ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -13- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
September 17, 2020 • T. VEDANTA SURY • Memories

ప్రస్తుత కాలమున బాలసాహిత్యవేత్తలలో ముఖ్యులు వెలగావెంకప్పయ్యగారు, రెడ్డి రాఘవయ్యగారు, అలపర్తి      వెంకట సుబ్బారావు గారు, కలువకొలను సదానందగారు, వాసాల నరసయ్యగారు-- ఇలా చాలామంది ఉన్నారు. వెలగావెంకప్పయ్యగారు, కలవకొలను సదానందగారు,  గతకొద్దికాలం క్రితం మరణించారు. సీనియర్ బాలసాహిత్య వేత్త ఇప్పుడు రెడ్డి రాఘవయ్యగారి  గురించి చెప్పుకుందాం . రాఘవయ్యగారు " బాల సాహితీ సామ్రాట్''  " బాల సాహితి విభూషణ" అనే బిరుదులు పొంది ఉన్నారు. ఇతను ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తున్నారు. శరీర ఆరోగ్యం బాగున్న  కాలంలో మన రాష్ట్రంలోనే గాక, దేశం మొత్తంపై జరిగిన బాలసాహిత్య సమావేశాలకు హాజరైబాలసాహిత్యా  భివృద్ధికి తగు సూచనలు, సలహాలు ఇచ్చేవారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  లో అతను బాలసాహిత్యాభి వృద్ధికి తిరగని చోటంటూ లేదు. అతనిని గౌరవించని, అనుసరిం చని బాలసాహితీవేత్తంటూలేడు. రాఘవయ్య గారు వ్రాసిన 
"బాలసాహిత్య నిర్మాతలు"గురించి మనం చదవ వలసిందే!   ఈ పుస్తకానికి 2002 సంవత్సరంలో ముందుమాట వ్రాసిన ఆనాటి వైస్ -ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.వి.సుబ్రహ్మణ్యంగారు  బాలసాహిత్యం గురించి చెబుతూ "బాలసాహిత్యం మూడు  రకాలుగా ముచ్చట గొలుపుతుంది. 1.బాలల యొక్క  సాహిత్యం 2. బాలలను గురించిన సాహిత్యం. 3. బాలల కొరకు సాహిత్యం అని. 1. బాలల యొక్క సాహిత్యం అంటే -- బాలలు సృజించిన సాహిత్యం  2. బాలలను గురించిన  సాహిత్యం అంటే -- బాలలే పాత్రలుగా బాలలను గురించి
చెప్పిన సాహిత్యం 3.  బాలల కొరకు సాహిత్యం అంటే --బాలల ఉపయోగం కోసం నిర్మించే సాహిత్యం"అని. బాలల అభిరుచులను బట్టి వారు సృష్టించే సాహిత్యంలో ప్రక్రియలు  ప్రవర్తిల్లుతూ ఉంటాయి. ప్రౌఢ సాహిత్యంలో వెలువడే ప్రక్రియల కంటే అవి సుకుమారంగాను, సూక్ష్మంగానూ,  సరళంగానూ ఉంటాయి. బాలల సాహిత్యం ఎంత మధురం గా ఉంటుందో బాలలను గురించి సాహిత్యం కూడా అంతే మనోహరంగా ఉంటుంది. " చైల్డ్ ఇన్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ మ్యాన్ '' అని ఒక ఆంగ్ల సూక్తి. బాలుడు నుండి ప్రౌఢుడు పుడతాడు. బాలుడు మొదటిలో వామనుడు. అతడే తరువాత త్రివిక్రముడు. అంటే బాలుడు బాల సాహిత్యం నుండి ప్రౌఢ సాహిత్యానికి ఎలా ఎదుగుతాడో  ఇక్కడ తెలియజెప్పబడింది . బాలలను గురించి సాహిత్యం బాలలే నిర్మించవచ్చు. లేదా ప్రౌఢులు నిర్మించవచ్చు.  