ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -12- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
September 16, 2020 • T. VEDANTA SURY • Memories

బాలహిత్యం పై అనేక మంది రచయితలు తమ తమ అభిప్రాయాలు అనేకవిధాలుగా వ్యక్తపరిచారు. " బాల సాహిత్యం "  అనే పదానికి  పర్యాయ పదాలుగా అనేకం ఉన్నాయి. అవేమిటంటే " పిల్లల సాహిత్యం, బాల సాహితి,  శిశుసాహిత్యం పదాలు ఉన్నాయి. బాల సాహిత్యం అన్న పదం బహుళ  ఆదరణలో ఉంది. మిగిలిన పదాలు చాలామటుకు మరుగున పడిపోయాయి. ఉదహరణకు       "శిశుసాహిత్యం" అనే పదం " బాలసాహిత్యం" అనే పదానికి సరియైనదికాదు. బాలసాహిత్యం 0 నుండి 16సంవత్సరాల వయసు వరకూ గల బాలబాలికలకు వ్రాయబడిన సాహిత్యం. " శిశుసాహిత్యం " అనగానే దాని అర్థం మారిపో తూంది. మన పరిభాషలో " శిశువు " అనగా    0--3 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు అని అర్ధం వస్తుంది అని నేను బాలసాహిత్య రచయితగా భావిస్తున్నాను. ప్రచారంలో ఉన్నదాని ప్రకారం " బాలల కోసం చేసిన సరళ పదాలతో కూడుకున్న రచనలలోనే బాల సాహిత్యం ఉంటుంది అని చెప్పుకోవచ్చు" అని అంటారు సుప్రసిద్ధ బాల సాహిత్య వేత్తలు. కానీ కొడవటిగంటి కుటుంబరావుగారుమాటల్లో       " సాహిత్యం-- పెద్దల సాహిత్యం అయినా  పిల్లలకు పనికి  వచ్చేదంతా పిల్లలు సాహిత్యంగా చలామణి కావడమే మన  సాంప్రదాయం"  అంటారు. ఇక జంథ్యాల పాపయ్యశాస్త్రిగారి  రచనలను చూస్తుంటే బాలసాహిత్యం, ప్రౌఢసాహిత్యం అనిశాస్త్రిగారు విభజించినా చాలావరకు బాలసాహిత్య లక్షణాలు ఉంటాయి. ఈ విషయం పాఠకులకు ఇంతకు ముందు ఎపిసోడ్లో తెలియజెప్పి కరుణశ్రీగారి పద్యాలను కొన్నింటిని ఉటంకించాను. ఇంకా  శ్రీ శ్రీ సాహిత్యం లోకి వెళదాం. అతను వ్రాసిన " పంచ పదులు " అనే గ్రంథంలో చిన్న చిన్న రచనలను చూద్దాం. క్విన్--వన్ అనే కవితలో "  కొత్త మంగళం సుబ్బు /పాత చింతకాయ పచ్చడి రుబ్బు /  మన కథంతా తబ్బిబ్బు/ అయినా కవిత్వం కొట్టదు గబ్బు/అది చదివితే హృదయం ఉబ్బు//ఇక డాగ్గెరెల్  (DOGGEREL) అను రచనలో " అరిచే కుక్కలు కరవవు/ కరిచే కుక్కలు మొరగవు/కరవక మొరిగేకుక్కలు తరమవు/ అరవక కరిచే కుక్కలు మరలవు/అరవని కరవని కుక్కలెక్కడా దొరకవు// స్వజాతి గీతం శీర్షికన " తెలుగువాడి తెలివితేటలకి జై జై/ తెలుగువాడు దేనికైనా సై సై /తెలుగువారి నెదురువాడు నై నై / తెలుగునాట కవుల పాట హై హై/ ప్రస్తుతానికి వస్తా మరి నేస్తం బై బై// "టేల్ విత్ టెయిల్ " అనే గేయంలో " అనగా అనగా ఒక దొరగారు/ ఊళ్లన్నీ  కాళ్ళరిగేట్టు తిరిగారు/ ఎండల్లో ఎండి వానల్లో తడిశారు/ ప్రస్తుతం వారు కాసుకైనా కొరగారు/ అంచేత కొంచెం లెఫ్ట్ కి జరిగారు//  ఇలా శ్రీ శ్రీ గారి సాహిత్యం బాలలు పాడుకునేందుకు వీలుగా ఉంటుంది. ఈ పుస్తకంలో ఇలాంటి రచనలు చాలా ఉన్నాయి. అన్నీ ప్రాసలతోనే వ్రాస్తూ అతి చిన్నవిగా  ఉంటాయి. శ్రీ శ్రీ, వరద, ( వరద అంటే అబ్బూరి    వరదరాజేశ్వరావు ), ఆరుద్ర కలిసి వ్రాసిన  " మేమే" అనే గ్రంథం నుండి కొన్ని రచనలు చూద్దాం." కొత్త పుస్తకం తెరుద్దాం/ కోతి చేష్టలు మరుద్దాం/ కొంగ జపం చెయ్యడం/ పొరుగు బరువు మొయ్యడం / ఎలాగైనా ఇప్పటికైనా /అమలుపరుద్దాం // సిరిసిరిమువ్వలం/ చెరిగిన దవ్వులం/ మృత్యువు పెరట్లో / మందార పువ్వులం /భగవంతుని వితంతువులం/భాషించే జంతువులం/  కరుణకు మా బ్రతుకు/ కవనం మా మెతుకు//అరటి తొడలు గిల్లేద్దాం/
పగటి కలలు జల్లేద్దాం/ ముక్కుకు సూటిగా పోవడం/
ముద్దుకి చాటుగా రావడం/ ఆపేసి అబద్ధం కాని ఆనందం 
నొల్లేద్దాం //లాంటి గేయ రచనలు 29 ఈ గ్రంథంలో చేసారు. అందులో 21 గేయాలలో " మృత్యువు " అనే పదం వివిధ
సందర్భాల్లో వినియోగించబడింది. ఆ గేయాలలో ఆ పదం
చేర్చటం వలన  బాలల మానసిక పరిస్థితులకు ఏదో చెప్ప
లేని చెడును చేకూర్చే అవకాశం ఉంది. ఆకారణంగా ఇటువంటి రచనలను బాలల ముందుకు తేకూడదన్నది
నా అభిప్రాయం.   ( సశేషం )