో కథలు గేయాలు వ్రాయడానికి ఉపక్రమించాలి.  (  సశేషం )