ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -14- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,ఫోన్: 7013660252.
September 19, 2020 • T. VEDANTA SURY • Memories

ప్రముఖ బాల సాహితీ వేత్త బాలబంధు అలపర్తి వెంకట సుబ్బారావుగారి గురించి కొంత తెలుసుకుందాం. అలపర్తి వారిని నేను మొదటిసారిగా పార్వతీపురంలో తనకు మంచిపల్లి వారు అవార్డు ఇచ్చి సన్మానం చేస్తున్నప్పుడు కలుసుకోవడం జరిగింది. తర్వాత చిలకలూరిపేటలోనూ, తెనాలిలోను కలుసుకున్నాం. తెనాలి లో జరిగిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో నాకు "బాలబంధు సమతా రావు అవార్డు" అందజేసినప్పుడు అలపర్తివారు ఆ సభకు guest గా రావడం జరిగింది. పార్వతీపురంలో జరిగిన మొదటి పరిచయం తరువాత తన ఇంటికి వెళ్లిన వెంటనే తను వ్రాసిన కొన్ని పుస్తకాలను నాకు పోస్టు ద్వారా పంపి యున్నారు. అలపర్తివారి గురించి మరికొంత సమాచారాన్ని సేకరించడానికి మిత్రులు డాక్టర్ రావెళ్ల శ్రీనివాసరావు గారిచే వ్రాయబడిన " బాలబంధు అలపర్తి వెంకట సుబ్బారావు రచనలు-- పరిశీలన" అనే గ్రంథం కొంతవరకు ఉపకరించింది. అలపర్తిగారు ఫిఫ్త్ ఫారం (అంటే పూర్వం10వ తరగతి అన్నమాట) చదువుతున్నప్పుడే పద్యాలవి వ్రాసేవారు. అలపర్తి వారికి తెలుగు బోధించిన మాస్టారు ఆ పద్యాలలో గల తప్పొప్పులను తెలియజెప్పేవారు. ఇంటర్ చదివే టందుకు కాలేజీలో అలపర్తి వారు చేరిన తరువాత సాహిత్యం  వ్రాయడం పై విపరీతమైన శ్రద్ధ చూపించారు.గేయాలు, గేయ కథలు, కథలు, వ్యాసాలు, పద్యాలు అనేకం వ్రాసేవారు. వాటిని చూసిన అతని యొక్క తెలుగు ట్యూటర్ ఎంతగానో మెచ్చుకొనేవారు. ఇంటర్ ముగిసేలోగా "బాలానందం"అనే మొదటి గేయ సంపుటిని ప్రచురించారు. గురువుల ప్రోత్సాహంతో అనేక  రచనలను నిరంతరం కొనసాగించేవారు. మృదువైన పదాల పొందికతో బాల గేయాల రచనలు చేయసాగారు. అలపర్తి వారు తను రాసిన 32 గ్రంథాలను అచ్చు వేయించారు. ఇంకా అముద్రితాలుగా చాలా ఉన్నాయి. అలపర్తి వారు నాకు పంపినవి కొద్ది పుస్తకాలే అయినా అందులో  ' ఇందిర అలుక మానింది' “ఏకలవ్యుడు” ముఖ్యమైనవి. ఇందిర అలుక మానింది అనే పుస్తకం పిల్లలను, పెద్దలను బాగా ఆకట్టుకుంటుంది. ఈ పుస్తకం నాలుగు సార్లు ముద్రించబడింది. ఏకలవ్యుడు అనే పుస్తకం రెండుసార్లు ముద్రింపబడింది. అలపర్తి వారు వ్రాసిన చిట్టి కవితలు అనే  గ్రంథం లో  కోడి, కాకి, కుక్క ,కోతి, తేలు, బల్లి, పిల్లి, బాతు, ఏనుగు, హంస , సీతాకోకచిలుక ,పంది, నెమలి,కుందేలు మొదలగు మధుర గేయాలు, బాల గేయాలు వ్రాయబడ్డాయి.  అలపర్తి వారి  కొన్ని బాల గేయాలను చూద్దాం ఎలుక టోపీ అనే కథలో ఈ గేయాలను చూడండి. ఎలుక దర్జీవాని దగ్గరకు వెళ్లి ఏముంటుందో చూద్దాం. " టోపీ నువ్వు కుట్టివ్వకపోతే/ మాపటికే నీ పని పడతా/ కొట్టు మూసి నీవింటికి పోతే/ ఇట్టే వచ్చి నీ గుడ్డలు కొడతా// మహారాజు గారి మహల్ కు వెళ్లి రాజుగారి వినేలా ఇలా పాడుతుంది. " అందమైనది నా టోపీ/ సుందరమైనది నా టోపీ/ రాజాగారి టోపీ కన్న/ రంగూ హంగూ దీనికె మిన్న"/ వన్నె చిన్నెల నా టోపీ పై/ కన్నేశారు, కాజేశారు, రాజా గారు/ముచ్చటగా తలపై పెట్టుకొని/ మోజు తీర్చు కొను మహరాజా-- ఇహ రోజూ"/ అంటూ పాడుకుంటుంది ఎలుక !  అలపర్తివారి గురించి రేపటికి మరికొన్ని....  సశేషం