ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -14-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
September 18, 2020 • T. VEDANTA SURY • Memories

బాలసాహిత్యంలో తొలి కవితలు  ఏనాటివో ఇదమిద్దంగా చెప్పలేము. బాలసాహిత్యానికి కర్త ఎవరో ఇంతవరకూ తెలియదు. తల్లి ప్రేమకు పాత్రమైన బిడ్డలపై  తల్లులు తొలి పాటలు  పాడితే తొలికవులుగా రచయితలుగాపరిగణింప  బడతారు. దీన్ని బలపరుస్తూ " బాల  వాంగ్మయ బ్రహ్మ " చింతాదీక్షితులు గారు " బాలవాంగ్మయం లోని బాల పాటలకు, తల్లి హృదమే కర్త్రుత్వం వహిస్తుంది. " అని అంటారు. ఇక నార్ల చిరంజీవి గారు " తల్లి తన తీయని పెదవులతో బిడ్డని తన మనసారా స్పృశిస్తుంది. ఆ మధుర హృదయం  నుంచి ఏవేవో పిలుపులు,గుసగుసలు,  మాటలుగా, పాటలుగా బాలసాహిత్యానికి ఆలంబనం అవుతుంది. ఆ మాటలే, పాటలే  ఏనాటికీ చెరగని తరగని మధుర నిధులు అవుతాయి" అంటారు.కనుకనే వాల్మీకి ఆది కావ్యానికి నాంది విషాదం అయితే- సాహిత్యానికి నాంది తల్లి నిండు హృదయం అవుతుంది. పిల్లల బాలగేయాలు ఒక పట్టున రాసినవి కావు. తల్లుల నోటిపరంగా రాలిన ఆణిముత్యాలు. బిడ్డల మాటవాటుగా వెలువడిన మంచి ముత్యాలు. గల గల ఒంపుసొంపులతో ఉగ్గు పాటలు, పండుగ పాటలు, ఎగతాళి పాటలు ఇలా ఎన్నో రకాలైన పాటలు ఉన్నాయి అంటారు వెలగా వెంకటప్పయ్య గారు. కొందరు తల్లులు పాటలు పాడుతూ బిడ్డకు శరీర వ్యాయామం కూడా చేస్తారు. " చేయి ఊచమ్మ చేయి పూచు/ సంతకు పోదాం చేయి పూచు/ శనగలు తిందాం చేయి పూచు/ చల్లగ తిందాం చేయి పూచు-// అని పాట పాడుతూ పాపకు శరీర వ్యాయామం చేయిస్తుంది తల్లి. ఇక ఉగ్గుపాలు బిడ్డకు తల్లి తాగిస్తూ “ ఊ...ఊ... ఉంగన్న/ ఉగ్గు పాలు ఇందన్న/ గెంటెడు ఉగ్గు కమ్మన్న/ ఉమ్మక   కక్కక మింగన్న / అంటూ....'' జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం/ గుర్రాల్ దిన్న గుగ్గిల్లరిగి/ఏనుగుల్ దిన్న  వెలక్కాయ లరిగి//" అని త్రాగిన పాలు కరిగి పోవాలని తల్లి పాపాయి ఉద్దేశించి పాట పాడుతుంది. ఇక బిడ్డ ఏడ్చేటప్పుడు తల్లి  పాడే లాలి పాటను చూద్దాం. " ఏడవకు ఏడవకు వెర్రి నాగన్న/ ఏడిస్తే నీ కన్నులు నీలాలు గారు/ నీలాలు గారితే నే చూడలేను/ పాలైన గా రావే బంగారు కనుల//"అంటుంది. ఇటువంటి బాల గేయాలే కాదు ప్రముఖ రచయితలు కవి రావు, నార్ల చిరంజీవి గారు రాసిన శతకాలను చూద్దాం. కవిరావు గారు