ఎవరు నిర్మించినా బాలలలోని బాల్యత్వాన్నిగాని, ప్రౌఢత్వాన్ని గాని ప్రదర్శించడానికే వినియోగిస్తారు. బాలల కొరకు నిర్మించే సాహిత్యానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది . బాలల వ్యక్తిత్వ వికాసాల పరిరక్షణ భారం ఇప్పుడు పెద్దలదే.ఇదీ సామాజిక నైతిక బాధ్యత " అంటారు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యంగారు.ఇక రెడ్డి రాఘవయ్య గారి విషయానికొస్తే ఏమంటున్నారో చూద్దాం.  "  పెద్దలకు ప్రౌఢ సాహిత్యం  ఉన్నది. అలాగే బాలలకు కూడా బాలసాహిత్యం ఉన్నది.  క్రీస్తు శకం 1800 పూర్వం బాల సాహిత్యం లేదనే చెప్పుకోవచ్చు. ఉన్నా అది లిఖితం కానిది. 1819లో పిల్లల కోసం విక్రమార్కుని కథలు అచ్చయిందనీ,  1950 తరువాత బాల సాహిత్యం బాగా అభివృద్ధి  చెందిందని చెబుతూ,  చాలామంది బాలసాహి త్యానికి అంకితమై కృషి చేసినవారున్నారు అంటారు రాఘవయ్యగారు. రెడ్డి రాఘవయ్య గారు ఈ తరానికి చెందిన బాలసాహిత్యకారులకు మార్గదర్శకులు. అనేకమైన బాల గేయాలు, కథలు, వ్యాసాలు,  నాటికలు, సైన్సుకు సంబంధించిన వ్యాసాలు సాహిత్యకారుల  జీవిత గాథలు గురించి రాఘవయ్య గారు వ్రాయడం జరిగింది. రాఘవయ్య గారు  బాలసాహితీ రంగానికి ఎంతో కృషి చేశారు. బాల సాహిత్యం  విలువలను ముందు  తరాలవారికి తెలియ జేశారు.  అలా బాల సాహిత్యకారుల మదిని దోచారు. రాఘవయ్య గారు రాసిన "సామెతలు - ఆమెతలు  అనే గ్రంథంలో  పిల్లలకు పనికి వచ్చే అనేక నాటికలు ఉంటాయి. ఇవి పెద్దలు కూడా చదవచ్చు. ఈ నాటికలు ఎంతో హాస్య పూరితంగా ఉంటాయి. ఆ గ్రంథం యొక్క పేరుకు తగ్గట్టు గానే ఇందులో కొన్ని నాటికలు యొక్క శీర్షికలను మనం గమనిద్దాం. “ సింగినాదం - జీలకర్ర” , “తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లు ”, “ గుమ్మడికాయ  దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ” ,“ నవ్వు నాలుగు విధాల చెరుపు ”,       " కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువే...!”
 “ మాకు ఉన్నాయి హక్కులు ”  అనే నాటికలు  ఇందులో ఉంటాయి. అయితే రెడ్డి రాఘవయ్య గారు రాసిన   ఈ పుస్తకములో ఉన్న నాటికల తీరు వేరుగా ఉంటుంది. “ మాకు ఉన్నాయి హక్కులు" అనే  నాటిక పిల్లల స్థాయికి కొద్దిగా పెద్దది . ఇందులో నాటిక ప్రారంభములో ఐదు బాల గేయాలను పిల్లలకు అందజేస్తారు . తర్వాత నాటికను ప్రారంభిస్తారు.ఈ నాటికలు చాలా ముద్దుగా హాస్య పూరితంగా ఉంటాయి. భాష గూడా చాలా సరళంగా  చిన్న చిన్న వాక్యాలతో ఉంటుంది. ఇందులో ఉన్న చాలా నాటికలలో  కొన్ని  పాత్రల డైలాగ్స్   ' పెద్ద రైలు బండి ' లా  ఉంటాయి.ఆంధ్రప్రదేశ్ లో  తెలుగు బాలసాహిత్యంలో రెడ్డి రాఘవయ్య గారికున్న పేరు ప్రఖ్యాతులు చిరస్మరణీయం.  (  సశేషం )