ముద్దు పాప అనే శతకంలో " బడికి వేళకేగి పాఠాలు వల్లించి/ కొత్తవాని నేర్చుకొనగ వలయు/క్రమముతప్పకుండ శ్రమ జేసితేనియ/ వృద్ధి పొందగలవు ముద్దు పాప//" అని అంటారు. నార్ల చిరంజీవిగారు ' తెలుగు పూలు' శతకంలో ఇలా అంటారు " దేశమేదన్నచో తెలుగు దేశమనుము/
జాతి యేదన్నచో తెలుగు జాతియనుము/ వంశ మేదన్నచో తెలుగువాడ ననుము/ తెలుగు కీర్తిని చాటుము తెలుగు బిడ్డ//---- నార్లవారే మరోచోట ఈ క్రింది శతక వాక్యములను చెబుతారు----" విప్లవ గుణశాలి వీరేశలింగము/ పెంకె పండితులకు పిడుగు గిడుగు/ మన మహా మనిషి మనవాడు గురజాడ / తలచుకొనుము వీరి తెలుగు బిడ్డ//---అని. ఆనాటి నుండి ఈనాటి వరకు బాల గేయసాహిత్యం  ఎన్నోవిధాల పరిపుష్టి చెందింది. బాలసాహిత్యంలో ఆనాడు పరిమితంగా ఉన్న బాలసాహిత్య రచయితలు ఈనాడు వందలకొలది తయారై ఉన్నారు. బాలసాహిత్యానికి కొదువు లేకుండా వేనక వేలు రచయితలు  తయారై బాలసాహిత్యం వ్రాయడం జరుగుతుంది. బాలాంత్రపు రజినీకాంతారావు గారు వ్రాసిన పాటను చూద్దాం. " డీ డీ డీ డీ డిక్కు/డీకాడీకా వేడెక్కు/ పాప బుర్రా, నాన్న బుర్రా/ ఢీ కొంటున్నా యెల్లాగర్రా/ పాము బుర్రా మంచి బుర్రా/ ఎవరైనా చెప్పండర్రా// అంటూ తండ్రి బిడ్డను ఆడిస్తూ పాడతాడు. ఇక న్యాయపతి రాఘవరావు గారు పొట్టి బావ పేరుతో రాసిన హాస్య గేయాన్ని చూద్దాం. " పొట్టి బావ పొట్టి బావ ఏం చేశాడు/ ఉట్టిమీద చట్టిలో పెరుగు చూశాడు/పెరుగు చూసి నోరు ఊరి ఎగిరి చూశాడు/ ఎగిరి ఎగిరి అంద లేక క్రింద పడ్డాడు//-- ఈ గేయం వినడానికి వినసొంపుగా, ఆశక్తి కరంగా  ఉంటుంది. అందరికీ నవ్వును తెప్పిస్తుంది.
అళ్ళ రాఘవయ్యగారు వ్రాసిన గేయాన్ని  చూద్దాం. " మా చెట్టు మీద పిట్ట, మాపై వేస్తుంది రెట్ట /గుడిలో పూజారిగారు గుడి దోస్తున్నా రెట్ట// ఇలా ఇలా చమత్కార ధోరణి లో ఈ గేయం ముందుకు సాగింది. ఇవిగాక బాలసాహిత్యంలో అనేక గేయ కథలు కూడా వ్రాయబడ్డాయి. చందమామ లోని తొలి గేయ కథ "రాజుగారు-- దోమ గారు" అన్నదానిని ప్రచురించారు. ఈ  గేయ కథ ఎంత బాగుంటుందో చూడండి. " రాజుగారి ముక్కు మీద దోమ పుట్టిందీ,/ రాజ్యంలో ప్రజలకంతా హడలెత్తింది/ సామంతులు సర్దార్లూ, బంట్లూ, సైన్యాధి పతులు/ కత్తులతో ఈటెలతో/ కదనానికి లేచి నారు//--- అయినా దోమను చంపడం ఎవరికీ సాధ్యపడ  లేదు. ఇలా గేయాలను, గేయ కథలను రకరకాలుగా  రాయొచ్చని మనము తెలుసుకొనిగేయ రచనలో ముందుకు పోవాలి. ఈ వ్యాసం వ్రాయడానికి వెలగావెంకప్పయ్యగారి “ తెలుగు బాల సాహిత్యం ”  ఉపయోగపడిందని  తెలియ
జేయడానికి సంతసిస్తున్నాను.  (  సశేషం )